రెండు సెల్ఫీ కెమెరాలు.. కొత్త లుక్‌లో అమెజాన్‌
close

Published : 27/01/2021 18:06 IST
రెండు సెల్ఫీ కెమెరాలు.. కొత్త లుక్‌లో అమెజాన్‌

మార్కెట్‌లోకి వస్తున్న ఎక్కువ శాతం స్మార్ట్‌ఫోన్‌ల్లో సెల్ఫీ కెమెరా ఒక్కటే ఉంటుంది. అయితే, మోటొరోలా మాత్రం రెండు సెల్ఫీ కెమెరాలతో కొత్త మోడల్‌ని (మోటొరోలా ఎడ్జ్‌ ఎస్‌) అందుబాటులోకి తెస్తోంది. రెండూ పంచ్‌-హోల్‌ డిస్‌ప్లేలోనే కనిపిస్తాయ్‌. వీటి సామర్థ్యం వరుసగా.. 16 ఎంపీ ప్రైమరీ సెన్సర్, 8 ఎంసీ సెకండరీ సెన్సర్‌. వెనక నాలుగు కెమెరాల్ని ఏర్పాటు చేశారు. 6, 8 జీబీ ర్యామ్‌లతో అందిస్తున్నారు. స్టోరేజ్‌ సామర్థ్యాన్ని 128, 256 జీబీల్లో పొందొచ్చు. బ్యాటరీ సామర్థ్యం కూడా ఎక్కువే. 5000 ఎంఏహెచ్‌. 20 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 870 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ని వాడారు. తెర పరిమాణం 6.7 అంగుళాలు. ఫుల్‌-హెచ్‌డీ డిస్‌ప్లే. రిజల్యూషన్‌ 1080X2520 పిక్సల్స్‌. 
* అంచనా ధర: 22,600 (8జీబీ ర్యామ్, 128 స్టోరేజ్‌)


అమెజాన్‌ కొత్త లుక్‌లో..

ఫోన్‌ చేతిలో ఉంటే ఎప్పుడు బోర్‌ అనిపిస్తే అప్పుడు అమెజాన్‌ అడ్డాకి వెళ్లిపోవడమే. అంతలా నెటిజన్లకు దగ్గరైన అమెజాన్‌ గత కొన్నేళ్లుగా ఒకే లోగోతో కనిపిస్తోంది. అమెజాన్‌ పేరు, నీలి రంగులో షాపింగ్‌ కార్టు బొమ్మ. ఆయా యాప్‌ స్టోర్‌ల్లో అలానే సందడి చేస్తోంది. ఇకపై మరో కొత్త అవతార్‌తో ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. యాపిల్‌ యూజర్లకు అక్కడక్కడ కొత్త ఐకాన్‌తో దర్శనమిస్తోంది. పేరు లేకుండా.. బాణం గుర్తుతో కూడిన స్మైలీ సింబల్‌తో కొత్త లొగో దర్శనమిస్తోంది. మొత్తంగా లోగో డిజైన్‌ ‘షిప్పింగ్‌ బాక్స్‌’లను పోలి ఉండేలా తీర్చిదిద్దారు. త్వరలోనే ఆండ్రాయిడ్‌ యూజర్లకూ కొత్త లుక్‌ కనిపించొచ్చు. 


వన్‌ప్లస్‌లో కొత్త కెమెరా ఫీచర్లు

మార్కెట్‌లో వన్‌ప్లస్‌ ఫోన్‌లకు ఉన్న ప్రత్యేకతే వేరు. ఫోన్‌ డిజైన్, ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ఫీచర్లతో ఎప్పుడూ ప్రత్యేక ముద్ర వేస్తుంది. ఇప్పుడు కొత్తగా ఫోన్‌ కెమెరా యాప్‌కి ప్రత్యేక  మోడ్స్‌ జోడించి తీసుకొస్తోంది. అవే ‘టిల్ట్‌-షిఫ్ట్, స్టార్ట్‌ బస్ట్, మూన్, హైపర్‌ లాప్స్‌’. ఆయా ఆప్షన్లతో ఫోన్‌ కెమెరాతో ఫొటోలను భిన్నంగా క్లిక్‌ మనిపించొచ్చు. టిల్ట్‌-షిప్ట్‌ మోడ్‌తో సాధారణ ఫొటోలను ‘మినేచర్‌ సెట్‌’గా మార్చేయొచ్చు. అంటే.. పెద్ద వాటిని సూక్ష్మమైనవిగా మార్చేయడం. ఉదాహరణకు ఛార్మినార్‌ను పట్టుకున్నట్టుగా చేయిపెట్టి టిల్ట్‌-షిఫ్ట్‌తో ఫొటో తీస్తే.. ఛార్మినార్‌ వేళ్లతో పట్టుకునేంత సూక్ష్మమైనదిగా కనిపిస్తుంది. ఇక స్టార్ట్‌ బస్ట్‌తో వెనక ఉన్న ఎలాంటి లైట్‌ని అయినా నక్షత్రంలా మార్చేయొచ్చు. మూన్‌ మోడ్‌తో ఫిల్టర్లు వాడి చందమామ రంగుల్ని మార్చొచ్చు. ప్రస్తుతం ఈ సరికొత్త వన్‌ప్లస్‌ కెమెరా ఫీచర్లను పరిమిత యూజర్లకు ప్రయోగాత్మకంగా అందిస్తోంది. త్వరలోనే అందుబాటులోకి రానున్న వన్‌ప్లస్‌ 9 సిరీస్‌లో వీటిని చూడొచ్చు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న