గూగుల్‌ సెర్చ్‌ ప్రత్యక్ష దృశ్యాలతోనూ..
close

Updated : 13/10/2021 04:41 IST

గూగుల్‌ సెర్చ్‌ ప్రత్యక్ష దృశ్యాలతోనూ..

* ఎవరి చొక్కా మీదో బొమ్మ కనిపించింది. అది బాగా నచ్చింది. అలాంటి దాన్నే గూగుల్‌లో వెతకాలంటే?
బైక్‌ మీద వెళ్తున్నారు. చైను తెగిపోయింది. దాన్ని సరిచేయాలి. సరిగ్గా అలాంటి సమస్యకు పరిష్కారాన్నే గూగుల్‌లో శోధించాలంటే?

- ఏముంది. గూగుల్‌ లెన్స్‌ ఐకాన్‌ను నొక్కి ఫొటో తీస్తే సరి. కావాలంటే వీడియో రూపంలోనూ వెతుక్కోవచ్చు. త్వరలో గూగుల్‌ ఇలాంటి కొత్తరకం శోధన తీరును ప్రవేశపెట్టనుంది. ఎప్పటికప్పుడు సెర్చ్‌ ఫీచర్‌ను అధునాతనంగా తీర్చిదిద్దుతున్న గూగుల్‌ దీనికి మరిన్ని సొబగులు అద్దనుంది. ప్రత్యేకమైన మల్టీటాస్కింగ్‌ యూనిఫైడ్‌ మోడల్‌ (ఎంయూఎం) సాంకేతిక పరిజ్ఞానంతో సెర్చ్‌ను మరింత సరళంగా, వినూత్నంగా మార్చనుంది. అక్షరాలు, ఫొటోలు, వీడియోలు.. ఇలా వివిధ రూపాల్లో ఉన్న సమాచారాన్ని సైతం ఎంయూఎం అదే సమయంలో అర్థం చేసుకోగలదు మరి. టాపిక్స్‌, కాన్సెప్ట్స్‌, ఐడియాస్‌ మధ్య సంబంధాలను పసిగట్టి, గుది గుచ్చి చూపగలదు. గూగుల్‌ లెన్స్‌ విజువల్‌ సెర్చ్‌ను అప్‌డేట్‌ చేయటం ద్వారా ఎంయూఎంను పనిలోకి దింపనున్నట్టు గూగుల్‌ ఇప్పటికే ప్రకటించింది. ఫోన్‌ కెమెరాతో అప్పటికప్పుడు అనువాదం చేయటం.. మొక్కలను, జంతువులను గుర్తించటం.. ఫొటోల నుంచి కాపీ, పేస్ట్‌ చేయటం వంటి పనులెన్నో గూగుల్‌ లెన్స్‌తో సాధ్యమవుతున్న విషయం తెలిసిందే. వీటికి తోడు త్వరలో ప్రత్యక్ష దృశ్యాలతోనూ శోధించే మార్గాన్ని ప్రవేశపెట్టనుంది. కంటికి కనిపిస్తున్న వాటి గురించి అడిగి తెలుసుకోవటానికిది వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు- ఎక్కడైనా మంచి డిజైన్‌ కనిపించిందనుకోండి. గూగుల్‌ లెన్స్‌తో క్లిక్‌ చేసి వెంటనే వెతకొచ్చు. దుస్తులు, సాక్స్‌లు ఇలా ఎలాంటి వాటి మీద ఆ డిజైన్‌ ఉన్నా వెతికి పెడుతుంది. అంటే చొక్కా మీదున్న డిజైన్‌ ఏయే సాక్సుల మీదుందో కూడా పట్టుకోవచ్చున్నమాట. ఇమేజెస్‌, టెక్స్ట్‌ను కలిపేసి ఒకే ప్రశ్నగా అడగొచ్చు. దీంతో దృశ్యాలతో సెర్చ్‌ చేయటం తేలికవుతుంది.
* ‘థింగ్స్‌ టు నో’ ద్వారా కొత్త అంశాలను అన్వేషించటానికి, అర్థం చేసుకోవటానికీ గూగుల్‌ మార్గం సుగమం చేయనుంది. ఉదాహరణకు- ఇంటిని అలంకరించాలని అనుకుంటున్నారు. యాక్రిలిక్‌ పెయింటింగ్స్‌ గురించి లోతుగా తెలుసుకోవాలని భావిస్తున్నారు. ఎంయూఎం దీనికీ వీలు కల్పిస్తుంది. ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువులతో యాక్రిలిక్‌ పెయింటింగ్స్‌ ఎలా సృష్టించుకోవాలో తెలుసుకోవచ్చు. ఇలాంటి ఇంకొన్ని కొత్త సెర్చ్‌ పద్ధతులెన్నింటినో మన ముందుంచాలని గూగుల్‌ ప్రయత్నిస్తోంది కూడా.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న