తింటున్నప్పుడు ముక్కు కారుతోంది!

నా వయసు 65 ఏళ్లు. నాకు అన్నం తినేటప్పుడు మాత్రమే ముక్కు కారుతుంది.

Published : 07 Jul 2020 00:41 IST

సమస్య: నా వయసు 65 ఏళ్లు. నాకు అన్నం తినేటప్పుడు మాత్రమే ముక్కు కారుతుంది. దీంతో చాలాసార్లు లేవాల్సి వస్తుంది. దీనికి కారణమేంటి? పరిష్కారమేంటి?

- సత్యానంద్‌ నూతి (ఈ మెయిల్‌)

సలహా: కారం, మసాలాలతో కూడిన ఘాటు పదార్థాలు తింటున్నప్పుడు ముక్కు కారటం మామూలే. దీనికి కారణం ట్రైజిమినల్‌ సెన్సరీ నాడీ ప్రేరేపితం కావటం. కొందరికి ఫుడ్‌ అలర్జీ మూలంగానూ ముక్కు కారొచ్ఛు కానీ మీరు భోజనం చేస్తున్న ప్రతిసారీ ముక్కు కారుతోందని చెబుతున్నారు. దీనికి సెనైల్‌ రైనోరియా కారణం కావొచ్చని అనిపిస్తోంది. ఇది వయసు మీద పడుతున్నకొద్దీ వచ్చే సమస్య. వీరిలో భోజనం చేస్తున్నప్పుడు ముక్కు నుంచి నీరు రావొచ్ఛు మీరు కారం, మసాలాలు ఎక్కువ తింటున్నారేమో చూసుకోండి. ఒకవేళ ఎక్కువగా తింటుంటే తగ్గించండి. మీరు ముక్కు కారుతోందని రాశారు గానీ ముక్కు దిబ్బడ, తుమ్ముల వంటి ఇతరత్రా లక్షణాలేవైనా ఉన్నాయా? మందులేవైనా వేసుకుంటున్నారా? అనేది తెలియజేయలేదు. అలర్జీలు, కొన్నిరకాల మందులతోనూ ముక్కు కారొచ్ఛు కాబట్టి మీరు ముందుగా ముక్కు, నోరు, గొంతు నిపుణులను సంప్రదించండి. అవసరమైన పరీక్షలు చేసి తగు మందులు ఇస్తారు. సెనైల్‌ రైనోరియాకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ముక్కులోకి పీల్చుకునే ఫ్లూటికసోన్‌ ఫ్యూరయేట్‌, మమెటసోన్‌ ఫ్యూరయేట్‌ వంటి కార్టికో స్టిరాయిడ్‌ నాసల్‌ స్ప్రేలు బాగా ఉపయోగపడతాయి. వీటిల్లో ఏదైనా ఒకటి వాడుకోవచ్ఛు భోజనం చేయటానికి గంట ముందు ఒక ముక్కులో రెండు మోతాదుల చొప్పున రోజుకు ఒకసారి కొట్టుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే లివో సిట్రిజిన్‌ 5 ఎంజీ లేదా ఫెక్సోఫెనెడిన్‌ మాత్రలను రోజుకు ఒకసారి వేసుకోవాల్సి ఉంటుంది. వీటితో ఉపశమనం కలుగుతుంది. ఏదేమైనా డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే మందులు వాడుకోవటం ఉత్తమం.

మీ సమస్యలను పంపాల్సిన చిరునామా: సమస్య-సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512 email: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని