తొందరపడే కోయిలలు

గర్భస్థ శిశువుకు అమ్మ కడుపే అన్నీ. అవసరమైన పోషకాలు అందిస్తుంది. వెచ్చగా ఉంచుతుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఇలా నిరంతరం సంరక్షిస్తూ.. నెలలు నిండాక నెమ్మదిగా బయటకు సాగనంపుతుంది. కానీ కొందరు శిశువులు నెలలు నిండకముందే తొందరపడి పోతుంటారు.

Published : 16 Nov 2021 01:44 IST

రేపు వరల్డ్‌ ప్రిమెచ్యూరిటీ డే

గర్భస్థ శిశువుకు అమ్మ కడుపే అన్నీ. అవసరమైన పోషకాలు అందిస్తుంది. వెచ్చగా ఉంచుతుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఇలా నిరంతరం సంరక్షిస్తూ.. నెలలు నిండాక నెమ్మదిగా బయటకు సాగనంపుతుంది. కానీ కొందరు శిశువులు నెలలు నిండకముందే తొందరపడి పోతుంటారు. మున్ముందుగా తోసుకొచ్చేస్తుంటారు (ప్రిటర్మ్‌ డెలివరీ). ఒకపక్క పూర్తిగా అభివృద్ధి చెందని అవయవాలు.. మరోపక్క బయటి వాతావరణానికి తగని శరీరం. దీంతో శ్వాస సరిగా తీసుకోలేక, పాలు తాగలేక, చలిని తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడతారు. పరిస్థితి విషమిస్తే ప్రాణాపాయమూ సంభవించొచ్చు. మరి ఇలాంటి తొందర కోయిలలను సంరక్షించుకోవటమెలా?

న శరీరంలోని కణాల పుట్టుక, ఎదుగుదల అన్నీ కాలానుగుణంగానే సాగుతాయి. ఇది గర్భధారణ నుంచే మొదలవుతుంది. ఆ మాటకొస్తే గర్భధారణ నుంచి కాన్పు వరకు కాలమే అంత్యంత కీలకం. సాధారణంగా తొమ్మిది నెలలు (సుమారు 40 వారాలు) నిండాకే కాన్పు అవుతుంది. కానీ అందరిలో ఇలాగే జరగాలని లేదు. కొన్నిసార్లు అంతకన్నా ముందే.. 37 వారాల్లోపే ప్రసవం కావొచ్చు. దీన్నే ముందస్తు కాన్పుగా (ప్రిమెచ్యూర్‌ డెలివరీ) పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.5 కోట్ల మంది నెలలు నిండకముందే పుడుతున్నారని అంచనా. వీరిలో 30 లక్షల మంది మనదేశానికి చెందినవారే. శిశు మరణాలకు రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ (సెప్సిస్‌), తగినంత ఆక్సిజన్‌ అందకపోవటం (బర్త్‌ అస్‌ఫీక్సియా) వంటి సమస్యలతో పాటు ముందస్తు కాన్పులూ ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తు కాన్పులపై అవగాహన కలిగించేందుకు ‘వరల్డ్‌ ప్రిమెచ్యూరిటీ డే’ ఆరంభమైంది. నెలలు నిండకముందే పుట్టినా తగు జాగ్రత్తలతో పిల్లలను కాపాడుకోవచ్చని, మిగతా పిల్లల మాదిరిగానే జీవించేలా చూసుకోవచ్చని చెప్పటం దీని ఉద్దేశం. వీలైనంత వరకూ తల్లినీ బిడ్డను కలిపే ఉంచాలని ఈసారి ప్రత్యేకించి నినదిస్తోంది కూడా.

మూడు రకాలు

నెలలు నిండక ముందు పుట్టినా పిల్లలందరినీ ఒకే గాటన కట్టలేం. కొందరు 28 వారాల్లోపే పుడితే (ఎక్స్‌ట్రీమ్‌ ప్రిటర్మ్‌).. ఇంకొందరు 28-32 వారాల్లోపు పుట్టొచ్చు (వెరీ ప్రిటర్మ్‌). కొందరు 32-34 వారాల్లో పుడితే (మోడరేట్లీ ప్రిటర్మ్‌).. మరికొందరు 34-37 వారాల్లో పుట్టొచ్చు (లేట్‌ ప్రిటర్మ్‌). ఎంత ముందుగా పుడితే అన్ని సమస్యలు ఎక్కువ. అంత జాగ్రత్త అవసరం. ఒకప్పుడు ఇలాంటి శిశువులను రక్షించుకోవటం చాలా కష్టంగా ఉండేది. అధునాతన పద్ధతులు, సదుపాయాలు అందుబాటులోకి రావటంతో ఇప్పుడు 24 వారాలకు పుట్టినవారినీ కాపాడుకోవటం సాధ్యమవుతోంది.

కాన్పు గది నుంచే..

నెలలు నిండక ముందే పుట్టే పిల్లల సంరక్షణ కాన్పు గది నుంచే మొదలవుతుంది. కాన్పు గది మరీ చల్లగా లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. తల్లికి స్టిరాయిడ్‌ ఇంజెక్షన్‌ ఇస్తే శిశువుల్లో ఊపిరితిత్తులు త్వరగా అభివృద్ధి చెందటానికి వీలుంటుంది. మెగ్నీషియం సల్ఫేట్‌ ఇంజెక్షన్‌ కూడా మేలు చేస్తుంది. దీంతో శిశువుల మెదడు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. బిడ్డ పుట్టిన వెంటనే కాకుండా 30 సెకండ్ల నుంచి 60 సెకండ్ల తర్వాత బొడ్డుతాడును బిగించి, కత్తిరించటమూ ముఖ్యమే. దీంతో మాయలో ఉన్న రక్తం పూర్తిగా బిడ్డకు చేరుతుంది. సుమారు 60-80 ఎంఎల్‌ రక్తం అదనంగా అందుతుంది. ఫలితంగా బిడ్డకు రక్తహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. రక్తహీనత శిశువులకు పెద్ద శత్రువన్న సంగతి తెలిసిందే.

* ముందుగా పుట్టే పిల్లల్లో చర్మం పలుచగా ఉంటుంది. చర్మం కింద కొవ్వు అంతగా ఉండదు. దీంతో శరీరం నుంచి ఉష్ణోగ్రత్త త్వరగా బయటకు వెళ్లిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. బిడ్డకు సత్వరం వెచ్చదనం కల్పించకపోతే ప్రాణాపాయమూ సంభవించొచ్చు. అందుకే పుట్టిన వెంటనే వీరిని ప్రత్యేకమైన ప్లాస్టిక్‌ సంచీలో పెడతారు. మరీ ముందుగా పుట్టే పిల్లలకైతే ఇది మరింత అవసరం. తర్వాత ప్రత్యేక సంరక్షణ గదికి తరలిస్తారు.

తల్లి కడుపులో మాదిరి రక్షణ..

ముందే పుట్టిన వారికి తల్లి కడుపులో మాదిరి వాతావరణాన్ని కల్పించటం చాలా కీలకం. వార్మర్‌, ఇంక్యుబేటర్‌ ద్వారా వెచ్చగా ఉంచటం దగ్గర్నుంచి శ్వాస తీసుకోలేనివారికి కృత్రిమ శ్వాస కల్పించటం, పాలు తాగలేనివారికి గొట్టం ద్వారా ఇవ్వటం వరకూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. శబ్దాలు, కాంతి ఎక్కువ లేకుండానూ చూస్తారు. ఇలా ఉమ్మనీరు తప్పించి తల్లి కడుపులో ఉండే వాతావరణాన్ని తిరిగి సృష్టిస్తారు. దీన్నే ‘డెవలప్‌మెంట్‌ సపోర్ట్‌ కేర్‌’ అంటారు.


అనుక్షణ సంరక్షణ

లేట్‌ ప్రిటర్మ్‌ పిల్లల్లో అవయవాలు చాలావరకు అభివృద్ధి చెందుతాయి. వీరిని కాస్త వెచ్చగా ఉంచితే చాలు. ఒకవేళ శ్వాస సరిగా తీసుకోలేకపోతే బయటి నుంచి ఆక్సిజన్‌ ఇస్తారు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతోనే చాలావరకు కుదురుకుంటారు. అదే 28 వారాల్లోపు, కిలో కన్నా తక్కువ బరువుతో పుట్టినవారిలో అవయవాలు తయారవుతాయి గానీ ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఊపిరితిత్తులు అప్పుడప్పుడే శ్వాస తీసుకోవటం నేర్చుకుంటూ ఉంటాయి. మెదడులో శ్వాస తీసుకునే విధానాన్ని నియంత్రించే భాగం 34 వారాలకే అభివృద్ధి చెందుతుంది. అందుకే అంతకన్నా ముందు పుట్టిన పిల్లలు కొన్నిసార్లు శ్వాస తీసుకోవటం మరచిపోతుంటారు కూడా. వీరికి కృత్రిమంగా శ్వాస అందించాల్సి రావొచ్చు. శరీర ఉష్ణోగ్రత పడిపోకుండా వార్మర్‌లో పెట్టాలి. చర్మం నుంచి ద్రవాలు లీకవుతుండటం వల్ల కొందరికి వార్మర్‌తోనూ ఉపయోగం ఉండకపోవచ్చు. అప్పుడు ఇంక్యుబేటర్‌ అవసరమవుతుంది. 28-32 వారాల్లో పుట్టే పిల్లల్లోనూ ఇలాంటి సమస్యలు కనిపిస్తుంటాయి గానీ అంత తీవ్రంగా ఉండవు. కాస్త జాగ్రత్తగా చూసుకుంటే చాలావరకు కాపాడుకోవచ్చు.

* పాలు తాగటం, మింగటం, శ్వాస.. ఇవన్నీ ఒక సమన్వయంతో సాగుతాయి. ఈ సామర్థ్యం 37 వారాల తర్వాతే అబ్బుతుంది. నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలు రొమ్మును పట్టి పాలు తాగలేరు. వీరికి శ్వాస సమస్యలేవీ లేకపోతే తల్లి పాలు గానీ దాతల పాలు గానీ లేదా పోతపాలను గానీ చెమ్చాతో తాగిస్తారు. నోటితో తాగలేకపోతే గొట్టం ద్వారా ఇస్తారు. అయితే వీరిలో పేగులు పాలను సరిగా జీర్ణం చేసుకోలేవు. అందుకే క్రమంగా పాల మోతాదును పెంచుకుంటూ వస్తారు. మరీ ముందుగా పుట్టిన పిల్లలకు రక్తనాళం ద్వారా ప్రొటీన్‌, కొవ్వుతో కూడిన ద్రవం ఇస్తారు.

* ఎక్కువ పీడనంతో కృత్రిమశ్వాస కల్పిస్తే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అందుకే ప్రత్యేకమైన బ్యాగులు, గొట్టాల సాయంతో తక్కువ పీడనంతో శ్వాస కల్పిస్తారు. అలాగే రక్తంలో ఆక్సిజన్‌ శాతం 92-95% కన్నా మించకుండా చూడటం ముఖ్యం. ఆక్సిజన్‌ శాతాన్ని క్రమంగా పెంచుకుంటూ వస్తారు.

* గుండె, శ్వాస వేగం, రక్తపోటు వంటివన్నీ నిరంతరం పరిశీలిస్తారు. తరచూ రక్త పరీక్షలు చేస్తూ గ్లూకోజు, క్యాల్షియం మోతాదుల వంటివి గమనిస్తారు. మరీ ముందుగా పుట్టిన పిల్లలకు మెదడులో రక్తం లీకయ్యే ముప్పుంది. దీన్ని తెలుసుకోవటానికి మాడు ద్వారా అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ చేస్తారు.

ఎప్పుడు కోలుకున్నట్టు?

బిడ్డ సొంతంగా శ్వాస తీసుకుంటూ, పాలు తాగుతూ, బరువు పెరుగుతూ, ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటూ, ఇతరత్రా సమస్యలేవీ లేకపోతే పూర్తిగా కోలుకున్నట్టుగా భావించొచ్చు. 34 వారాలకు చేరుకున్నాక గానీ 1.5 కిలోల బరువు పెరిగాక గానీ ఆసుపత్రి నుంచి ఇంటికి పంపిస్తారు. కొన్నిచోట్ల ఇంకా ముందుగానే పంపించొచ్చు. ఇంటికి వెళ్లాకా జాగ్రత్తగా ఉండాలి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవాలి. వీలైనంతవరకు తల్లిపాలే ఇవ్వాలి. తక్కువ బరువుతో పుట్టినవారికి తల్లిపాలతో పాటు ప్రొటీన్‌, క్యాల్షియం, ఐరన్‌, విటమిన్ల వంటివీ అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది.

ముందే కాన్పయ్యే ముప్పు ఎవరికి?

ప్రతి 10 మంది గర్భిణుల్లో ఒకరికి ముందస్తు కాన్పయ్యే అవకాశముంది. గతంలో నెలలు నిండకముందే కాన్పవ్వటం, గర్భాశయ ముఖద్వారం వెడల్పు 25 మి.మీ. కన్నా తక్కువగా ఉండటం, పిండానికి తగినంత రక్తం సరఫరా కాకపోవటం, పిండం సరిగా ఎదగకపోవటం, ఉమ్మనీరు చాలా ఎక్కువగా ఉండటం, శిశువుకు పుట్టుకతో లోపాలు, గర్భంలో కవలలు ఉండటం.. తల్లికి అధిక రక్తపోటు, గుండెజబ్బులు, గర్భసంచి చిన్నగా ఉండటం, గర్భసంచిలో అడ్డుపొర, ఇన్‌ఫెక్షన్ల వంటివన్నీ ముందస్తు కాన్పులకు దోహదం చేస్తాయి. కొన్ని జాగ్రత్తలతో వీటిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. గతంలో ముందుగా కాన్పయినవారికి, గర్భాశయ ముఖద్వారం చిన్నగా ఉన్నవారికి ప్రొజెస్టిరాన్‌ మాత్రలు, గర్భాశయ ముఖద్వారానికి కుట్లు వేయటం ఉపయోగపడతాయి.


సమస్యల ముప్పు

రీ ముందుగా పుట్టినవారికి సమస్యల ముప్పు ఎక్కువ. కొన్ని స్వల్పకాలమే ఉంటే.. మరికొన్ని దీర్ఘకాలం వేధించొచ్చు. కొన్ని సమస్యలు పుట్టుకతోనే ఉండొచ్చు, కొన్ని పుట్టిన తర్వాత మొదలు కావొచ్చు.

స్వల్పకాల ఇబ్బందులు

శ్వాస సమస్యలు: శ్వాస కోశ వ్యవస్థ సరిగా అభివృద్ధి కాకపోవటం వల్ల శ్వాస సరిగా తీసుకోలేక ఇబ్బంది పడొచ్చు (రెస్పిరేటరీ డిస్ట్రస్‌ సిండ్రోమ్‌). వీరికి ఊపిరితిత్తుల్లోకి సర్ఫక్టెంట్‌ను ఇవ్వటం మేలు చేస్తుంది. ఎక్కువ రోజులు కృత్రిమ శ్వాస మీద ఉంచితే దీర్ఘకాల ఊపిరితిత్తుల జబ్బు రావచ్చు.

గుండె సమస్యలు: గుండె పంపింగ్‌ సామర్థ్యం తగ్గటం వల్ల రక్తపోటు పడిపోవచ్చు. దీనికి మందులు అవసరమవుతాయి. గర్భంలో ఉన్నప్పుడు గుండె నుంచి ఊపిరితిత్తులకు వెళ్లే ధమని, బృహద్ధమనిని అనుసంధానం చేసే రంధ్రం (డక్టస్‌ ఆర్టీరియోసిస్‌) తెరచుకొని ఉంటుంది. దీంతోనే ఆక్సిజన్‌తో కూడిన రక్తం అందుతుంది. ఇది పుట్టిన తర్వాత 24 గంటల్లో మూసుకుపోతుంది. కానీ ముందే పుట్టిన కొందరు పిల్లల్లో ఇది తెరచుకునే ఉంటుంది. పారాసిటమాల్‌, ఐబూప్రొఫెన్‌, ఎండోమెథసిన్‌ ఇంజెక్షన్లతోనే చాలావరకిది కుదురుకుంటుంది. అరుదుగా సర్జరీ అవసరమవ్వచ్చు.

ఇన్‌ఫెక్షన్లు: నెలలు నిండకముందు పుట్టేవారిలో రోగనిరోధకశక్తి బలంగా ఉండదు. దీంతో తేలికగా ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదముంది. రకరకాల చికిత్సలు చేయాల్సి రావటం, ఒంట్లోకి రకరకాల గొట్టాలు ప్రవేశపెట్టం వంటివీ ఇన్‌ఫెక్షన్లకు దారితీయొచ్చు. కొందరికి పుట్టుకతోనే ఇన్‌ఫెక్షన్లు ఉండొచ్చు.

పేగుల సమస్యలు: జీర్ణకోశ వ్యవస్థ సరిగా అభివృద్ధి చెందకపోవటం వల్ల పేగుల్లో కణజాలం చచ్చుబడొచ్చు (నెక్రోటైజింగ్‌ ఎంటెరోకొలైటిస్‌). కొన్నిసార్లు పేగుల్లో రంధ్రాలు పడొచ్చు. తీవ్రతను బట్టి దీనికి చికిత్స చేస్తారు. కొన్నిసార్లు సర్జరీ అవసరమవ్వచ్చు.

మెదడు సమస్యలు: మరీ ముందుగా పుట్టే పిల్లల మెదడులో రక్తస్రావమయ్యే అవకాశముంది. చాలావరకు కొద్దిగానే రక్తస్రావమవుతుంది. దానంతటదే తగ్గిపోతుంది. కానీ కొందరిలో ఎక్కువగా రక్తస్రావం కావొచ్చు. ఇది మెదడును దెబ్బతీయొచ్చు.

రెటీనా సమస్య: మరీ ముందుగా పుట్టిన పిల్లల్లో కంట్లోని రెటీనాకు రక్త సరఫరా చేసే రక్తనాళం సరిగా అభివృద్ధి చెందదు. దీంతో చూపు రాకపోవచ్చు. వీరికి కృత్రిమ శ్వాస కల్పించినప్పుడు ఆక్సిజన్‌ శాతం మరీ మించకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఆక్సిజన్‌ ఎక్కువైతే కంట్లో రక్తనాళాల అభివృద్ధి దెబ్బతినొచ్చు. అందువల్ల ముందే పుట్టిన పిల్లలందరికీ 3-4 వారాల వయసులో కంటి పరీక్ష చేయించటం తప్పనిసరి.

రక్త సమస్యలు: ఎముక మజ్జ, రక్తం తయారీ ఆలస్యం కావటం వల్ల రక్తహీనత తలెత్తొచ్చు. వీరికి కామెర్ల ముప్పు మరింత ఎక్కువ. దీన్ని తట్టుకోలేరు కూడా. కామెర్లు స్వల్పంగా ఉన్నా వీరికి వెంటనే కాంతి చికిత్స ఆరంభిస్తారు.

వినికిడి సమస్య: వీరికి వినికిడి లోపించే ముప్పూ ఎక్కువే. 34-36 వారాల మధ్యలో వినికిడి పరీక్ష చేయాలి. 3 నెలల వయసులో మరోసారి పరీక్షించాలి.

ఎముకల సమస్యలు: ఎముకలు గట్టిపడే ప్రక్రియ ఆలస్యం కావటం వల్ల కొందరికి రికెట్స్‌ వచ్చే అవకాశముంది.

దీర్ఘకాల ఇబ్బందులు

తొలివారాల్లో తలెత్తే సమస్యలకు చికిత్స చేస్తే చాలామంది కుదురుకుంటారు. అయితే సమస్యలు తీవ్రంగా గలవారిలో కొందరికి సెరిబ్రల్‌ పాల్సీ.. విషయ గ్రహణ, చూపు, వినికిడి లోపాలు.. ఆస్థమా వంటివి దీర్ఘకాలం వేధించొచ్చు.


తల్లిదండ్రుల భాగస్వామ్యం

శిశు సంరక్షణలో తల్లిదండ్రులనూ పాలు పంచుకునేలా చూడటం మేలు చేస్తుంది. నెలలు నిండకముందే పుట్టినా తల్లిదండ్రుల నుంచి బిడ్డను వేరు చేయొద్దనే భావనకు ఇప్పుడు ప్రాచుర్యం పొందుతోంది. శిశువుకు తల్లి గుండె చప్పుడు తెలుసు. తల్లి స్పర్శ తెలుసు. అందువల్ల తల్లితో కలిపి ఉంచితే బిడ్డ ధైర్యంగా ఉంటుంది. తాను తల్లి సంరక్షణలోనే ఉన్నాననే భావన కలుగుతుంది. తగినంత వెచ్చదనం లభిస్తుంది. తల్లికీ ఆత్మ విశ్వాసం ఇనుమడిస్తుంది. అందుకే కిలో కన్నా ఎక్కువ బరువుండి, ఇతరత్రా సమస్యలేవీ లేకపోతే తల్లి గుండె మీద శిశువును పడుకోబెట్టి, దుప్పటితో చుట్టేస్తారు (కంగారు సంరక్షణ). తక్కువ బరువు ఉన్నా, ఇంక్యుబేటర్‌లో పెట్టినా కూడా ఆరోగ్యం కుదురుగా ఉంటే అప్పుడప్పుడు తల్లి ఛాతీ మీద శిశువును పడుకోబెట్టొచ్చు. ఇది బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది. బరువు మెరుగవుతుంది. బయటి నుంచి ఆక్సిజన్‌ ఇవ్వాల్సిన అవసరం తగ్గుతుంది. శిశువు మరణించే ముప్పు తగ్గుతుంది.


ఎదుగుదల అంచనా భిన్నంగా

పిల్లల ఎదుగుదల ఎలా ఉందన్నది క్రమం తప్పకుండా పరిశీలించటం ముఖ్యం. వీరిలో ఎదుగుదలను అసలు కాన్పు తేదీ నుంచే లెక్కించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 24 వారాల్లోపే పుడితే 4 నెలల ముందే పుట్టినట్టు. వీరికి 8 నెలల వయసు వచ్చినా 4 నెలల పిల్లల మాదిరిగానే పరిగణించాల్సి ఉంటుంది. రెండేళ్లు దాటినంతవరకూ దీని ఆధారంగానే ఎదుగుదల తీరును అంచనా వేయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు