మందు మోతాదు తగ్గిస్తే మళ్లీ ఫిట్‌?

నాకు 52 ఏళ్లు. రెండేళ్ల క్రితం ఫిట్స్‌ వచ్చాయి. అప్పట్నుంచీ మందులు వాడుతున్నాను. ఫిట్స్‌ ఆగిపోయాయి....

Published : 27 Oct 2020 01:42 IST

సమస్య-సలహా

సమస్య: నాకు 52 ఏళ్లు. రెండేళ్ల క్రితం ఫిట్స్‌ వచ్చాయి. అప్పట్నుంచీ మందులు వాడుతున్నాను. ఫిట్స్‌ ఆగిపోయాయి. డాక్టర్‌ మందు మోతాదు తగ్గించారు. ఇటీవల మళ్లీ ఒకసారి ఫిట్‌ వచ్చింది. డాక్టర్‌ మళ్లీ మందు మోతాదు పెంచారు. ఇప్పుడు బాగానే ఉంది. ఈ మందులను ఎంతకాలం వాడుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

- వి.మాధవ్‌, హైదరాబాద్‌

సలహా: చిన్నప్పట్నుంచి లేకుండా పెద్దయ్యాక ఫిట్స్‌ మొదలవటానికి ఏదో ఒక కారణం ఉండొచ్చు. సోడియం మోతాదులు తగ్గినా, మెదడులో మచ్చలాంటిది ఏర్పడినా, పక్షవాతం వచ్చినా, కణితి లాంటిది ఏర్పడినా ఫిట్స్‌ రావొచ్చు. అందువల్ల మీరు ఫిట్స్‌ రావటానికి కారణమేంటన్నది పరీక్షించుకున్నారా? లేదా? అన్నది ముఖ్యం. సోడియం మోతాదులు తగ్గటం, గ్లూకోజు పడిపోవటం, పక్షవాతం వంటి ఉన్నట్టుండి తలెత్తే సమస్యలతో వచ్చే ఫిట్స్‌కు కొద్దిరోజుల పాటు మందులు వాడుకుంటే సరిపోతుంది. ఉద్ధృత దశ దాటిన తర్వాత ఫిట్స్‌ తిరిగి రాకపోవచ్చు. అదే మెదడులో మచ్చ, కణితి ఏర్పడటం వంటి శాశ్వత సమస్యలతో తలెత్తే ఫిట్స్‌కు దీర్ఘకాలం మందులు వాడుకోవాల్సి ఉంటుంది. మీరు రెండేళ్ల నుంచి మందులు వాడుతున్నారంటే డాక్టర్లు ఇప్పటికే కారణమేంటో విశ్లేషించి ఉంటారు. మందులు వేసుకుంటుంటే ఫిట్స్‌ అదుపులో ఉంటున్నాయంటే మెదడులో గడ్డలు, కణితుల వంటివేవీ లేవనే తోస్తోంది. మందుల మోతాదు తగ్గిస్తే ఫిట్స్‌ వస్తున్నాయంటే ఇంతకుముందు వాడుతున్న మోతాదు సరిపోతోందనే అర్థం. ఎంఆర్‌ఐ పరీక్షలో ఆపరేషన్‌ అవసరం లేదని, ఇతరత్రా కారణాలేవీ లేవని తేలితే మీరు వాడుతున్న మందులను జీవితాంతం వేసుకోవటం తప్పనిసరి. వేళకు భోజనం చేయటం, సమయానికి పడుకోవటం వంటి జాగ్రత్తలు పాటిస్తూ మందులు వేసుకుంటుంటే ఫిట్స్‌ మళ్లీ మళ్లీ రాకుండా చూసుకోవచ్చు.

చిరునామా  సమస్య - సలహా, సుఖీభవ

ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501512 

email: sukhi@eenadu.in


మరిన్ని కథనాలకు నేటి సుఖీభవ ఈ-పేపర్‌ను చూడండి..

https://epaper.eenadu.net/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని