మొండి పుండు

కాళ్ల మీద పుండ్లు అనగానే సిరల జబ్బులే గుర్తుకొస్తాయి. నిజానికి ధమనుల జబ్బుతోనూ పుండ్లు తలెత్తొచ్చు. ఇవీ మానకుండా, దీర్ఘకాలం వేధించేవే. తగు చికిత్స తీసుకోకపోతే కణజాలం చచ్చుబడటానికీ దారితీస్తాయి. అందువల్ల వీటి గురించి తెలుసుకొని ఉండటం అవసరం.

Updated : 17 Aug 2021 05:32 IST

కాళ్ల మీద పుండ్లు అనగానే సిరల జబ్బులే గుర్తుకొస్తాయి. నిజానికి ధమనుల జబ్బుతోనూ పుండ్లు తలెత్తొచ్చు. ఇవీ మానకుండా, దీర్ఘకాలం వేధించేవే. తగు చికిత్స తీసుకోకపోతే కణజాలం చచ్చుబడటానికీ దారితీస్తాయి. అందువల్ల వీటి గురించి తెలుసుకొని ఉండటం అవసరం.

పుండు ఎక్కడున్నా ఇబ్బందే. అది కాళ్ల మీద ఏర్పడితే మరీ ఇబ్బంది పెడుతుంది. నడవటం కష్టమవుతుంది. పాదాల మీద పుండు పడితే చెప్పులు వేసుకోవటమూ కష్టమైపోతుంది. అందుకే వీటిని ఎంత త్వరగా నయమయ్యేలా చూసుకుంటే అంత మంచిది. కాళ్లలో ఏర్పడే పుండ్లలో 75 శాతం వరకూ సిరల జబ్బుతో ముడిపడినవే. సిరలు కాళ్ల నుంచి చెడు, తక్కువ ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని తిరిగి గుండెకు చేరవేస్తుంటాయి. అక్కడ్నుంచి రక్తం ఊపిరితిత్తుల్లోకి వెళ్లి, శుభ్రమవుతుంది. ఆక్సిజన్‌ను నింపుకొంటుంది. ఇది ధమనుల ద్వారా అవయవాలకు చేరుకుంటుంది. మన సిరల్లో పైకి వెళ్లిన రక్తం కిందికి జారిపోకుండా చూసే ప్రత్యేక కవాటాలుంటాయి. వీటి పనితీరు దెబ్బతింటే రక్తం పైకి వెళ్లకుండా అక్కడే స్థిరపడి పోతుంటుంది. దీంతో సిరలు దెబ్బతింటాయి. వీటిల్లోంచి ద్రవం, రక్త కణాలు లీక్‌ అవుతాయి. ఫలితంగా కాళ్లు ఉబ్బుతాయి. కాలి కణజాలానికి తగినంత రక్తం సరఫరా కాదు. క్రమంగా కణజాలం చనిపోతుంది. పుండు మొదలవుతుంది. అయితే ఒక్క సిరల జబ్బుతోనే కాదు.. గుండె నుంచి కాళ్లకు, పాదాలకు మంచి రక్తాన్ని మోసుకొచ్చే ధమనుల జబ్బుతోనూ పుండ్లు పడొచ్చు. నాలుగింట ఒక వంతు పుండ్లు ఇలాంటివే. ధమనులు దెబ్బతింటే కాళ్లకు సహజంగానే ఆక్సిజన్‌తో కూడిన మంచి రక్తం సరఫరా అస్తవ్యస్తమవుతుంది. ఇది పుండ్లు ఏర్పడటానికి, అక్కడి కణజాలం చచ్చుబడటానికి (గ్యాంగ్రీన్‌) దారితీస్తుంది.


ఒక్కలాగే కనిపించినా..

ధమనుల జబ్బుతో ముడిపడిన పుండ్లు చాలాసార్లు సిరల పుండ్లుగానూ కనిపిస్తుంటాయి. రెండింటిలోనూ నొప్పి, వాపు ఉన్నప్పటికీ లక్షణాల్లో కొన్ని తేడాలు లేకపోలేదు.

* ధమనుల పుండ్లు: ఇవి చాలా నొప్పితో కూడుకొని ఉంటాయి. ప్రధానంగా మడమల చుట్టుపక్కల.. పాదాలు, మడాలు, వేళ్ల మీద ఎక్కువగా కనిపిస్తుంటాయి. పుండ్లు ఎర్రగా, పసుపు పచ్చగా లేదా నల్లగా కనిపిస్తుంటాయి. పుండు లోతుగానూ ఉంటుంది. చర్మం బిగువుగా ఉంటుంది. రాత్రిపూట కాళ్ల నొప్పి తలెత్తుతుంది. రక్తస్రావం ఉండదు. తగినంత రక్తం అందకపోవటం వల్ల పుండున్న చోట చేయి పెడితే చల్లగా అనిపిస్తుంది. కాళ్లు వేలాడదీస్తే ఎర్రగా, పైకి ఎత్తి పెడితే పాలిపోయినట్టు కనిపిస్తాయి.

*సిరల పుండ్లు: ఇవి సాధారణంగా మోకాలి కింద నుంచి మడమల పై భాగంలో ఏర్పడుతుంటాయి. పుండున్న చోట వాపు, ఉబ్బు, ఎరుపు, దురద, చర్మం మందం కావటం, పొలుసులు లేవటం, చర్మం గోధుమ రంగు లేదా నల్లగా కనిపించటం, రసి కారటం వంటి లక్షణాలు ఉంటాయి. నొప్పి పెద్దగా ఉండకపోవచ్చు.


కారణాలు అనేకం

ధమనుల పుండ్లకు ప్రధాన మూలం రక్త సరఫరా అస్తవ్యస్తం కావటం. తగినంత రక్తం సరఫరా కాకపోతే చర్మం, కణజాలాల్లో ఆక్సిజన్‌, పోషకాలు లోపిస్తాయి. ఫలితంగా ఆయా భాగాలు వాచి, క్రమంగా పుండ్లు ఏర్పడతాయి. ఇవి చాలావరకు రక్తనాళాల్లో అడ్డంకుల మూలంగానే తలెత్తుతుంటాయి. అందుకే వీటిని ఇస్కీమిక్‌ అల్సర్లు అనీ పిలుస్తారు. అంటే కణజాలాలకు తగినంత రక్త సరఫరా కాకపోవటం వల్ల ఏర్పడే పుండ్లని అర్థం. వీటికి పలు అంశాలు దోహదం చేస్తుంటాయి.

* రక్తనాళాల వాపు: దీన్ని వ్యాస్కులైటిస్‌ అంటారు. ఇది ప్రధానంగా వేళ్లలోని చిన్న రక్తనాళాలను ప్రభావితం చేస్తుంది. ఇందులో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) మూలంగా ధమనుల గోడ వాచి, మందంగా తయారవుతుంది. వాపు ప్రక్రియ మూలంగా రక్తం గడ్డలు ఏర్పడొచ్చు కూడా. ఫలితంగా రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. దీంతో చర్మం, కణజాలం దెబ్బతింటాయి. ఇది పుండ్లకు దారితీస్తుంది. ఇవి ఒక పట్టాన నయం కావు. తగు చికిత్స తీసుకోకపోతే కణజాలం చచ్చుబడొచ్చు కూడా. వ్యాస్కులైటిస్‌కు కారణమేంటన్నది కచ్చితంగా తెలియదు. మన రోగనిరోధకశక్తి పొరపాటున మన మీదే దాడిచేయటం దీనికి కారణం కావొచ్చని భావిస్తున్నారు. ఇలాంటి స్వీయరోగనిరోధక సమస్యలు గలవారికి రక్తనాళాల వాపు ముప్పు ఎక్కువ.

* పూడికలు: గుండె రక్తనాళాల్లో ఏర్పడినట్టుగానే కాలి ధమనుల్లోనూ కొవ్వు, క్యాల్షియం, కొలెస్ట్రాల్‌ పోగుపడి పూడికలు (అథెరోస్క్లెరోసిస్‌) ఏర్పడొచ్చు. దీంతో ధమనుల లోపలి మార్గం సన్నబడి, రక్త సరఫరా పడిపోతుంది. కొన్నిసార్లు పూడికల ముక్కలు ధమనుల గోడ నుంచి విడిపోయి రక్తం గడ్డ కట్టొచ్చు. దీంతో రక్త సరఫరా పూర్తిగానూ ఆగిపోవచ్చు. కాలి ధమనుల్లో పూడికలు తలెత్తితే చిన్న దెబ్బ తగిలినా పెద్ద పుండుగా మారొచ్చు. దీర్ఘకాలం మానకుండా వేధించొచ్చు. రక్త సరఫరా పూర్తిస్థాయిలో కుదురుకుంటే తప్ప ఇవి నయం కావు. వయసు మీద పడుతున్నకొద్దీ పూడికలు ఏర్పడే ముప్పు పెరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు, పొగ అలవాటు, మధుమేహం, వ్యాయామం చేయకపోవటం వంటివీ కారణం కావొచ్చు.

