ఆహ్వానిస్తోంది... ఐఎస్‌ఐ!

మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, ఎకనామిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులకు పేరుపొందిన అత్యున్నత సంస్థల్లో కోల్‌కతాలోని...

Published : 26 Feb 2020 00:34 IST

మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, ఎకనామిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులకు పేరుపొందిన అత్యున్నత సంస్థల్లో కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఒకటి. ఈ సంస్థకు చెందిన వివిధ క్యాంపస్‌ల్లో యూజీ, పీజీ స్థాయుల్లో పలు కోర్సులు అందిస్తున్నారు. తాజాగా 2020 -2021 సంవత్సరం ప్రవేశాలకు ప్రకటన వెలువడింది.

ఎస్‌ఐ క్యాంపస్‌ల్లో బీస్టాట్‌, ఎంస్టాట్‌, బీమ్యాథ్స్‌, ఎంమ్యాథ్స్‌, ఎంటెక్‌, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ కోర్సులు ఉన్నాయి. ఇంటర్‌, డిగ్రీ, పీజీ పూర్తిచేసినవారు, ఆఖరు సంవత్సరం చదువుతున్నవారు వీటికి అర్హులు. పరీక్షలో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను కోర్సులకు ఎంపిక చేస్తారు. సిలబస్‌, మాదిరి ప్రశ్నలు ఐఎస్‌ఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి ఈ క్యాంపస్‌ల్లో డిగ్రీ కోర్సుల్లో చేరినవారికి నెలకు రూ.5 వేలు, పీజీ కోర్సులైతే రూ.8 వేలు, ఎంటెక్‌ కోర్సులకు రూ.12,400 స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇంజినీరింగ్‌ కోర్సుల్లో జేఆర్‌ఎఫ్‌కు ఎంపికైతే నెలకు రూ.31,000+ హెచ్‌ఆర్‌ఏ, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌లకు రూ.35,000+ హెచ్‌ఆర్‌ఏ అందిస్తారు. అన్ని కోర్సుల విద్యార్థులకూ ఏటా కాంటింజెన్సీ గ్రాంటు అందుతుంది. తక్కువ ధరకు వసతి, భోజన సౌకర్యాలు ఉన్నాయి. కోర్సు చివరలో క్యాంపస్‌ నియామకాలు చేపడతారు. ఇక్కడ పీజీ కోర్సులు పూర్తిచేసుకున్నవారికి ఆకర్షణీయ వేతనాలతో అవకాశాలు లభిస్తున్నాయి.

కోర్సుల వారీ అర్హతలు, సీట్లు, క్యాంపస్‌లు

బీస్టాట్‌: మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ పూర్తిచేసినవారు ఈ కోర్సుకు అర్హులు. కోల్‌కతా క్యాంపస్‌లో ఆనర్స్‌ విధానంలో కోర్సు నిర్వహిస్తున్నారు. వ్యవధి మూడేళ్లు. 50 సీట్లు ఉన్నాయి.

బీమ్యాథ్స్‌: మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ పూర్తిచేసినవారు ఈ కోర్సుకు అర్హులు. బెంగళూరు క్యాంపస్‌లో ఆనర్స్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. కోర్సు వ్యవధి మూడేళ్లు. 50 సీట్లు ఉన్నాయి.

మాస్టర్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌: స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా ఏదైనా మూడేళ్ల డిగ్రీ లేదా బీఈ / బీటెక్‌ కోర్సు చదివుండాలి. మొదటి సంవత్సరం విద్యను కోల్‌కతా, చెన్నై, దిల్లీల్లో; ద్వితీయ సంవత్సరం కోల్‌కతా క్యాంపస్‌లో అందిస్తారు. 30 సీట్లు ఉన్నాయి.

మాస్టర్‌ ఆఫ్‌ మ్యాథమాటిక్స్‌: మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా ఏదైనా మూడేళ్ల డిగ్రీ లేదా బీఈ / బీటెక్‌ కోర్సు పూర్తిచేసినవారు అర్హులు. ఈ కోర్సు కోల్‌కతా క్యాంపస్‌లో అందిస్తున్నారు. 20 సీట్లు ఉన్నాయి.

క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌: ఏదైనా డిగ్రీ కోర్సుతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదివుండాలి. కోల్‌కతా, దిల్లీ క్యాంపస్‌ల్లో అందిస్తున్నారు. దిల్లీలో 27, కోల్‌కతాలో 18 సీట్లు ఉన్నాయి.

క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌: మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా డిగ్రీలో చదివుండాలి లేదా ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్‌ పూర్తిచేయాలి. 16 సీట్లు ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్‌ క్యాంపస్‌ల్లో నిర్వహిస్తున్నారు. తొలి రెండు సెమిస్టర్లు బెంగళూరులో మూడో సెమిస్టరు హైదరాబాద్‌ క్యాంపస్‌లో చదువుతారు.

లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు ఈ కోర్సుకి దరఖాస్తు చేసుకోవచ్ఛు బెంగళూరు క్యాంపస్‌లో అందిస్తున్నారు. 10 సీట్లు ఉన్నాయి.

కంప్యూటర్‌ సైన్స్‌ (సీఎస్‌): బీఈ/ బీటెక్‌ లేదా ఇంటర్‌లో మ్యాథ్స్‌తో ఏదైనా పీజీ చదివినవారు అర్హులు. కోల్‌కతా క్యాంపస్‌లో కోర్సు అందిస్తున్నారు. 35 సీట్లు ఉన్నాయి.

క్రిప్టాలజీ అండ్‌ సెక్యూరిటీ (సీఆర్‌ఎస్‌): బీఈ/ బీటెక్‌ లేదా ఇంటర్‌లో మ్యాథ్స్‌తో ఏదైనా పీజీ చదివినవారు అర్హులు. కోల్‌కతా క్యాంపస్‌లో కోర్సు అందిస్తున్నారు. 20 సీట్లు ఉన్నాయి.

క్వాలిటీ, రిలయబిలిటీ అండ్‌ ఆపరేషన్‌ రిసెర్చ్‌(క్యూఆర్‌ఓఆర్‌): స్టాటిస్టిక్స్‌లో మాస్టర్‌ డిగ్రీ ఉండాలి. దీంతోపాటు ఇంటర్‌లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ చదివుండాలి. లేదా మ్యాథ్స్‌లో మాస్టర్‌ డిగ్రీతోపాటు డిగ్రీలో స్టాటిస్టిక్స్‌ ఇంటర్‌లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ చదివుండాలి. లేదా బీఈ/ బీటెక్‌ ఉండాలి. కోల్‌కతా క్యాంపస్‌లో కోర్సు అందుబాటులో ఉంది. 25 సీట్లు ఉన్నాయి.

స్టాటిస్టికల్‌ మెథడ్స్‌ అండ్‌ ఎనలిటిక్స్‌: మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ లేదా బీఈ/ బీటెక్‌ చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్ఛు కోర్సు వ్యవధి ఏడాది. చెన్నై, తేజ్‌పూర్‌ క్యాంపసుల్లో అందిస్తున్నారు. ఒక్కో క్యాంపస్‌లో 15 చొప్పున సీట్లు ఉన్నాయి.

ఈ విద్యా సంవత్సరం నుంచి గిరిధ్‌ క్యాంపస్‌లో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ విత్‌ స్టాటిస్టికల్‌ మెథడ్స్‌ అండ్‌ ఎనలిటిక్స్‌ (పీజీడీఏఆర్‌ఎస్‌ఎంఏ) ఏడాది కోర్సును అందిస్తున్నారు. ఇందులో 15 సీట్లు ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ఇంటర్‌లో మ్యాథ్స్‌ లేదా స్టాటిస్టిక్స్‌ చదివుండాలి. ఈ కోర్సుకు స్టైపెండ్‌ లేదు.

జేఆర్‌ఎఫ్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌: స్టాటిస్టిక్స్‌, మ్యాథ్స్‌, క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, క్వాలిటీ రిలయబిలిటీ అండ్‌ ఆపరేషన్స్‌ రిసెర్చ్‌, ఫిజిక్స్‌ అండ్‌ అప్లయిడ్‌ మ్యాథ్స్‌, బయలాజికల్‌ సైన్స్‌, డెవలప్‌మెంట్‌ స్టడీస్‌, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో అవకాశం లభిస్తుంది. కోల్‌కతా, దిల్లీ, బెంగళూరు, చెన్నై, గిరిధ్‌ క్యాంపస్‌లో ఈ కోర్సులు ఉన్నాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 6

దరఖాస్తు ఫీజు: జనరల్‌ పురుషులకు రూ.1250, జనరల్‌ మహిళలకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులకు రూ.625

పరీక్ష: మే 10న నిర్వహిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం. www.isical.ac.in

మరిన్ని కోర్సులు, అర్హతలు, ఇతర వివరాల కోసం QR కోడ్‌ స్కాన్‌ చేయవచ్చు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని