పిల్లుల అరుపులకు అర్థం చెప్పే యాప్‌..!
close

Published : 16/11/2020 23:33 IST
పిల్లుల అరుపులకు అర్థం చెప్పే యాప్‌..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: శునకాల తర్వాత మనుషులకు దగ్గరైన పెంపుడు జంతువు పిల్లి. చాలా మంది వీటిని తమ ఇళ్లల్లో పెంచుకుంటుంటారు. పిల్లులు సైతం ఇంట్లో అటుఇటు తిరుగుతూ, సందడి చేస్తూ కుటుంబసభ్యుల్లో ఒకరిగా మారిపోతాయి. అవి మన మాటల్ని అర్థం చేసుకోగలుగుతాయి. మనం చెప్పినట్లు చేస్తాయి. కానీ, మియావ్‌‌‌.. మియావ్‌ అంటూ పిల్లులు అరిచే అరుపులకు అర్థమేంటో మనుషులకు అసలు అర్థం కాదు. సమయానికి భోజనం పెట్టడం, కాలక్షేపం కోసం వాటితో ఆడుకోవడం చేస్తారంతే. అయితే, ఓ ఇంజినీర్‌.. పిల్లులు వాటి అరుపులు ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాయో తెలిపే ఒక యాప్‌ను రూపొందించారు.

అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ జేవియర్‌ శాంచెజ్‌ ప్రస్తుతం అక్వెలోన్‌లో ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేస్తున్నారు. గతంలో అమెజాన్‌లో ‘అలెక్సా’ను రూపొందించడంలో కీలకంగా పనిచేశారు. ఆ అనుభవాన్ని ఉపయోగించి తాజాగా పిల్లుల భాషను ఇంగ్లీషులో తర్జుమా చేసే ‘మియావ్‌టాక్‌’ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ పిల్లుల అరుపులను రికార్డు చేసి అవి ఏం చెప్పాలనుకుంటున్నాయో ఇంగ్లీషులో తెరపై చూపిస్తుంది. ఇప్పటివరకు పిల్లులకు సంబంధించి తొమ్మిది రకాల భావాలను శాంచెజ్‌ గుర్తించారు.

పిల్లుల అరుపుల్లో ‘ఐయమ్‌ హంగ్రీ(ఆకలిగా ఉంది)’, ‘ఐయమ్‌ హ్యాపీ(సంతోషంగా ఉంది)’, ‘ఐయమ్‌ ఇన్‌ పెయిన్‌(నొప్పిగా ఉంది)’ వంటి భావాలు ఉంటాయట. మరికొన్నింటిని కనిపెట్టి ఈ యాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాదు, ఎవరికైనా పిల్లుల అరుపుల్లో కొత్త భావం కనిపిస్తే యాప్‌కి జతచేసే సదుపాయం కల్పిస్తున్నారు. ప్లేస్టోర్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ ప్రస్తుతం ప్రయోగదశలో ఉంది. ఈ యాప్‌ వల్ల పిల్లులు.. యజమానులకు మధ్య బంధం మరింత మెరుగవుతుందని శాంచెజ్‌ చెబుతున్నారు. మరి, మీరూ పిల్లుల్ని పెంచుకుంటున్నారా..? అయితే, ఈ ‘మియామ్‌టాక్‌’ యాప్‌ను ఓసారి ప్రయత్నించి చూడండి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న