జీవకణంలో జవాబు దొరకని ప్రశ్నలు
close

Updated : 24/03/2021 08:00 IST
జీవకణంలో జవాబు దొరకని ప్రశ్నలు

సైన్స్‌ సంగతులు

క సాధారణ జీవకణం మామూలుగా పెరుగుతూ హఠాత్తుగా క్యాన్సర్‌ కణంగా ఎలా మారుతుంది? కణం కొన్ని లక్షల రెట్లు పునరుత్పత్తి అయ్యి.. అవయవంగా రూపు దిద్దుకోగానే పెరుగుదల ఎలా ఆగుతుంది? జీవకణాల మధ్య సమాచార వ్యవస్థలో మర్మం ఏంటి?.. ఇలా జీవకణశాస్త్రంలో అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అనుదినం శరీరంలోని ప్రతి జీవకణం నిరంతరం ఎన్నెన్నో మార్పులు చెందుతుంటుంది. ఒక్కోసారి ఇవి అవసరానికి మించి విభజనకు లోనవుతుంటాయి. అలాంటి సందర్భాల్లో శరీర రక్షణ వ్యవస్థ అప్రమత్తమై వాటిని శరీరం నుంచి బహిష్కరిస్తుంది. కొన్ని సార్లు అత్యంత అరుదుగా  విభజిత కణాలు శరీర రక్షణ వ్యవస్థపై విజయం సాధిస్తాయి. దీంతో ఊహించని స్థాయిలో కణాల పెరుగుదల ఎక్కువై క్యాన్సర్‌కి దారి తీస్తాయి. కణంలో ఏ లోపం వల్ల విభజన క్రమరహితంగా మొదలవుతుందో తెలిస్తే.. క్యాన్సర్‌ ఆట కట్టించొచ్చు. కానీ, ఇప్పటికీ అది సాధ్యం కాలేదు. పిండం పెరిగి శిశువుగా మారడానికి.. సాధారణ కణం పెరిగి క్యాన్సర్‌ కావడానికీ మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. పిండం శిశువుగా రూపుదిద్దుకునే క్రమంలో ఒక్కో కణం గంటలు, రోజుల కాలంలోనే కొన్ని లక్షల రెట్లు పునరుత్పత్తి అవుతుంది. అవయవం సరైన రూపం పొందగానే పెరుగుదల ఆగిపోతుంది. ఎందుకీ పెరుగుదల ఆగుతుందో అంతుచిక్కడం లేదు. అయితే, ఇక్కడ శాస్త్రవేత్తలు ఓ కొత్త విషయాన్ని గుర్తించారు. జీవ ప్రపంచంలో అన్ని జీవరాశులకు ఉమ్మడిగా కనిపించిన విషయం సెల్‌ కమ్యూనికేషన్‌. అంటే.. జీవకణాల మధ్య సమాచార వ్యవస్థ. తమకు అందే సమాచారాన్ని బట్టి కణాలు ప్రతిస్పందిస్తాయని, దాని ఆధారంగానే ఆయా జీవుల భవితవ్యం ఆధారపడి ఉంటుందని తెలుసుకున్నారు. ఒక్కొక్కప్పుడు అందిన సంకేతం సరిగా లేకుంటే.. కణాలు ఆ సంకేతాన్ని సరిగా అర్థం చేసుకోలేక అర్థరహితంగా స్పందిస్తాయి. అలాంటప్పుడు అవి క్యాన్సర్‌ కణాలుగా మారే ప్రమాదం ఉంది. ఇలా ఎందుకు జరుగుతుందనేది అంతుచిక్కడం లేదు. ఇక జీవకణశాస్త్రంలో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. మన చర్మం 27 రోజులకోసారి కొత్తగా మారుతుంది. మనిషి సగటు జీవితంలో వెయ్యి కొత్త చర్మాలు ధరిస్తాడు. జీవకణాలకు పరిమితమైన జీవిత కాలం ఉండడంతో ఇలా కొత్త చర్మం తయారవుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న