* బర్గర్స్‌ డిసీజ్‌: ఇది ప్రధానంగా పొగ తాగటం, పొగాకు నమలటంతో తలెత్తే సమస్య. దీని బారిన పడుతున్నవారిలో 95% మంది పొగాకు వాడే వారే. సిగరెట్లు, బీడీలు, చుట్టలు, ఖైనీ, జర్దా వంటి వాటిల్లో నికొటిన్‌ ఉంటుంది. ఇది రక్తనాళాలకు పెద్ద శత్రువు. బర్గర్స్‌ జబ్బులో ముఖ్యంగా మధ్యస్థ, సూక్ష్మ రక్తనాళాల్లో వాపు తలెత్తుతుంది. దీంతో రక్తనాళాల లోపలి మార్గం సన్నబడి, మంచి రక్తం సరఫరా తగ్గుతుంది. కొందరిలో చాలా తక్కువగా రక్త సరఫరా కావొచ్చు. ఇది పాదాల మీద పుండ్లకు దారితీస్తుంది. ఇవి దీర్ఘకాలం నయం కాకుండా వేధిస్తుంటే క్రమంగా అక్కడి కణజాలం చచ్చుబడే ముప్పు పెరుగుతుంది.


రక్త ప్రసరణ కాకపోవటంతో చచ్చుబడ్డ వేళ్లు

పుండ్లకు కారణమేంటన్నది పరిశీలించటం ప్రధానం. కారణాన్ని గుర్తిస్తే పుండు పూర్తిగా నయమయ్యేలా చూసుకోవచ్చు. తిరగ బెట్టకుండా చూసుకోవచ్చు. ధమనుల పుండ్ల చికిత్సలో ప్రధానమైంది ఆ భాగానికి రక్త సరఫరాను పెంచటం. నొప్పిని తగ్గించటం.. పుండు బాగా, త్వరగా నయమయ్యేలా చూడటమూ ముఖ్యమే. యాంటీబయోటిక్‌ మందులు లక్షణాలు తగ్గటానికి ఉపయోగపడతాయి గానీ పూర్తిగా నయం చేయలేవు. అందువల్ల మందులతో పాటు రక్త సరఫరాను పునరుద్ధరించాల్సి ఉంటుంది. ఇందుకు శస్త్రచికిత్స అవసరమవుతుంది. రక్తనాళాల వాపుతో తలెత్తే పుండ్లకు చాలావరకు సర్జరీ అవసరపడకపోవచ్చు. మందులతోనే తగ్గిపోవచ్చు. అదే పూడికలు ఉన్నట్టయితే ఆర్టీరియల్‌ బైపాస్‌ సర్జరీ అవసరమవుతుంది. ఇందులో కృత్రిమ రక్తనాళాలను అమర్చి రక్త సరఫరాను పునరుద్ధరిస్తారు. కొన్నిసార్లు యాంజియోప్లాస్టీ అవసరపడొచ్చు. ఇందులో రక్తనాళం ద్వారా గొట్టంతో పాటు బెలూన్‌ను పంపించి, ఉబ్బిస్తారు. కొందరికి స్టెంట్‌ వేయాల్సి రావొచ్చు. దీంతో సన్నబడిన మార్గం తెరచుకుంటుంది. రక్తం బాగా సరఫరా అవుతుంది. ఇది పుండు త్వరగా నయమయ్యేలా చేస్తుంది. రక్త సరఫరా మెరుగుపడకపోయినా, పుండు తీవ్ర ఇన్‌ఫెక్షన్‌కు గురైనా, కణజాలం చచ్చుబడినా (గ్యాంగ్రీన్‌) ఆయా భాగాలను తొలగించాల్సి రావొచ్చు.

* పుండును పొడిగా, శుభ్రంగా ఉంచుకోవటం కీలకం. బ్యాండేజీ కట్టుతో ఇన్‌ఫెక్షన్‌ తలెత్తకుండా, పుండు పెద్దది కాకుండా చూసుకోవచ్చు. తరచూ కట్టు మార్చుకోవాలి. మధుమేహం వంటి జబ్బులను కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి.


యాంజియోగ్రఫీ సాయం

ధమనుల జబ్బుతో తలెత్తే పుండ్లను అంచనా వేయటానికి ఆర్టీరియల్‌ యాంజియోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. ఇందులో రక్తనాళంలోకి రంగును ఎక్కించి ఎక్స్‌రే తీస్తారు. దీంతో కాళ్లలో మంచి రక్తం సరఫరా తీరును తెలుసుకోవచ్చు. పూడికల తీరు, సైజు కూడా తెలుస్తాయి. ఎలాంటి చికిత్స అవసరమనేది నిర్ణయించుకోవటానికిది తోడ్పడుతుంది. ప్రస్తుతం అధునాత మల్టీ-స్లైస్‌ సి.టి. యాంజియోగ్రఫీ సైతం అందుబాటులో ఉంది. ఇది తేలికైన పరీక్ష. ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు. గొట్టాన్ని ధమనిలోకి పంపించటానికి గజ్జల్లో రంధ్రం చేయాల్సిన అవసరం లేదు. పైగా ఖర్చు కూడా తక్కువే.


ఏది పడితే అది రాయొద్దు

కాళ్ల మీద పుండ్లకు చాలామంది ఏవేవో మలాములు పూస్తుంటారు. కొందరు ఆవు మూత్రాన్ని కూడా రాస్తుంటారు. ఇలాంటివి పుండ్లను నయం చేయవు సరికదా, మరింత పెద్దగా అయ్యేలా చేస్తాయి. నాటు మందుల జోలికి వెళ్లటమూ తగదు. కాళ్లకు మంచి రక్తం సరఫరాను పునరుద్ధరిస్తే తప్ప పుండు నయం కాదనే సంగతిని అర్థం చేసుకోవాలి. అలాగే ఆసుపత్రికి వెళ్లేటప్పుడు కూడా అక్కడ అన్నివేళలా వ్యాస్కులర్‌ సర్జన్‌ అందుబాటులో ఉంటారో లేదో చూసుకోవాలి. డాప్లర్‌ స్టడీ, సీటీ, ఎంఆర్‌ యాంజియోగ్రఫీ వంటి ప్రత్యేక పరీక్ష సదుపాయాలు ఉన్న ఆసుపత్రులనే ఎంచుకోవాలి. కాళ్లకు, చేతులకు బైపాస్‌ సర్జరీ తరచూ చేస్తున్నారో లేదో కూడా చూసుకోవటం మంచిది.


నివారణపై దృష్టి

కాళ్లకు రక్త సరఫరా మెరుగుపడటానికి జీవనశైలి మార్పులు బాగా ఉపయోగపడతాయి. రక్తం బాగా సరఫరా అయితే పుండ్లు పడకుండానూ చూసుకోవచ్చు.

* పొగాకుకు దూరం: పొగాకు రక్తనాళాలను దెబ్బతీస్తుంది. కాబట్టి పొగ తాగటం, పొగాకు నమలటం అలవాటు గలవారు వెంటనే మానెయ్యాలి.

* మంచి ఆహారం: కొవ్వు పదార్థాలు తగ్గించుకోవాలి. దీంతో కొలెస్ట్రాల్‌ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.

* వ్యాయామం: రోజూ క్రమం తప్పకుండా నడక వంటి వ్యాయామాలు చేయాలి. వీటితో కాళ్లకు రక్త సరఫరా పుంజుకుంటుంది. వ్యాయామాలు చేస్తున్నప్పుడు కాళ్లు కొద్దిగా నొప్పి పెట్టటం సహజమే. అయితే మరీ ఎక్కువగా నొప్పి పెట్టటం రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటానికి సంకేతం కావొచ్చు. ఇలాంటిది గుర్తిస్తే వెంటనే డాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలి.

* పాదాల మీద శ్రద్ధ: పాదాలకు తగిన సైజు షూ వేసుకోవాలి. మరీ బిగుతుగా ఉండేవి ఎంచుకోవద్దు. రోజూ పాదాలను గమనిస్తూ ఎక్కడైనా రంగు మారిందా? పుండ్లు ఏమైనా ఏర్పడుతున్నాయా? అనేవి చూసుకోవాలి. కాళ్లను పొడిగా ఉంచుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని