ఉపాధికి దారి చూపే వృత్తివిద్యా కోర్సులు

ఉపాధికి బాటలు వేసేవాటిలో వృత్తివిద్యా (ఒకేషనల్‌) కోర్సులు ముఖ్యమైనవి. చదువు పూర్తవగానే

Updated : 13 Jul 2021 09:55 IST

టెన్త్‌ తర్వాత - 4 

ఉపాధికి బాటలు వేసేవాటిలో వృత్తివిద్యా (ఒకేషనల్‌) కోర్సులు ముఖ్యమైనవి. చదువు పూర్తవగానే ఉపాధి పొంది వృత్తిలో నిలదొక్కుకునేలా వీటిని రూపొందించారు. ఈ కోర్సుల్లో ఆచరణకు ప్రాధాన్యం ఎక్కువ. అందువల్ల ప్రత్యేక శిక్షణ లేకుండా సంబంధిత విభాగంలో సేవలందిస్తోన్న సంస్థల్లో చేరిపోవచ్చు. ఆసక్తి ఉంటే ఉన్నత విద్య దిశగానూ డుగులేయవచ్చు!

ఏదైనా ఒక విభాగంలో ప్రత్యేక ప్రావీణ్యం ఆశించేవారు వృత్తివిద్యా కోర్సుల్లో చేరవచ్చు. వివిధ రంగాల అవసరాలను తీర్చి, నైపుణ్య కొరతను పూడ్చడానికి వీటిని రూపొందించారు. పనిచేస్తూ నేర్చుకునే విధానానికి ఇందులో ప్రాధాన్యమిచ్చారు. ఈ చదువుల్లో 40 శాతం థియరీ, 60 శాతం ప్రాక్టికల్‌ అప్రోచ్‌ ఉంటుంది. అంటే తెలుసుకోవడం కంటే సంబంధిత పనిని చేయడం ద్వారా నేర్చుకోవడం, అనువర్తనం (అప్లికేషన్‌)కు పెద్దపీట వేస్తారు. విద్యార్థులు నచ్చిన రంగానికి సంబంధించిన కోర్సులను ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ విధానంలో చదువుకోవచ్చు. 

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రెండేళ్ల వ్యవధితో 27 ఒకేషనల్‌ కోర్సులు అందిస్తున్నారు. విద్యార్థులు ఏ తరహా పరిశ్రమలో సేవలు అందించాలనుకుంటున్నారో నిర్ణయించుకుని, తమకు అనువైనదాన్ని ఎంచుకోవచ్చు. కోర్సులో ఉన్నప్పుడే సంబంధిత పరిశ్రమలో ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసుకునే అవకాశం వీరికి లభిస్తుంది. దీంతో అదనపు శిక్షణ అవసరం లేకుండా వెంటనే విధులు నిర్వర్తించడానికి వీలవుతుంది.

ఇవీ కోర్సులు

వీటిని అగ్రికల్చరల్, బిజినెస్‌ అండ్‌ కామర్స్, ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, హోమ్‌ సైన్స్, హ్యుమానిటీస్, పారా మెడికల్‌ విభాగాల్లో అందిస్తున్నారు.

ఆయా విభాగాలవారీగా ఉన్న కోర్సుల వివరాలు

> అగ్రికల్చరల్‌: క్రాప్‌ ప్రొడక్షన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, డైరీయింగ్, ఫిషరీస్, సెరికల్చర్‌

> బిజినెస్‌ అండ్‌ కామర్స్‌: అకౌంటింగ్‌ అండ్‌ ట్యాక్సేషన్, మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌మెన్‌షిప్, ఆఫీస్‌ అసిస్టెంట్‌షిప్, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌ అండ్‌ మార్కెటింగ్‌.

> ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ: ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ టెక్నీషియన్, కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ టెక్నీషియన్, ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ అప్లయన్సెస్‌ సర్వీసింగ్, రూరల్‌ ఇంజినీరింగ్‌ టెక్నీషియన్, వాటర్‌ సప్లై అండ్‌ శానిటరీ ఇంజినీరింగ్, డీటీపీ అండ్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీ. 

> హోమ్‌ సైన్స్‌ కోర్సులు: కమర్షియల్‌ గార్మెంట్స్‌ డిజైనింగ్‌ అండ్‌ మేకింగ్, ఫ్యాషన్‌ గార్మెంట్‌ మేకింగ్, హోటల్‌ ఆపరేషన్స్, ప్రిస్కూల్‌ టీచర్‌ ట్రెయినింగ్‌.

> హ్యుమానిటీస్‌ అండ్‌ అదర్స్‌: కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ అండ్‌ యానిమేషన్, టూరిజం అండ్‌ ట్రావెల్‌ టెక్నిక్‌.

> పారా మెడికల్‌: మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్, మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్, ఆఫ్తాల్మిక్‌ టెక్నీషియన్, ఫిజియోథెరపీ.

ఉన్నత విద్య

ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారు డిగ్రీ కళాశాలలు అందిస్తోన్న బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ స్టడీస్‌ (బీఓక్‌) కోర్సుల్లో చేరిపోవచ్చు. ఈ విభాగంలో ఉన్నత చదువులకు మాస్టర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ (ఎంఓక్‌) కోర్సులూ ఉన్నాయి. తాజాగా మన దేశంలోనూ ఒకేషనల్‌ చదువులకు ప్రాధాన్యం పెరుగుతోంది. వీటిలో చేరుతోన్న విద్యార్థుల సంఖ్యలో వృద్ధి కనిపిస్తోంది. ఒకేషనల్‌ దిశగా వద్దనుకున్నవారు బ్రిడ్జ్‌ కోర్సులు పూర్తిచేసుకుని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బీఎస్సీ తదితర విభాగాల్లోకి వెళ్లిపోవచ్చు. పాలిటెక్నిక్‌లో అయితే నేరుగా ద్వితీయ సంవత్సరం కోర్సులో చేరిపోవచ్చు.

యూజీలో...

మూడేళ్ల ఒకేషనల్‌ కోర్సుల్లో భాగంగా విద్యార్థులు ఆసక్తిని బట్టి ..బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, బయో మెడికల్‌ సైన్సెస్, ఇండస్ట్రియల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్, రిటైల్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్, రిటైల్‌ మేనేజ్‌మెంట్, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఐటీ, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ అండ్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, మోడర్న్‌ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, ప్రింటింగ్‌ టెక్నాలజీ, బిజినెస్‌ ప్రాసెస్‌ అండ్‌ డేటా ఎనాలసిస్‌.. తదితర కోర్సులు ఎంచుకోవచ్చు. డిగ్రీ కళాశాలల పరిధిలోని పరిశ్రమలు, స్థానిక అవసరాలు దృష్టిలో పెట్టుకుని ప్రాంతాల వారీ అవసరమైన కోర్సులు అందిస్తున్నారు.

జాతీయ స్థాయిలో...

నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ ఒకేషనల్‌ విద్యకు దిక్సూచిలా వ్యవహరిస్తోంది. యూజీసీతో కలిసి ఎన్‌ఎస్‌డీసీ దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కాలేజీలు, డిగ్రీ కళాశాలల్లో ఒకేషనల్‌ కోర్సులు స్కిల్‌ బేస్డ్‌ విధానంలో అందిస్తోంది. కమ్యూనిటీ కళాశాలల్లో సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సులుంటాయి. ఇందులో భాగంగా 6 నెలల సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేసుకుంటే నేషనల్‌ స్కిల్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ లెవెల్‌ 4 స్థాయి సొంతమవుతుంది. ఏడాది వ్యవది ఉండే డిప్లొమా కోర్సులు పూర్తిచేసుకున్న వారికి లెవెల్‌ 5, రెండేళ్ల అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా వారికి లెవెల్‌ 6, మూడేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ పూర్తిచేసుకుంటే లెవెల్‌ 7 స్థాయికి చేరుకుంటారు. డిగ్రీ కళాశాల్లలో బీఓక్‌ కోర్సులు ఎక్కువగా ఉంటాయి.

