ఆండ్రాయిడ్‌ వచ్చింది.. కెమెరాల కోసమా?
close

Published : 27/06/2021 22:16 IST
ఆండ్రాయిడ్‌ వచ్చింది.. కెమెరాల కోసమా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆండ్రాయిడ్‌.. యాపిల్‌ ఫోన్లు మినహా దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్లలో ఉండే ఆపరేటింగ్‌ సిస్టమ్‌. గూగుల్‌ అభివృద్ధి చేసిన ఈ ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో తొలిసారి 2008లో స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. అంతకుముందు సింబియన్‌, విండోస్‌ మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉన్న మొబైల్స్‌ విక్రయించేవారు. కానీ, వీటి కంటే మరింత మెరుగైన ఫీచర్లతో మొబైల్‌ మార్కెట్లోకి ప్రవేశించింది ఆండ్రాయిడ్‌. కానీ, నిజానికి ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ను రూపొందించింది మొబైల్‌ఫోన్ల కోసం కాదంటే నమ్మగలరా?

అమెరికాకు చెందిన ఆండీ రూబిన్‌, రిచ్‌ మైనర్‌ మరికొందరు కలిసి 2003లో ఆండ్రాయిడ్‌ పేరుతో ఒక ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను రూపొందించారు. దీన్ని మొదట్లో డిజిటల్‌ కెమెరాల్లో ఇన్‌స్టాల్‌ చేయాలనుకున్నారు. ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫాం ద్వారా కెమెరాతో తీసిన ఫొటోలను మెమొరీకార్డులో సేవ్‌ కావడం.. వాటిని కంప్యూటర్‌లో సేవ్‌ చేసుకోవడం ఇవేవి లేకుండా నేరుగా కెమెరా నుంచే ఫొటోలను క్లౌడ్‌లో భద్రపర్చే విధంగా ఓఎస్‌ను రూపొందించారు. అయితే, దీని మార్కెట్లోకి తీసుకొచ్చేముందు పలు అధ్యయనాలు చేయగా.. డిజిటల్‌ కెమెరాల వినియోగం రోజుకురోజుకు తగ్గిపోతున్నట్లు తేలడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. 2005లో వీరి నుంచి ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను గూగుల్‌ కొనుగోలు చేసింది. దీంతో ఆండీ రూబిన్‌ కూడా గూగుల్‌లో చేరి ఆ కంపెనీ మొబైల్‌ అండ్‌ డిజిటల్‌ కంటెంట్‌ విభాగానికి వైస్‌ ప్రెసిడెంట్‌ అయ్యారు. ఆండ్రాయిడ్‌ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. అలా కెమెరాలో ఉండాల్సిన ఆండ్రాయిడ్‌.. మొబైల్‌ ఫోన్లలో చేరి విప్లవాత్మక మార్పులు తెచ్చింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది.. గూగుల్‌ సంస్థ ఆండ్రాయిడ్‌కు అనేక ఫీచర్లు జోడిస్తూ ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్లు తీసుకొస్తోంది. గతేడాది ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 11ను విడుదల చేసింది. త్వరలో వెర్షన్‌ 12ను కూడా విడుదల చేయబోతోంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న