Vaccine నవ్వుతూ తీసుకుంటే నొప్పి తగ్గు..

కొవిడ్‌ టీకా తీసుకుంటున్నారా? అయితే మనసారా నవ్వుతూ తీసుకోండి. సూది గుచ్చితే నొప్పి పుడుతుంది కదా. నవ్వుతూ టీకా ఎలా తీసుకుంటామని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది కిటుకు. నిజమైన నవ్వుతో..

Updated : 25 Apr 2021 11:39 IST

కొవిడ్‌ టీకా తీసుకుంటున్నారా? అయితే మనసారా నవ్వుతూ తీసుకోండి. సూది గుచ్చితే నొప్పి పుడుతుంది కదా. నవ్వుతూ టీకా ఎలా తీసుకుంటామని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది కిటుకు. నిజమైన నవ్వుతో.. అంటే పెదాలు పక్కలకు బాగా సాగి, బుగ్గలు ఉబ్బి, కళ్ల పక్కన గీతలు పడేంతలా మనసారా నవ్వితే సూది నొప్పి 40% వరకు తగ్గుతుందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు మరి. నవ్వు మూలంగా గుండె వేగం తగ్గుతుందని, ఇది సూది గుచ్చినప్పుడు తలెత్తే అసౌకర్యం తగ్గటానికి తోడ్పడుతుందని వివరిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే- చిట్లించినట్టుగా ముఖాన్ని గట్టిగా బిగపట్టటంతోనూ ఇలాంటి ప్రయోజనాలే కనిపించటం. సూది గుచ్చినప్పుడు చాలామంది ఇలాంటి హావభావాలే ప్రదర్శిస్తుంటారు కూడా. మనం సంతోషిస్తున్నా, బాధలో ఉన్నా ముఖంలో ఒకేరకం కవళికలు బయట పడుతుంటాయి. కంటి కండరాలు బిగుసుకుంటాయి. బుగ్గలు ఉబ్బుతాయి. పెదాలు పక్కలకు సాగుతాయి. పళ్లు బయటికి కనిపిస్తాయి. ఇలాంటి హావభావాలు అసౌకర్యం, ఒత్తిడి తగ్గటానికి తోడ్పడతాయన్నది పరిశోధకుల భావన. తెచ్చిపెట్టుకున్న నవ్వు, నిర్లిప్త ధోరణితో పోలిస్తే మనసారా నవ్వినవారిలోనూ.. కళ్లు, ముక్కు గట్టిగా బిగపట్టి ముఖం చిట్లించుకున్నవారిలోనూ సగం వరకు నొప్పి తగ్గటానికి ఇవే కారణం కావొచ్చని వివరిస్తున్నారు. కాబట్టే సూది నొప్పిని తగ్గించుకోవటానికిది తేలికైన, ఉచితమైన, అర్థవంతమైన సాధనం కాగలదని ఆశిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని