ఈమెయిల్‌ శుభ్రమేనా?
close

Updated : 25/08/2021 00:33 IST
ఈమెయిల్‌ శుభ్రమేనా?

ఇంటిని చీపురుతో ఊడుస్తాం. టీవీ, కీబోర్డులను తుడుస్తాం. మరి ఈమెయిల్‌ను ఎప్పుడైనా శుభ్రం చేశారా? రోజూ వాడుకోవటమే తప్ప ఇన్‌బాక్స్‌లో ఎన్ని మెయిళ్లు ఉన్నాయన్నది ఎన్నడూ పట్టించుకోం. ఖాతా తెరచినప్పట్నుంచీ వేలాది మెయిళ్లతో నిండినా పట్టించుకోం. వీటిల్లో అవసరమైనవేంటో, పనికిరానివేంటో కూడా చూడం. నిజానికి వేలాది మెయిళ్లలో వీటిని వెతకటమూ కష్టమే. ఒక్కో మెయిల్‌ను చూసుకుంటూ వెళ్లటమంటే ఎవరికైనా అసాధ్యమే. అదృష్టం కొద్దీ ఇందుకు తేలికైన మార్గం లేకపోలేదు. జీమెయిల్‌లోనైతే ఫిల్టర్ల ద్వారా అవసరమైన ఈమెయిళ్లను తేలికగా పట్టుకోవచ్చు. కేటగిరీ, ఛాట్‌, మెసేజెస్‌, సైజు, తేదీల వారీగా ఇట్టే వెతకొచ్చు. ఉదాహరణకు- ఎవరో ఒకరికి సంబంధించిన మెయిళ్లు వెతకాలనుకుంటే సెర్చ్‌ బాక్స్‌లో from: అని టైప్‌ చేసి తర్వాత ఆయా వ్యక్తుల ఈమెయిల్‌ను టైప్‌ చేయాలి. అదే  subject: ద్వారానైతే ఆయా పదాలకు సంబంధించిన మెయిళ్లను పట్టుకోవచ్చు. అటాచ్‌మెంట్‌తో కూడిన మెయిళ్లను చూడాలనుకుంటే has:attachment టైప్‌ చేయాలి. అటాచ్‌మెంట్లతో కూడిన పాత ఈమెయిళ్లను డిలీట్‌ చేయటం చాలా ముఖ్యం. హ్యాకర్లు పాత ఈమెయిళ్ల ద్వారానే ముఖ్యమైన పీడీఎఫ్‌లను సంగ్రహిస్తుంటారు. మనం పంపిన మెడికల్‌ బిల్లులు, పన్ను రసీదుల వంటి వాటి వివరాలు వీరి చేతిలో పడితే? ఇలాంటి కీలకమైన సమాచారంతో కూడిన పాత, అనవసర మెయిళ్లను డిలీట్‌ చేయటం ఎవరికైనా మంచిదే. లేకపోతే పెద్ద ప్రమాదం అంచున ఉన్నట్టే. జీమెయిల్‌ సెర్చ్‌ బాక్సులో filetype:pdf అని టైప్‌ చేస్తే పీడీఎఫ్‌తో కూడిన మెయిళ్లన్నీ కనిపిస్తాయి. అప్పుడు అనవసరమైన మెయిళ్లను గుర్తించి, ఇట్టే తొలగించుకోవచ్చు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న