ఈ యాప్‌ గురువారం మాత్రమే పనిచేస్తుంది!
close

Updated : 11/06/2021 20:22 IST
ఈ యాప్‌ గురువారం మాత్రమే పనిచేస్తుంది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా టిండర్‌, బంబుల్‌ వంటి ఎన్నో డేటింగ్‌ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. దీంతో చాలా మంది యువతీయువకులు ఈ యాప్స్‌లో తమ భాగస్వామిని వెతుక్కుంటారు. ఈ క్రమంలో సమయం, లోకం రెండూ మర్చిపోతారు. దీంతో చేయాల్సిన ఇతర పనులు ఆలస్యమైపోతుంటాయి. అందుకే, ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ఇద్దరు టెకీలు ‘థర్స్‌డే(గురువారం)’ పేరుతో వినూత్న డేటింగ్‌ యాప్‌ను తీసుకొచ్చారు. ఈ యాప్‌ కేవలం గురువారం రోజు మాత్రమే పనిచేస్తుంది. ఆ 24 గంటల్లోనే యువత తమకు నచ్చిన వ్యక్తిని పరిచయం చేసుకొని.. మాట్లాడి.. ఒక్కటి కావొచ్చు. రోజు ముగిసిందంటే యాప్‌ ఆటోమేటిక్‌గా పనిచేయడం మానేస్తుంది. 

ఏడాది పొడవునా 24/7 సేవలందిస్తూ.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నా.. అనేక యాప్స్‌ విజయవంతం కాలేకపోతున్నాయి. అలాంటిది కేవలం ఒక్క రోజు పని చేసే యాప్‌నకు ఆదరణ ఉంటుందా అనే అనుమానం కలుగుతుంది. అయినా, ఇంగ్లాండ్‌కు చెందిన జార్జ్‌ రాలింగ్స్‌, మట్‌ మెక్‌నీల్‌ కచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మి ‘థర్స్‌డే’ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌పై ప్రకటన ఇవ్వగా.. కేవలం లండన్‌, న్యూయార్క్‌లోనే 1,10,000 మంది ముందస్తు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారట. ఇటీవల యాప్‌ను విడుదల చేయగా వారం రోజుల వ్యవధిలోనే వేల సంఖ్యలో డౌన్‌లోడ్లు సొంతం చేసుకుంది. అయితే, ప్రస్తుతం ఈ యాప్‌ కేవలం ఆ రెండు ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని యాప్‌ సృష్టికర్తలు వెల్లడించారు.

‘‘ప్రజలు డేటింగ్‌ యాప్స్‌తో ఎక్కువ సమయం గడుపుతున్నారు. జీవితంలో ఇది ఒక్కటే కాదు.. బయట ప్రపంచంలో ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అలాగే, చాలా మంది యువతీయువకులు గురువారం రోజు మాత్రమే కాస్త ఖాళీగా ఉంటారు. అందుకే ‘థర్స్‌డే’ యాప్‌ రూపొందించాం. డేటింగ్‌ యాప్‌లో ప్రజలు కోరుకునేది కొత్త వ్యక్తితో మాట్లాడి, అభిప్రాయాలు తెలుసుకొని, వారిని కలిసి తమ ప్రేమను తెలియజేయడమే. అవన్నీ కేవలం ఈ ఒక్క గురువారం రోజునే ఈ యాప్‌ ద్వారా చేసేయొచ్చు’’అని జార్జ్‌, మెక్‌నీల్‌ చెప్పుకొచ్చారు. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న