సాంకేతిక విప్లవమే!
close

Updated : 24/02/2021 16:19 IST

సాంకేతిక విప్లవమే!

ఈ-అతిథి

గత ఏడాది ఆరంభంలో ఎవరూ ఊహించి ఉండరు.. ముగింపు ఇలా ఉంటుందని. ఊహకు అందని ఓ వైరస్‌ మన జీవన గమనాన్నే తలకిందులు చేసింది. అయినా టెక్నాలజీ ఆసరాతో కోలుకున్నాం. అనూహ్యమైన డిజిటల్‌ టాన్స్‌ఫార్మేషన్‌తో వినూత్న విధానాలెన్నింటినో శరవేగంగా సృష్టించుకున్నాం. ఒక దశాబ్దంలో జరగాల్సిన టెక్నాలజీ మార్పంతా కేవలం ఆరు నెలల్లో జరిగిందన్న విశ్లేషకుల అభిప్రాయమే దీనికి నిదర్శనం. ఇంతటి విప్లవాత్మక మార్పులను ప్రపంచం మొత్తానికి అందించిన శాస్త్ర, సాంకేతిక రంగం 2021లో ఎలా ఉండబోతోంది.. ఎలాంటి  ట్రెండ్స్‌ని మనం చూడబోతున్నాం.. సంక్షిప్తంగా తెలుసుకుందాం పదండి!
* కృత్రిమ మేధస్సే అంతా..
మనిషి మేధస్సుకి సవాల్‌గా మారిన కృత్రిమ మేధ అంతకంతకూ మెరుగువుతోంది. గత ఏడాది కరోనా మహమ్మారి రాకతో ఏఐ వాడకం కొన్ని రెట్లు ఎక్కువ పెరిగింది అనడం నిస్సందేహం. బిగ్‌ డేటా, మెషిన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీలు తోడవడంతో కరోనా కాలంలో ఎన్నో సవాళ్లకు ఏఐ చెక్‌ పెట్టింది. సింపుల్‌గా చెప్పాలంటే.. గడప దాటకుండా ఇంట్లోనే కూర్చుని చేస్తున్న ఈ-షాపింగ్‌లో సాయపడింది. ఆసక్తులకు తగిన సూచనలు చేసింది. అంతేనా.. నెట్‌ఫ్లిక్స్‌ లాంటి స్ట్రీమింగ్‌ సర్వీసుల్లో సినిమాలు చూస్తున్నప్పుడు కూడా అభిరుచికి తగిన వాటిని వెతికి చూపించడం గమనించే ఉంటారు. ఇకపై ఫోన్‌లు, ముఖాముఖిగా సంభాషించేందుకు ‘ఏఐ-ఛాట్‌బాట్‌’లు వచ్చేస్తున్నాయ్‌. వీటినే ‘కన్వర్జేషనల్‌ ఏఐ’ అని పిలుస్తున్నారు. మున్ముందు బ్యాంకులు, హాస్పిటళ్లు, హోటళ్లు.. ఎక్కడికి వెళ్లినా ‘కస్టమర్‌ సర్వీస్‌’ కోసం ఈ ఛాట్‌బాట్‌లే సిద్ధంగా ఉంటాయి. ఏ భాషలో మాట్లాడినా అర్థం చేసుకుని స్పందించటం వీటి ప్రత్యేకత. ఇలా అన్ని రంగాల్లోనూ ఏఐ కీలకపాత్ర పోషించనుంది.
* వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కే ఓటు..

ఎవరూ ఊహించని వైరస్‌ విజన్‌ని కొవిడ్‌-19 ప్రపంచానికి పరిచయం చేసింది. వ్యాపార, ఉద్యోగ రంగాలు కొత్త దారులు వెతికేలా చేసింది. వాటిల్లో ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ ఒకటి. లాక్‌డౌన్‌ వరకేలే అనుకున్న ఈ పని సంప్రదాయం ఇంకా కొనసాగుతోంది. ఇదో అనువైన ఫార్ములాగా కంపెనీలు, ఉద్యోగులు స్వాగతిస్తున్నారు. దీంతో 2021లోనూ ‘డబ్ల్యుఎఫ్‌హెచ్‌’ విధానాన్ని కొనసాగించొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. దీన్ని నిజం చేస్తూ ట్విటర్‌ ఏకంగా ఉద్యోగులందరి కెరీర్‌ని డబ్ల్యుఎఫ్‌హెచ్‌లోనే కొనసాగించుకునే అవకాశాన్ని కల్పించింది. ఇదే తరహాలో కొన్ని దిగ్గజ కంపెనీలు కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోంకి ఓటేశాయి. మరోవైపు టెక్నాలజీ టూల్స్‌ కూడా పని విధానాన్ని సులభం చేస్తూ విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. వెబ్‌ఎక్స్‌, జూమ్‌, మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌, గూగుల్‌ మీట్‌.. లాంటి మరెన్నో టూల్స్‌ గత కొన్ని నెలలుగా ఉద్యోగులు, కంపెనీల మధ్య వారధులయ్యాయి. వినూత్న సౌకర్యాలతో వర్క్‌ ఫ్రమ్‌ హోం ట్రెండింగ్‌ ఈ ఏడాదిలోనూ కొనసాగనుంది.
* వర్చువల్‌ ‘ప్రవర్తన’..
టెక్నాలజీ ప్రపంచంలో గత కొన్నేళ్లుగా వింటున్న మాటే ‘ఐఓటీ’. ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల గ్యాడ్జెట్‌లను ఒకదానితో మరొకటి సంభాషించుకునేలా చేసింది. ఇకపై మరో కొత్త పదం ట్రెండింగ్‌గా మారనుంది. అదే ‘ఐఓబీ’ (ఇంటర్నెట్‌ ఆఫ్‌ బిహేవియర్‌). ఇది ఒక రకంగా ఐఓటీ తదుపరి వెర్షన్‌. దీని లక్ష్యం ఒక్కటే.. నెట్టింట్లో సంచరించే నెటిజన్ల ప్రవర్తనని విశ్లేషించడం. ఐఓటీ, పలు డేటా ట్రాకింగ్‌ టూల్స్‌ ద్వారా సేకరించిన మొత్తం సమాచార భాండాగారాన్ని విశ్లేషించడం ఐఓబీ పని అన్నమాట. ఉదాహరణకు.. మీరు వాడుతున్న ఫోన్‌, ల్యాపీ, ఇతర ఐఓటీ సపోర్టుతో పని చేసే డివైజ్‌ల నుంచి నిత్యం సమాచారాన్ని సేకరించి.. మీ రోజువారీ జీవనశైలి, ప్రవర్తనలను ఐఓబీ అంచనా వేస్తుంది.
వారి ‘డేటా’ ప్రత్యేకం..
ఏదైనా కొనుగోలు చేయాలంటే మార్కెట్‌కి వెళ్లడం సంప్రదాయబద్ధంగా చేసేదే. కానీ, ఇప్పుడు వినియోగదారుడికి మార్కెట్‌లకు మధ్య మాధ్యమాలెన్నో..! దీంతో కొన్నేళ్లుగా కస్టమర్లను ఆకట్టుకోవడంలో కొత్త మార్గాలెన్నో పుట్టుకొచ్చేశాయి. ‘డేటా’ కీలకంగా మారింది. దీంతో ఇకపై అంతా ‘కస్టమర్‌ డేటా ప్లాట్‌పామ్‌’ల (సీడీపీ) హవానే కొనసాగనుంది. కస్టమర్ల పేరు, అడ్రస్‌ వివరాలకే కాకుండా అన్ని విషయాల్లో నిఘా నేత్రంగా సీడీపీ మారనుంది. అదెలాగంటే.. ఇప్పుడున్న అన్ని వ్యాపార, మార్కెటింగ్‌ సంస్థలు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో తమ కార్యకలాపాల్ని సాగిస్తున్నాయ్‌. నేడు కొనసాగుతున్న కరోనా విపత్తు కారణం గడప దాటకుండానే కస్టమర్లకు సేవలందించడం పెద్ద సవాల్‌. ఆన్‌లైన్‌ అంగళ్లలో ఎలాంటివి కొనుగోలు చేస్తున్నారు? వారి అవసరాలేంటి? ఏ ప్రాంతంలో ఉంటున్నారు? సోషల్‌ స్థితిగతులేంటి?.. ఇలా పలు విధాలుగా కస్టమర్లు అందించే డేటాని తీసుకోవడం, ప్రాసెస్‌ చేయడంలో టెక్నాలజీ పాత్ర కీలకంగా మారింది.
* ‘వీఆర్‌’.. ‘ఏఆర్‌’
వాస్తవ ప్రపంచం నుంచి వర్చువల్‌ వరల్డ్‌లోకి ప్రయాణం మరింత ఊపందుకోనుంది. వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌), ఆగ్మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌).. రెండే అందుకు కారణం. గత ఏడాదిలో వీటి హవా పెరిగినప్పటికీ 2021లో పలు రంగాల్లో వీటి పాత్ర కీలకం కానుంది. కొవిడ్‌-19 కారణంగా గడప దాటలేని స్థితిలోనూ రెక్కలు కట్టుకుని వర్చువల్‌ రియాలిటీలో విహరించడం చూశాం. అదే జోరులో వ్యాపారం, వినోదాత్మక రంగాల్లో వీఆర్‌ మరిన్ని అద్భుతాల్ని ఆవిష్కరించనుంది. వీఆర్‌ హెడ్‌సెట్‌లతో గేమ్స్‌ మరింత వినూత్నంగా ఆస్వాదించేలా ముందుకురానున్నాయి. వాస్తవ ప్రపంచాన్నీ  వర్చువల్‌ వరల్డ్‌నీ ఆగ్మెంటెడ్‌ రియాలిటీ విడదీయలేనంతగా కలిపేస్తోంది. మొబైల్‌ ‘వీఆర్‌’ యాప్‌లే అందుకు సాక్ష్యం. ఆన్‌లైన్‌ షాపింగ్‌ని వినూత్న పద్ధతిలో పరిచయం చేస్తున్నాయి.ఉదాహరణకు- ఐకియాలో ఏదైనా ఫర్నీచర్‌ కొందామనుకుంటే సంస్థ యాప్‌లో ఏఆర్‌ సదుపాయాన్ని వాడుకోవచ్చు. ఏదైనా కొనే ముందు అది ఇంట్లో ఎలా సెట్‌ అవుతుందో ఏఆర్‌తో చెక్‌ చేయవచ్చు. ఇదే మాదిరిగా ఆన్‌లైన్‌ అంగళ్లలో కొనుగోలు చేసేవి ఏవైనా ముందే ఏఆర్‌తో చెక్‌ చేసుకోవడం ఈ ఏడాదిలో ట్రెండింగ్‌గా మారొచ్చు.


5జీతోనే ప్రయాణం..

నెట్‌వర్క్‌ 4జీ బౌండరీని దాటుకుని 5జీని అందుకునేందుకు ఈ ఏడాదే వేదిక అవ్వనుంది. ప్రస్తుతం ఉన్న నెట్‌వర్క్‌ వేగానికి మించిన నెట్‌ స్పీడ్‌ ఇప్పుడు అవసరం కూడా. ఇంత త్వరగా 5జీ సపోర్టు అనివార్యమవ్వడానికి కరోనా విపత్తే కారణం. అన్ని రంగాల్లో డిజిటల్‌ మాధ్యమాల ఆసరా అనివార్యమైంది. ఎక్కడి వారు అక్కడే ఉండి పని చేయడం.. వీడియో కాన్ఫెరెన్స్‌లలో మాట్లాడుకోవడం తప్పని సరి అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ మాధ్యమాల్లో ఎలాంటి ఆటంకం ఏర్పడకూడదంటే నెట్‌వర్క్‌ వేగం పెరగాలి. అంతేకాదు.. ఇప్పటికే ‘ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌’ (ఐఓటీ) కూడా అన్ని చోట్లకూ చొచ్చుకుపోతోంది. సగానికి పైగా కంపెనీలు వినియోగదారుల అవసరాలు, ప్రాధాన్యాలను త్వరగా గుర్తించేందుకు ఐఓటీ టూల్స్‌నే వాడుతున్నాయి. మరోవైపు.. మనిషి రోజువారీ జీవనశైలిని స్మార్ట్‌గా మార్చేయడంలోనూ ఐఓటీ తనదైన పాత్ర పోషిస్తోంది. చూట్టూ ఉన్న గ్యాడ్జెట్‌లను ఒకదానితో మరొకటి మాట్లాడుకునేలా చేస్తూ... టెక్నాలజీ ప్రియులు నడయాడే నేలని మాయాబజార్‌లా మార్చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టెలీకమ్యూనికేషన్‌ కంపెనీలు 5జీని అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి.


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న