ఓపెన్‌ స్కూలింగ్‌తో...

కాలేజీకి వెళ్లి ఒకేషనల్‌ కోర్సులు చదవడం వీలుకానివారు కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన స్వయంప్రతిపత్తి సంస్థ.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ అందించే ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ ప్రొగ్రాముల్లో చేరవచ్చు. పదో తరగతి విద్యార్హతతో ఇక్కడ వివిధ ఒకేషనల్‌ కోర్సులు ఉన్నాయి. వీటిని సీనియర్‌ సెకెండరీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ స్థాయుల్లో వివిధ విభాగాల్లో అందిస్తున్నారు. 

సీనియర్‌ సెకెండరీ స్థాయిలో.. ఆయుర్వేద అండ్‌ యోగా: ఆయుర్వేద అసిస్టెంట్, పంచకర్మ అసిస్టెంట్, యోగా అసిస్టెంట్‌; ఐటీ అండ్‌ ఐటీఈఎస్‌: వెబ్‌ డెవలప్‌మెంట్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అసెంబ్లీ అండ్‌ మెయింటెనెన్స్, సీఆర్‌ఎం డొమెస్టిక్‌ వాయిస్‌; ప్లాంట్‌ ప్రొటెక్షన్, సాయిల్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు ఉన్నాయి. 

సర్టిఫికెట్‌ లేదా డిప్లొమాలో: సెక్రటేరియల్‌ ప్రాక్టీస్, టైప్‌ రైటింగ్, స్టెనోగ్రఫీ, డెస్క్‌టాప్‌ పబ్లిషింగ్, వెబ్‌ డిజైనింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, డేటా ఎంట్రీ ఆపరేషన్స్, ఐటీ ఎసెన్షియల్స్‌ పీసీ హార్డ్‌వేర్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్, వెబ్‌ డెవలప్‌మెంట్, సీఆర్‌ఎం డొమెస్టిక్‌ వాయిస్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అసెంబ్లీ అండ్‌ మెయింటెనెన్స్, కంప్యూటర్‌ అప్లికేషన్స్, హౌస్‌ వైరింగ్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ అప్లియన్స్‌ రిపైరింగ్, మోటార్‌ అండ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ రివైండింగ్, టీవీ రిపేరింగ్, కన్‌స్ట్రక్షన్‌ సూపర్‌విజన్, ఎలక్ట్రికల్‌ టెక్నీషియన్, రేడియో అండ్‌ టీవీ టెక్నీషియన్, ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్, ఫర్నిచర్‌ అండ్‌ క్యాబినెట్‌ మేకింగ్, ఎలక్ట్రోప్లేటింగ్, కేర్‌  ఎల్డర్లీ, కమ్యూనిటీ హెల్త్, హోమియోపతిక్‌ డిస్పెన్సింగ్, హౌస్‌ కీపింగ్, క్యాటరింగ్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ ప్రాసెసింగ్, హోటల్‌ ఫ్రంట్‌ ఆఫీస్‌ ఆపరేషన్స్, ఫ్రూట్స్‌ అండ్‌ వెజిటబుల్స్‌ ప్రిజర్వేషన్, ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్, టాయ్‌ మేకింగ్‌ అండ్‌ జాయ్‌ ఫుల్‌ లర్నింగ్, లైబ్రరీ సైన్స్, ఫుడ్‌ ప్రొడక్షన్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ ఆపరేషన్స్, హౌస్‌ కీపింగ్‌ అండ్‌ మెయింటెనెన్స్, ఫ్రంట్‌ ఆఫీస్‌ ఆపరేషన్స్, బేకరీ అండ్‌ కన్ఫెక్షనరీ... తదితర కోర్సులు ఉన్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని