జన్యువుల్లో మహమ్మారుల ఆనవాళ్లు
close

Updated : 16/06/2021 08:18 IST
జన్యువుల్లో మహమ్మారుల ఆనవాళ్లు

కొవిడ్‌-19లాంటి మహమ్మారుల తీరుతెన్నులు జన్యువుల్లో నిక్షిప్తమవుతాయా? జన్యు విశ్లేషణతో వీటిని తెలుసుకోవచ్చా? కోట్లాది జన్యు వ్యక్తీకరణల్లో వీటిని గుర్తించటం కష్టమే గానీ అసాధ్యమేమీ కాదు. గతంలో వచ్చిన సార్స్‌, మెర్స్‌, స్వైన్‌ఫ్లూ వైరల్‌ ఇన్‌ఫెక్షన్లలో ఒకే విధంగా వ్యక్తమైన జన్యు సమాచారాన్ని కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) సాయంతో సేకరించటంలో యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా సాన్‌ డీగో పరిశోధకులు విజయం సాధించారు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్లకు రోగనిరోధక వ్యవస్థ ఎలా స్పందించిందనేది 166 జన్యువుల విశ్లేషణలతో తేలగా.. ఇన్‌ఫెక్షన్ల తీవ్రతను అంచనా వేయటానికి 20 జన్యువుల సమాచారం తోడ్పడటం విశేషం. వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల బారినపడ్డప్పుడు రోగనిరోధకశక్తి సైటోకైన్లనే ప్రొటీన్లను రక్తంలోకి విడుదల చేస్తుంది. ఇవి ఇన్‌ఫెక్షన్‌ ఉన్నచోటుకు రోగనిరోధక కణాలు చేరుకునేలా మార్గం చూపిస్తాయి. కొన్నిసార్లు శరీరం పెద్దమొత్తంలో సైటోకైన్లను విడుదల చేస్తుంది. ఈ సైటోకైన్ల ఉప్పెన మంచి కణజాలం మీదా దాడి చేస్తుంది. దీని మూలంగానే కొందరిలో జలుబు వంటి మామూలు ఇన్‌ఫెక్షన్లు సైతం తీవ్రరూపం దాలుస్తుంటాయి. ఇలాంటి సమాచారాన్ని గుర్తించేందుకే పరిశోధకులు కృత్రిమ మేధకు తర్ఫీదు ఇచ్చారు. దీన్ని కొవిడ్‌ బాధితుల జన్యు సమాచారంతో పరీక్షించి చూడగా.. అన్నిసార్లూ శాస్త్రవేత్తలు గుర్తించిన జన్యు వ్యక్తీకరణ సంకేతాలే కనిపించాయి! సైటోకైన్ల ఉప్పెన తలెత్తినవారిలో చికిత్స పద్ధతులను గుర్తించటానికి ఈ సమాచారం ఉపయోగపడగలదని భావిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న