Published : 11/08/2020 00:28 IST

కరోనా చికిత్స సక్రమంగా..

కొవిడ్‌-19కు మందు లేకపోవచ్ఛు కానీ దాని దుష్ప్రభావాలను కట్టడి చేసే చికిత్సలు లేకపోలేదు. వీటి మూలంగానే ఎంతోమంది బతికి బట్ట కడుతున్నారు. కాకపోతే కీలెరిగి వాత పెట్టటమే తెలియాలి. ప్రభుత్వాలు సైతం అన్ని చోట్లా ఒకే తరహా చికిత్స అందించటం ముఖ్యమని భావిస్తున్నాయి. ప్రముఖ వైద్య, పరిశోధన సంస్థల సిఫారసులు, ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాల ఆధారంగా దీన్ని ఒక కొలిక్కి తేవటంపై దృష్టి సారించాయి.

న అదృష్టమో, రోగనిరోధకశక్తి సామర్థ్యమో, యువతీ యువకుల సంఖ్య ఎక్కువగా ఉండటమో, వైరస్‌ బలహీనతో.. కారణమేదైనా కొవిడ్‌-19 మనకు అంత ప్రమాదకరంగా పరిణమించటం లేదు. వైరస్‌ సోకినా 80-90% మందిలో అసలు లక్షణాలే పొడసూపటం లేదు. లక్షణాలున్నవారిలోనూ 80-90% మందికి మామూలు స్థాయితోనే ఆగిపోతోంది. కేవలం 10-20% మందికే ఓ మాదిరిగా, తీవ్రంగా పరిణమిస్తోంది. అదీ 60 ఏళ్లు పైబడినవారికి, ఊబకాయులకు.. అధిక రక్తపోటు, మధుమేహం, కిడ్నీ, కాలేయ, గుండె, దీర్ఘకాల ఊపిరితిత్తుల సమస్యలు గలవారికి.. రోగనిరోధకశక్తిని అణచిపెట్టే మందులు వేసుకుంటున్నవారికి, క్యాన్సర్‌ చికిత్సలు తీసుకుంటున్నవారికి అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. వీరిలోనూ ఎంతోమంది ఇప్పుడు చికిత్సలతో కోలుకుంటుండటం గమనార్హం. కరోనా జబ్బు నియంత్రణ, చికిత్సలపై అవగాహన, అనుభవం పెరగటమే దీనికి మూలం. మొదట్లో ఊపిరితిత్తులనే దెబ్బతీస్తుందని భావించినప్పటికీ ఇది ఒళ్లంతా ప్రభావం చూపుతున్నట్టు అవగతమవుతోంది. వైరస్‌ ప్రేరేపించిన వాపు ప్రక్రియే (ఇన్‌ఫ్లమేషన్‌) తీవ్ర దుష్ప్రభావాలకు దారితీస్తోంది. రక్తం గడ్డకట్టే తీరు అస్తవ్యస్తమై సూక్ష్మ రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడటమే చాలావరకు ప్రాణాంతకమవుతోంది. వీటన్నింటినీ బేరీజు వేసుకుంటూ నిపుణులు చికిత్సలో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. ప్రయోగాత్మకంగా ఆరంభించిన మందులే అయినా చికిత్స క్రమంగా ఒక రూపానికి చేరుకుంటోంది. ప్రపరచ ఆరోగ్యసంస్థ, ప్రముఖ ఆసుపత్రులు, పరిశోధనా సంస్థలు, మన ఐసీఎంఆర్‌ సిఫారసులన్నింటినీ క్రోడీకరించుకుంటూ ఒక పద్ధతిని రూపొందించుకుంటున్నాం. దీన్ని అన్నిచోట్లా ఒకే రకంగా పాటించటం ఎంతైనా అవసరం. అందువల్ల ఎప్పుడు, ఎవరికి, ఎలాంటి చికిత్స చేయాలనే దానిపై అవగాహన కలిగుండటం అత్యవసరం.


లక్షణాలు లేనివారికి..

వైరస్‌ పాజిటివ్‌గా తేలి, లక్షణాలేవీ లేనివారు ఇతరులతో కలవకుండా ఇంట్లో విడిగా ఒక గదిలో ఉంటే చాలు. తమ వస్తువులను వేరేవాళ్లు తాకకుండా చూసుకోవాలి. పళ్లెం, పాత్రల వంటి వాటిని తామే శుభ్రం చేసుకుంటే మంచిది. ఆరోగ్య కార్యకర్తల సలహాలు, సూచనలు పాటిస్తూ గదిలో 10 రోజుల పాటు విడిగా గడపాలి. ఆ తర్వాత వారం వరకు ఇంటికే పరిమితం కావాలి. లక్షణాలు లేనంతవరకు ప్రత్యేకించి మందులేవీ అవసరం లేదు. అయితే జింక్‌, విటమిన్‌ సి, విటమిన్‌ డి మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది. ఇవి లోపించినవారికి సమస్య ఉద్ధృతమయ్యే అవకాశముంది.


ఒక మాదిరి జబ్బు గలవారికి

వీరికి గంటకోసారి ఆక్సిజన్‌ శాతాన్ని పరీక్షించటం కీలకం. ఆక్సిజన్‌ తగ్గుతుంటే ముందు చిన్న గొట్టం ద్వారా ముక్కులోకి ఆక్సిజన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అది చాలకపోతే మాస్కు బిగించి ఆక్సిజన్‌ ఇవ్వాలి. అవసరమైతే మెలకువగా ఉన్నప్పుడు బోర్లా పడుకోబెట్టటం మంచిది. కాసేపు ఎడమ వైపునకు, కాసేపు కుడి వైపునకు తిప్ఫి. కాసేపు బోర్లా పడుకోబెట్టాలి. దీంతో ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్‌ ఎక్కువగా వెళ్తుంది.

రోనా జబ్బు ఎప్పుడైనా, ఏ క్షణంలోనైనా ఉద్ధృతం కావొచ్ఛు ఉన్నట్టుండి న్యుమోనియాకు దారితీయొచ్ఛు ఇలాంటి స్థితిలో జ్వరం, దగ్గు ఎక్కువవుతాయి. శ్వాస వేగం నిమిషానికి 24, అంతకన్నా ఎక్కువకు పెరుగుతుంది. రక్తంలో ఆక్సిజన్‌ 94-90% మధ్యకు పడిపోతుంది. ఇలాంటివారిని ఆసుపత్రిలో చేర్చి, చికిత్స చేయటం తప్పనిసరి. దీంతో చాలామంది కోలుకుంటారు. తీవ్రదశలోకి చేరుకునే ముప్పు తగ్గుతుంది.

* జ్వరం, నొప్పులు తగ్గటానికి పారాసిటమాల్‌ మాత్రలు ఇవ్వాలి. దగ్గు తగ్గటానికి ఎన్‌-ఎసిటైల్‌ సిస్టీన్‌ మాత్రలు (రోజుకు 3) ఇవ్వచ్ఛు ఈ దగ్గు మాత్రలను సగం కప్పు నీటిలో కలిపి తాగిస్తే మంచిది. దీంతో తెమడ తేలికగా బయటకు వచ్చేస్తుంది. వీటితో పాటు జింక్‌, విటమిన్‌ సి, విటమిన్‌ డి మాత్రలు కొనసాగించాలి.

* ద్రవాలు తగినంతగా తీసుకునేలా చూడాలి.

* రక్తం గడ్డలు ఏర్పడకుండా ముందుజాగ్రత్తగా లో మాలిక్యులార్‌ హెపారిన్‌ లేదా సంప్రదాయ హెపారిన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. తీవ్ర కిడ్నీ జబ్బు గలవారికి, బాగా రక్తస్రావం అవుతున్నవారికి దీన్ని ఇవ్వకూడదు.

* వాపు ప్రక్రియ తగ్గటానికి డెక్సామెథసోన్‌ లేదా మిథైల్‌ ప్రెడ్నిసోలన్‌ మందులను 3-5 రోజుల పాటు ఇవ్వటం మంచిది. కొందరికి ఇంకా ఎక్కువ రోజులు ఇవ్వాల్సి రావొచ్ఛు

* ఐసీఎంఆర్‌ సిఫారసుల మేరకు రెమ్‌డెసివిర్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అందుబాటులో లేకపోతే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ తొలిరోజున 400 మి.గ్రా., మర్నాటి నుంచి 200 మి.గ్రా. చొప్పున నాలుగు రోజుల పాటు ఇవ్వాలి.

* కొందరికి ప్లాస్మా చికిత్స అవసరమవ్వచ్ఛు ఇది ఈ దశలోనే బాగా పనిచేస్తుంది. సాధారణంగా ప్లాస్మాను 200 మి.లీ. మోతాదులో ఇస్తారు. అవసరమైతే 24 గంటల తర్వాత మరోసారి ఇవ్వాల్సి ఉంటుంది.

* మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలుంటే తగు మందులతో నియంత్రణలోకి తీసుకురావాలి.


స్వల్ప లక్షణాలు గలవారికి

అనవసరంగా యాంటీబయోటిక్‌ మందులు ఇవ్వకూడదు. బాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ను అనుమానిస్తేనే ఇవ్వాలి.

కొద్దిపాటి లక్షణాలు గలవారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే ఉండొచ్ఛు ఇంట్లో విడిగా ఉండటానికి వీల్లేనివారు కొవిడ్‌ రక్షణ కేంద్రాల్లో చేరొచ్ఛు వీరిలో కొద్దిగా జ్వరం, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించొచ్ఛు కొందరికి ముక్కు దిబ్బడ వేయొచ్ఛు ఎలాంటి ఆయాసమూ ఉండదు. శ్వాసవేగం నిమిషానికి 24, అంతకన్నా తక్కువ.. రక్తంలో ఆక్సిజన్‌ 94%, అంతకన్నా ఎక్కువగా ఉంటాయి. దీన్నే మైల్డ్‌ లేదా మామూలు పై శ్వాసకోశ (అన్‌కాంప్లికేటెడ్‌ అప్పర్‌ రెస్పిరేటరీ ట్రాక్ట్‌) ఇన్‌ఫెక్షన్‌ దశ అంటున్నారు. ఇదేమీ ప్రమాదకరమైంది కాదు గానీ నిరంతరం గమనిస్తూ ఉండాలి. ఉదయం, సాయంత్రం, రాత్రి పూట పల్స్‌ ఆక్సీమీటర్‌తో రక్తంలో ఆక్సిజన్‌ మోతాదులను పరిశీలిస్తుండాలి. ఉష్ణోగ్రత పరీక్షిస్తూ ఉండాలి. ఆయాసం మొదలైనా, ఛాతీ బిగపట్టినట్టు ఉన్నా, ఆక్సిజన్‌ శాతం తగ్గుతున్నా తాత్సారం చేయరాదు. ఇవన్నీ సమస్య తీవ్రమవుతోందనటానికి సంకేతాలే. వీరికి వెంటనే తగు చికిత్స ఆరంభించాల్సి ఉంటుంది.

* జ్వరం, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, తగ్గటానికి పారాసిటమాల్‌ మాత్రలు.. అవసరమైతే దగ్గు మందు ఇవ్వచ్ఛు ఉప్పు నీటితో పుక్కిలిస్తే గొంతునొప్పి తగ్గే అవకాశముంది. వీటితో పాటు జింక్‌, విటమిన్‌ సి, విటమిన్‌ డి మాత్రలూ ఇవ్వాలి.

* తగు పోషకాహారం ఇవ్వాలి. నీళ్లు, ఇతర ద్రవాలు ఎక్కువగా తాగేలా చూడాలి.

* వీరికి ఫావిపిరవిర్‌ మందు కొంతవరకు మేలు చేస్తుంది. ఇది అందుబాటులో లేకపోతే కొవిడ్‌ తీవ్రమయ్యే ముప్పు అధికంగా గలవారికి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఇవ్వచ్ఛు కాకపోతే గుండెజబ్బులు, గుండెలయలో తేడాలు గలవారికి దీన్ని ఇవ్వకూడదు.


తీవ్ర, విషమస్థితిలో..

