భారత్‌లో ఏడాది చివరికి PUBG తీసుకొస్తాం!
close

Published : 08/11/2020 15:19 IST
భారత్‌లో ఏడాది చివరికి PUBG తీసుకొస్తాం!

వెల్లడించిన దక్షిణ కొరియా సంస్థ క్రాఫ్టన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: పబ్‌జీ అభిమానులకు శుభవార్త. భారత్‌లో నిషేధానికి గురైన పబ్‌జీ త్వరలో అడుగుపెట్టనుంది. మైక్రోసాఫ్ట్‌ అజ్యూర్ క్లౌడ్‌ సర్వీస్‌ సహకారంతో పబ్‌జీని తీసుకు వస్తామని దక్షిణ కొరియాకు చెందిన క్రాఫ్టన్‌ ఇన్‌కో సంస్థ ప్రకటించింది. భారత్‌-చైనా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం 117 యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. యాపిల్‌ స్టోర్‌, గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ను తొలగించారు. ప్లే స్టోర్‌లలో తొలగించినా అప్పటికే డౌన్‌లోడ్‌ చేసుకున్న వారు కొన్ని రోజులపాటు ఆడుకునే వెసులుబాటు వచ్చింది.  అయితే టెన్సెంట్‌ తన సర్వర్ యాక్సెస్‌ను నిలిపివేయడంతో పబ్‌జీ గేమ్‌ పూర్తిగా ఆగిపోయింది. 

ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన పబ్‌జీని మళ్లీ తీసుకొచ్చేందుకు క్రాఫ్టన్‌ గేమింగ్‌ కంపెనీ సన్నాహాలు ప్రారంభించింది. మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సర్వీస్ అజ్యూర్‌తో ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నట్లు క్రాఫ్టన్‌ వెల్లడించింది. PUBG Corpకు ఇప్పుడు భారత్‌లో పబ్‌జీ మొబైల్‌కు ప్రచురణ హక్కులు ఉన్నాయి. దీంతో మైక్రోసాఫ్ట్‌ సాయంతో దేశంలోకి పబ్‌జీ మళ్లీ రానుంది. సమాచార భద్రత, ప్రైవసీకి తొలి ప్రాధాన్యం ఇస్తామని క్రాఫ్టన్‌ పేర్కొంది. ఈ ఏడాది చివరి నాటికి పబ్‌జీని అందుబాటులోకి తెస్తామని, సిద్ధంగా ఉండాలని భారత్‌లోని స్ట్రీమర్స్‌కు దక్షిణ కొరియా సంస్థ క్రాఫ్టన్‌ సమాచారం అందించింది. అంతేకాకుండా భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి తీసుకోబోయే నిర్ణయాలను PUBG Corp త్వరలో  ప్రకటించనుంది. దీపావళి పండుగ నేపథ్యంలో మార్కెటింగ్‌ క్యాంపెయిన్‌ చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు PUBG Corp వెల్లడించింది. ఇంతకుముందు దేశంలో పబ్‌జీని తీసుకొచ్చేందుకు ఎయిర్‌టెల్‌, పేటీఎం, జియోతో సహా పలు సంస్థలతో  PUBG Corp చర్చలు జరిపిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న