పార్శ్వనొప్పికి దూరంగా..

పార్శ్వనొప్పి (మైగ్రేయిన్‌) బాధ అంతా ఇంతా కాదు. ఇందులో తలనొప్పి మాత్రమే కాదు.. వికారం, వాంతి, తల తిప్పటం

Published : 15 Sep 2020 01:36 IST

పార్శ్వనొప్పి (మైగ్రేయిన్‌) బాధ అంతా ఇంతా కాదు. ఇందులో తలనొప్పి మాత్రమే కాదు.. వికారం, వాంతి, తల తిప్పటం వంటివీ వేధిస్తాయి. వెలుతురు, వాసనలు పడకపోవటమూ ఇబ్బంది పెడుతుంది. పార్శ్వనొప్పిని అర్థం చేసుకొని, కొన్ని జాగ్రత్తలు పాటించటం ద్వారా కొంతవరకు నివారించుకోవచ్చు.

* జ్ఞానేంద్రియాలను ఉత్తేజితం చేసే పెద్ద పెద్ద చప్పుళ్లు, కళ్లు మిరుమిట్లు గొలిపే లైట్లు, ఘాటు వాసనల వంటివి పార్శ్వనొప్పిని ప్రేరేపిస్తుంటాయి. వీటిని తప్పించుకోవటం కష్టమే. కానీ ఆయా పరిస్థితులకు, పరిసరాలకు దూరంగా ఉండటం మేలు చేస్తుంది. రాత్రిపూట వాహనాలు నడపకపోవటం, సినిమా థియేటర్లకు, క్లబ్బులకు వెళ్లకపోవటం, సూర్యుడి వంక చూడకపోవటం వంటి జాగ్రత్తలు మేలు చేస్తాయి. టీవీ లేదా కంప్యూటర్‌ తెరలను తదేకంగా చూడకుండా మధ్య మధ్యలో పక్కలకు చూడటమూ మంచిదే. ఎలాంటి చప్పుళ్లు పార్శ్వనొప్పి లక్షణాలకు దారితీస్తున్నాయో గుర్తించి వాటికి దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి.


* చాక్లెట్లు, మాంస పదార్థాలు, మిఠాయిలు, ఛీజ్‌ వంటివీ కొన్నిసార్లు తలనొప్పికి దారితీయొచ్చు. కొందరికి మద్యంతోనూ తలనొప్పి బయలుదేరొచ్చు. ఇలాంటిది గుర్తిస్తే ఆయా పదార్థాలు తినకుండా చూసుకోవటం ముఖ్యం.


* ఎప్పుడెప్పుడు తలనొప్పి వస్తుందో తెలుసుకోగలిగితే పార్శ్వనొప్పి ప్రేరకాలను గుర్తించటానికి వీలుంటుంది. వీటికి దూరంగా ఉండటం తేలికవుతుంది. అందువల్ల ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం, వ్యాయామ వివరాలు, వాతావరణం, బలమైన ఆలోచనలు, భావోద్వేగాలు, వేసుకునే మందులు, తలనొప్పి ఎప్పుడెప్పుడు తీవ్రమవుతోంది అనే వివరాలను ఎప్పటికప్పుడు డైరీలో లేదా నోట్‌బుక్కులో రాసుకోవటం మంచిది.


* పార్శ్వనొప్పిలో హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. చాలామంది మహిళలు నెలసరికి ముందు, నెలసరి సమయంలో మరింత ఎక్కువగా పార్శ్వనొప్పి బారినపడుతుంటారు. ఇలాంటి సమయాల్లో ఇంకాస్త జాగ్రత్త అవసరం. గర్భనిరోధక మాత్రలు, హార్మోన్ల భర్తీ చికిత్సతోనూ మహిళల్లో పార్శ్వనొప్పి ప్రేరేపితం కావొచ్చు. వేరే రకం గర్భనిరోధక మాత్రలు వాడుకోవటమూ కొందరికి ఉపయోగపడుతుంది.


* కొందరికి మెగ్నీషియం లోపంతోనూ తలనొప్పి రావొచ్చు. ఇలాంటివారికి మెగ్నీషియం మాత్రలు మేలు చేస్తాయి.


* భోజనం మానెయ్యటంతోనూ పార్శ్వనొప్పి తలెత్తొచ్చు. నిద్రలేచిన గంటలోపు ఏదైనా తినటం, ప్రతి 3-4 గంటలకోసారి తక్కువ తక్కువగా తినటం అలవాటు చేసుకోవాలి. అలాగే తగినంత నీరు తాగాలి.


* ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి. ఇందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి పద్ధతులు ఉపయోగపడతాయి.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని