శకల సారం
close

Published : 18/08/2021 02:11 IST

శకల సారం

సృష్టిలో ప్రతిదానికీ ఓ నియమముంది. అన్నీ దాని ప్రకారమే ప్రవర్తించాలి. అప్పుడే అంతా సజావుగా సాగుతుంది. అయితే అన్నిసార్లూ అలాగే నడవాలని లేదు. అల్లరి పిల్లల్లా కొన్నిసార్లు కొన్ని గాడి తప్పొచ్చు. చుట్టుపక్కల దారుల్లోకి చొచ్చుకెళ్లొచ్చు. గ్రహ శకలాలు అలాంటివే. తమ స్థానంలో ఉన్నంతవరకివి సురక్షితమే. భూమని ఢీకొడితే మాత్రం పెను ప్రమాదమే. చిన్నవే అయినా భారీ నష్టాన్ని కలిగిస్తాయి. ఇంతకీ ఈ గ్రహ శకలాల కథేంటి?

సౌర వ్యవస్థ అనగానే ధగధగ ప్రకాశించే సూర్యుడు, చుట్టూ తిరిగే గ్రహాలే గుర్తుకొస్తాయి. ఒక్క గ్రహాలే కాదు.. 146 చంద్రుళ్లు, ప్లూటో వంటి మరుగుజ్జు గ్రహాలు, తోకచుక్కలు, గ్రహ శకలాలు, అంతరిక్ష రాళ్ల వంటివన్నీ సౌర కుటుంబ సభ్యులే. వీటిల్లో అప్పుడప్పుడు మనల్ని బాగా భయపెట్టేవి గ్రహ శకలాలు. ఇటీవల భూమికి సమీపంలోకి వచ్చిన ‘2008 గో20’ గురించి తెలిసిందే. మూడు తాజ్‌మహళ్లంత పెద్దదైన ఇది గంటకు 29వేల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొచ్చింది. సుమారు 4.5 లక్షల కిలోమీటర్ల దూరం నుంచే తిరిగి వెళ్లిపోయింది. భూమిని ఢీకొట్టే అవకాశం లేకపోయినా ఇది 2034లో మళ్లీ భూ సమీపానికి రానుంది. ఇక బెన్నూ అనే గ్రహ శకలమైతే ఇప్పట్నుంచి 2300 మధ్యలో ఎప్పుడైనా భూమిని ఢీకొట్టే అవకాశముందని శాస్త్రవేత్తలు గుర్తించారు. కాకపోతే 99.94% వరకు అలాంటి ప్రమాదం ఉండకపోవచ్చని తేలటం సంతోషకరమైన విషయం. ఇలాంటి గ్రహ శకలాలు ఢీకొట్టటం వల్లనే డైనోసార్లు అంతరించిపోయాయి మరి.


ఎక్కడివీ గ్రహ శకలాలు?

ఒక్కమాటలో చెప్పాలంటే- సౌర వ్యవస్థ ఏర్పడే క్రమంలో మిగిలిపోయిన వ్యర్థాలని అనుకోవచ్చు. మన సౌర వ్యవస్థ 450 కోట్ల సంవత్సరాల క్రితం తిరుగుతున్న వాయు, ధూళి మేఘమే. సమీపంలోని నక్షత్ర విస్ఫోటనమో, మరేదో కారణంతోనో ఇది కుప్పకూలటంతోనే సూర్యుడు, గ్రహాలు పుట్టుకొచ్చాయి. వాయు, ధూళి మేఘం కుప్పకూలినప్పుడు దాని గురుత్వాకర్షణ శక్తి చుట్టూ ఉన్న పదార్థాలను తనలోకి లాగేసుకుంది. దీంతో హైడ్రోజన్‌ అణువులు కలిసిపోయి హీలియం అణువులుగా మారిపోయాయి. మేఘానికి సంబంధించిన 99% పదార్థం ఓ భారీ అణు రియాక్టర్‌గా తయారైంది. అదే మన సూర్యుడు. మిగిలిన పదార్థం గ్రహాలుగా మారి, సూర్యుడి చుట్టూ తిరగటం ఆరంభించాయి. ఇందులోనూ మొత్తం పదార్థమంతా గ్రహాలుగా, మరుగుజ్జు గ్రహాలుగా మారలేదు. రాళ్ల వంటి విడిభాగాలుగానే ఉండిపోయి, సూర్యుడి చుట్టూ తిరగటం ఆరంభించాయి. ఇవే గ్రహ శకలాలు. వీటినే ఆస్టరాయిడ్స్‌ అంటారు. ఆస్టరాయిడ్‌ అంటే నక్షత్రం లాంటిదని అర్థం.


మూడు రకాలు

గ్రహ శకలాలను ప్రధానంగా సి, ఎస్‌, ఎం రకాలుగా వర్గీకరిస్తారు. వీటిల్లో సి (కాండ్రైట్‌) రకానికి చెందినవే ఎక్కువ. మట్టి, సిలికేట్‌ రాళ్లతో కూడిన ఇవి నల్లగా కనిపిస్తాయి. సౌర వ్యవస్థలో అతి పురాతన వస్తువులు ఇవే. ఎస్‌ (స్టోనీ) రకం గ్రహ శకలాలు సిలికేట్‌ పదార్థాలు, నికెల్‌-ఐరన్‌తో కూడుకొని ఉంటాయి. ఇక నికెల్‌-ఐరన్‌తో ఏర్పడినవి ఎం (మెటాలిక్‌) రకం గ్రహ శకలాలు.


ఎలా కదులుతాయి?

గ్రహాల మాదిరిగానే గ్రహ శకలాలు కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. ఇవి తమ కక్ష్యలో స్థిరంగా తిరగటం కాస్త కష్టమైన వ్యవహారమే. వేగం ఏమాత్రం నెమ్మదించినా అంగారకుడు, బృహస్పతి లాగేసుకునే ప్రమాదముంది. సూర్యరశ్మి తగిలినప్పుడు గ్రహ శకలాల ఉపరితలాలు వేడెక్కుతుంటాయి. సూర్యుడికి దూరంగా వెళ్లినప్పుడు వేడిని వెదజల్లుతూ చల్లబడుతుంటాయి. దీని మూలంగానే వీటికి కొద్దిగా ముందుకు జరిగే శక్తి (థ్రస్ట్‌) లభిస్తుంది. దీన్నే యార్కోవ్‌స్కీ ఎఫెక్ట్‌ అంటారు. గ్రహాల గురుత్వాకర్షణ బలాలతో పోలిస్తే ఇలాంటి వివర్తన వేగం చాలా బలహీనమైనదే అయినప్పటికీ చిన్న గ్రహ శకలాలు కదలటానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.


పది లక్షలకు పైగానే

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా లెక్కల ప్రకారం సూర్యుడి చుట్టూ 11,13,175 గ్రహ శకలాలు తిరుగుతున్నాయి. వీటిల్లో చాలావరకు చిన్నవే. అడ్డంగా ఓ 10 మీటర్లు ఉంటాయంతే. కొన్ని పెద్దవి కూడా. అన్నింటికన్నా పెద్దది వెస్టా. దీని విస్తీర్ణం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల మొత్తం విస్తీర్ణం కన్నా ఎక్కువే. దీనికన్నా ముందు సెరెస్‌ను అతిపెద్ద గ్రహ శకలమని అనుకునేవారు. దీని వ్యాసార్థం దాదాపు చంద్రుడిలో మూడో వంతు వరకు ఉంటుంది. దీన్ని 2006లో మరుగుజ్జు గ్రహంగా తేల్చటంతో వెస్టాకు ‘పెద్ద’ కిరీటం దక్కింది. చాలావరకు గ్రహ శకలాలు సూర్యుడు-అంగారకుడు, గురుగ్రహం మధ్యలోనే ఉంటాయి. ఇవి అన్నిసార్లూ ఒకే కక్ష్యలో తిరగవు. బలమైన గురుగ్రహం గురుత్వాకర్షణ ప్రభావంతో కొన్నిసార్లు దారితప్పి అంతరిక్షంలోకి వచ్చేస్తుంటాయి. ఇలా అప్పుడప్పుడు ఇతర గ్రహాలను ఢీకొడుతుంటాయి.


ఢీకొడితే ప్రమాదమే

గ్రహ శకలాలు పరిమాణంలో భూమి కన్నా చిన్నవే కావొచ్చు. కానీ ఢీకొడితే మాత్రం పెద్ద ప్రమాదమే. డైనోసార్లను తుడిచిపెట్టేసిన గ్రహశకలం అలాంటిదే. దీని పేరు చిక్సులబ్‌. సుమారు 10మైళ్ల వెడల్పున్న ఇది 6.6 కోట్ల ఏళ్ల క్రితం మెక్సికో ఆగ్నేయ తీరప్రాంతాన్ని ఢీకొట్టింది. దీని ప్రభావంతో డైనోసార్లే కాదు.. భూమ్మీద మూడొంతుల ప్రాణులు అంతరించిపోయాయి. పర్యావరణమూ గణనీయంగా మారిపోయింది. పూలు పూచే మొక్కల ఆవిర్భావం, దట్టమైన అమెజాన్‌ అడవులకు బీజం వేసింది ఇదే.

మానవ చరిత్రలో అతిపెద్ద గ్రహ శకలం ఢీకొట్టిన ఘటన 1908లో నమోదైంది. అయితే ఇప్పటికీ కొంత రహస్యంగానే మిగిలిపోయింది. అప్పట్లో సైబీరియాలోని టుంగుస్కా నది మీద తెల్లవారు జామున భారీ విస్ఫోటనం జరిగింది. దీని దెబ్బకు చెట్లన్నీ నేలకొరిగాయి. గ్రహ శకలంతో పుట్టుకొచ్చిన ఒత్తిడి తరంగాలు, తీవ్రమైన వేడి ప్రభావం 40 మైళ్ల దూరం వరకూ కనిపించింది. అయితే గొయ్యేమీ ఏర్పడలేదు. ఆనవాళ్లేమీ కనిపించలేదు. భూమిని ఢీకొట్టటం కన్నా భూ వాతావరణంలోకి గ్రహ శకలం దూసుకొస్తున్నప్పుడు పుట్టుకొచ్చిన షాక్‌ తరంగాలే దీనికి కారణమై ఉండొచ్చన్నది శాస్త్రవేత్తల భావన.

* 2004లో గుర్తించిన అపోఫిస్‌ గ్రహ శకలం తీవ్ర ఆందోళనే కలిగించింది. సుమారు 340 మీటర్ల నిడివితో కూడిన ఇది భూమిని ఢీకొట్టొచ్చనీ అనుకున్నారు. వచ్చే వందేళ్ల వరకు దీంతో ప్రమాదం లేదని తెలిశాక ఊపిరి పీల్చుకున్నారు.


నిరంతర నిఘా..

భూమికి సమీపంలోకి వచ్చే గ్రహ శకలాలు కొన్నిసార్లు ఢీకొట్టొచ్చు. ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. అదృష్టం కొద్దీ చాలావరకివి భూమిని చేరేలోపే మండిపోతుంటాయి. సుమారు ఏడాదికి ఒకసారి కారంత పరిమాణంలోని గ్రహ శకలం భూ వాతావరణంలోకి ప్రవేశించే అవకాశముంది. సుమారు 2వేల సంవత్సరాలకోసారి ఫుట్‌బాల్‌ మైదానమంత పెద్ద గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టే అవకాశముంది. ఇలాంటివి గణనీయమైన ప్రభావాన్నే చూపించొచ్చు. ఒకట్రెండు కిలోమీటర్ల కన్నా పెద్దవి ఢీకొడితే మాత్రం జీవరాశి మొత్తం అతలాకుతలమయ్యే ప్రమాదముంది. అందుకే శాస్త్రవేత్తలు గ్రహ శకలాల కదలికలపై నిరంతరం ఓ కన్నేసి పరిశీలిస్తుంటారు. భూ కక్ష్యకు సుమారు 4.5 కోట్ల కిలోమీటర్ల దూరంలోకి వచ్చేవాటిని భూ సమీప వస్తువుగా భావిస్తారు. ఇలాంటి 26వేల గ్రహ శకలాలను నాసా నిరంతరం పరిశీలిస్తుంటుంది. వీటిల్లో వెయ్యి గ్రహ శకలాలు తీవ్ర ప్రమాదం తెచ్చిపెట్టగలిగినవే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న