కొందరిలో తీవ్ర న్యుమోనియా తలెత్తొచ్ఛు పరిస్థితి మరింత విషమించి ఊపిరితిత్తులు విఫలం కావొచ్చు (అక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌). వీరిలో ఆక్సిజన్‌ 90% కన్నా కిందికి పడిపోతుంది. నిమిషానికి 30 కన్నా ఎక్కువసార్లు శ్వాస తీసుకుంటుంటారు. వీరికి యాంటీవైరల్‌తో పాటు రకరకాల మందులు, చికిత్సలు అవసరమవుతాయి.

* జ్వరం, దగ్గు వంటివి తగ్గటానికి ఆయా మందులను కొనసాగించాలి. ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూడాలి.

* రక్తం గడ్డకట్టే తీరును తెలిపే డీడైమర్‌ స్థాయులు పెరుగుతుంటే హెపారిన్‌ మోతాదు పెంచుకోవాల్సి ఉంటుంది.

* వాపు ప్రక్రియ తగ్గటానికి అవసరాన్ని బట్టి డెక్సామెథసోన్‌ లేదా మిథైల్‌ ప్రెడ్నిసోలన్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

* ఐఎల్‌-6, ఫెరిటిన్‌, ఎల్‌డీహెచ్‌, సీఆర్‌పీ వంటి వాపు ప్రక్రియల సూచికల స్థాయులు పెరుగుతున్నా, ఆక్సిజన్‌ శాతం వేగంగా తగ్గుతున్నా టోసిలిజుమాబ్‌ ఇవ్వచ్ఛు దీంతో మరణాలు తగ్గకపోయినా చికిత్స చేయాల్సిన రోజుల సంఖ్య తగ్గుతున్నట్టు ప్రయోగ పరీక్షలు చెబుతున్నాయి. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లు, క్షయ, హెపటైటిస్‌, కిడ్నీ వైఫల్యం వంటి జబ్బులు గలవారికి, చాలాకాలంగా స్టిరాయిడ్లు తీసుకుంటున్నవారికి, గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు దీన్ని ఇవ్వకూడదు.

* ఈ దశలో అవసరాన్ని బట్టి ప్లాస్మా చికిత్స చేయొచ్ఛు

* కొన్నిచోట్ల సెప్సిస్‌ చికిత్సలో వాడే సెప్సీవ్యాక్‌ ఇస్తున్నారు. కొందరికి యూలినాస్టాటిన్‌నూ వాడుతున్నారు. ఇది ఆక్సిజన్‌ స్థాయులను మెరుగుపరుస్తున్నట్టు అధ్యయనాల్లో తేలింది.

* విటమిన్‌ సి ఇంజెక్షన్‌, జింక్‌, విటమిన్‌ డి, ఎన్‌-ఎసిటీల్‌ సిస్టైన్‌ మాత్రలు ఇవ్వాల్సి ఉంటుంది.


నిరంతర పరిశీలన

విషమ స్థితిలో నిరంతర పరిశీలన చాలా ముఖ్యం. ఆక్సిజన్‌ ఇచ్చే తీరునూ మార్చాల్సి రావొచ్ఛు మామూలు మాస్కులతో ఆక్సిజన్‌ అంతగా అందకపోతే నాన్‌ రీబ్రీతర్‌ మాస్కు వాడాల్సి ఉంటుంది. దీంతో ఆక్సిజన్‌ లోనికి వెళ్తుంది గానీ బయటకు లీక్‌ కాదు. అదీ సరిపోకపోతే హైఫ్లోనేసల్‌ ఆక్సిజన్‌ పరికరం ద్వారా ఆక్సిజన్‌ అందించాలి. అప్పటికీ ఫలితం లేకపోతే బైప్యాప్‌ యంత్రం అమర్చాల్సి ఉంటుంది. ఇవేవీ పనిచేయకపోతే కృత్రిమ శ్వాస కల్పించాల్సి ఉంటుంది. ఎక్కువ ఒత్తిడితో ఆక్సిజన్‌ను అందించినా ఫలితం లేకపోతే ఎక్మో అవసరమవుతుంది. కొన్నిదేశాల్లో ప్రయోగాత్మకంగా ముక్కు ద్వారా నైట్రిక్‌ ఆక్సైడ్‌ సైతం ఇస్తున్నారు.


Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని