జట్టుతో పైమెట్టు !

బృందనాయకత్వ నైపుణ్యం ఉన్నవారికోసం సంస్థలు అన్వేషిస్తుంటాయి. వివిధ రకాల పనులను చేసే బృందాల్లో పనిచేసేందుకు...

Published : 03 May 2021 00:43 IST

కెరియర్‌ ఉన్నతికి జీవన నైపుణ్యాలు 20
బృంద నిర్మాణం

బృందనాయకత్వ నైపుణ్యం ఉన్నవారికోసం సంస్థలు అన్వేషిస్తుంటాయి. వివిధ రకాల పనులను చేసే బృందాల్లో పనిచేసేందుకు ఉద్యోగులకు కొదువ వుండదు. కంపెనీలకు కావలసిందల్లా- ఉద్యోగులను కలిపి బృంద నిర్మాణం చేయగలిగేవారూ; సమర్థంగా బృంద నాయకత్వం వహించగలిగేవారూ!

వివిధ నైపుణ్యాలున్న వ్యక్తులు కొందరు సమష్టి లక్ష్యసాధనకు కలిసి పనిచేయడమే టీమ్‌ వర్క్‌. ఇలాంటి వైవిధ్య నైపుణ్యాలున్న బృంద సభ్యులకు నాయకత్వం వహించడమే లీమ్‌ లీడర్‌షిప్‌.
బృంద నిర్మాణ నైపుణ్యం పెంచుకోవాలంటే?  
ఒక్కరిగా అన్నీ చేయగలనన్న భ్రమ కంటే సమష్టిగా ఏదైనా సాధించగలమని నమ్మాలి. స్వీయ బలం, స్వీయ ప్రతిభపై నమ్మకం ఉండటంతోపాటు తోటివారి సామర్థ్యాలపై కూడా గౌరవం ఉండాలి. సహచరుల ప్రతిభా పాటవాలను గుర్తించి ఉమ్మడి లక్ష్యసాధనకు ఉపయోగించుకునే సామర్థ్యం పెంచుకోవాలి.  
నిష్పాక్షిక ఎంపిక:  బృంద సభ్యులను యాజమాన్యమే ఎంపిక చేసి ఇచ్చినప్పుడు సభ్యుల బలాబలాలను నిశితంగా పరిశీలించి తగిన విధంగా మలచుకోవాలి. అదే  సభ్యులను ఎంచుకునే స్వేచ్ఛను ఉద్యోగికి ఇస్తే నిష్పాక్షికంగా ఎంపిక చేసుకోవాలి. వ్యక్తిగత ఇష్టాయిష్టాలకంటే కంపెనీ అవసరాల రీత్యా ఎంపిక సాగాలి.  
భావ వ్యక్తీకరణే జీవనాడి: బృందం పటిష్ఠ్టంగా నడవాలంటే సభ్యులందరి మధ్య భావ వ్యక్తీకరణే పునాది. అందరూ చెప్పేది వినాలి. అందరికీ అన్ని ముఖ్య విషయాలూ పంచాలి. లక్ష్యానికి సంబంధించి అందరిలో స్పష్టత రావడానికి భావ వ్యక్తీకరణే సాధనంగా వినియోగించుకోవాలి. సభ్యులు ఏ విషయాన్నయినా స్వేచ్ఛగా వ్యక్తీకరించగలిగే వాతావరణం ఏర్పరచాలి.
గెలుపు అందరిదీ: బృంద నిర్మాణ సారథిగా సభ్యులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలి. ప్రాజెక్టు నిర్వహణలో మొత్తం బృందం గెలవాలన్న దిశగా కృషి చేయాలే తప్ప నాయకుడిగా తనదే పైచేయి కావాలన్న దృక్పథం ఉండకూడదు. నువ్వు గెలువు...నేను గెలుస్తా (విన్‌-విన్‌ రిలేషన్‌) అనే సూత్రంపై బృందం పనిచేసేలా చూడాల్సిన బాధ్యత బృంద సారథిదే!

- యస్‌.వి. సురేష్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని