చర్మం బిగువు.. బీటలు

నా వయసు 24. నాకు చలికాలంలో చర్మం మరీ ఎక్కువగా పొడిబారుతుంది. స్నానం చేసేటప్పుడు పొట్టులా నలుగుతుంది. ఈ సమస్య చిన్నప్పట్నుంచీ ఉంది.

Updated : 16 Nov 2021 06:39 IST

సమస్య: నా వయసు 24. నాకు చలికాలంలో చర్మం మరీ ఎక్కువగా పొడిబారుతుంది. స్నానం చేసేటప్పుడు పొట్టులా నలుగుతుంది. ఈ సమస్య చిన్నప్పట్నుంచీ ఉంది. క్రమంగా తగ్గుతూ వస్తోంది. కాకపోతే చలికాలంలో చర్మం బిగుతుగా పట్టేస్తుంది. ఇది తగ్గేదెలా?

- ప్రసాద్‌ చుక్కల (ఈమెయిల్‌)

సలహా: చిన్నప్పట్నుంచి చర్మం పొడిబారటానికి, చలి కాలంలో బిగువుగా ఉండి బీటలు బారటానికి ఇక్తియోసిస్‌ అనే చర్మ వ్యాధి  (ఇక్తియోసిస్‌ వల్గారిస్‌ లేదా లామెల్లార్‌ ఇక్తియోసిస్‌) కారణం కావొచ్చు. ఇది వంశపారంపర్యంగా సంక్రమించే సమస్య. సాధారణంగా 25, 30 ఏళ్ల వయసు నుంచి క్రమేపీ తగ్గుతూ వస్తుంది. చలికాలంలో వాతావరణంలో తేమ తగ్గుతుంది. చలిగాలులకు శరీరంలోంచి నీరు బయటకు వెళ్లిపోతుంది. దీంతో చర్మం పొడిబారుతుంది. ఇక్తియోసిస్‌ గలవారికిది మరిన్ని చిక్కులు కలిగిస్తుంది. అందువల్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి చర్మం తేమగా ఉండటానికి తోడ్పడతాయి. అలాగే ఉదయం, సాయంత్రం చర్మానికి మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. మందులతో కూడిన మాయిశ్చరైజర్‌ క్రీములు ఏవైనా వాడుకోవచ్చు. ఇవి చర్మంలోంచి తేమ బయటకు వెళ్లిపోకుండా కాపాడతాయి. వీటిని క్రమం తప్పకుండా వాడుకుంటుంటే చర్మం పొడిబారటం, బీటలు పడటం తగ్గుతాయి. చాలావరకు వీటితోనే సమస్య అదుపులో ఉంటుంది. కావాలనుకుంటే పెట్రోలియం జెల్లీ లేదా వాజెలీన్‌ కూడా రాసుకోవచ్చు. రోజూ నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆలివ్‌ ఆయిల్‌, లిక్విడ్‌ పరాఫిన్‌ లాంటి ఎమ్మోలియెంట్లు ఒంటికి రాసుకొని.. బాగా మర్దన చేసుకొని, తర్వాత స్నానం చేస్తే మంచిది. దీంతో చర్మం మృదువుగా అవుతుంది. స్నానం చేసేటప్పుడు మాయిశ్చరైజర్‌తో కూడిన సబ్బులు వాడుకోవాలి. ఎక్కువ సేపు స్నానం చేయకూడదు. సబ్బు ఎక్కువగా వాడకూదు. వీలైనంత వరకు నూలు దుస్తులు ధరించాలి. కొందరికి ఐసోట్రెటినాయిన్‌ 20 ఎంజీ మాత్రలు ఉపయోగపడతాయి. వీటితో చర్మం పొడిబారటం తగ్గుతుంది గానీ దీర్ఘకాలం వేసుకోవటం తగదు. సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు రెండు, మూడు నెలల పాటు రోజుకు ఒకటి చొప్పున వేసుకోవచ్చు. దురద కూడా ఉన్నట్టయితే యాంటీ హిస్టమిన్‌ రకం మందులు మేలు చేస్తాయి. మీరు ఒకసారి చర్మ నిపుణులను సంప్రదించండి. సమస్యను నిర్ధరించి, మందులు సూచిస్తారు.
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని