Updated : 23/11/2021 06:32 IST

ఆస్ప్రిన్‌ గుడ్డిగా వద్దు

జబ్బులు వచ్చాక బాధపడే కన్నా రాకుండా చూసుకోవటమే ఉత్తమం. కాబట్టే నివారణ చర్యలకు అంత ప్రాధాన్యం. ఇందుకు మందులూ తోడ్పడతాయి. వీటిల్లో తక్కువ మోతాదు ఆస్ప్రిన్‌ ఒకటి. ఇది తొలిసారి పక్షవాతం, గుండెపోటు బారినపడకుండా కాపాడుతుందని చాలాకాలంగా భావిస్తూ వస్తున్నారు. అయితే మధ్యవయసు వారిలో దీన్ని గుడ్డిగా వాడటం తగదని ప్రముఖ వైద్య నిపుణుల బృందం ‘యూఎస్‌ ప్రివెంటివ్‌ సర్వీసెస్‌ టాస్క్‌ఫోర్స్‌’ తాజాగా సిఫారసు చేసింది. ఇదేమీ అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. రకరకాల అధ్యయనాలు, అనుభవాలను శాస్త్రీయంగా పరిశీలించి, సమీక్షించి చేసిన సిఫారసు. ఇలాంటి మార్పులు గతం నుంచీ వస్తున్నవే.

క్కువ మోతాదు ఆస్ప్రిన్‌ చాలాకాలంగా పెద్ద వరంగానే ఆదుకుంది. దీంతో గుండెజబ్బులు, పక్షవాతం ముప్పు తగ్గటం నిజమే. అయితే కొందరికి లోలోపల రక్తస్రావమయ్యే ముప్పు లేకపోలేదు. ఇలాంటి ముప్పు తక్కువే అయినా వయసుతో పాటు పెరుగుతూ వచ్చే అవకాశముంది. ఇప్పటికే గుండెపోటు, పక్షవాతం వచ్చినవారు మరోసారి వీటి బారినపడకుండా ఆస్ప్రిన్‌ బాగానే ఆదుకుంటుంది. దీని విషయంలో వైద్య నిపుణుల బృందం ఎలాంటి మార్పులు చేయలేదు. తొలిసారి గుండెపోటు, పక్షవాతం నివారణ విషయంలోనే కొత్త సిఫారసు చేసింది. అరవై ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు గలవారికి తొలిసారి గుండెపోటు, పక్షవాతం నివారణకు ఆస్ప్రిన్‌ వాడొద్దని గట్టిగా సూచించింది. అదే 40-59 ఏళ్ల వారైతే డాక్టర్‌ సలహా మేరకు లాభ నష్టాలు బేరీజు వేసుకొని  ఆరంభించాలని పేర్కొంది. ప్రజలు తమ గుండె ఆరోగ్యం గురించి డాక్టర్లతో చర్చించేలా తాజా సిఫారసు ప్రోత్సహించ గలదని టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు డాక్టర్‌ చీన్‌-వెన్‌ సెంగ్‌ అభిప్రాయపడుతున్నారు. ఆస్ప్రిన్‌ అనేది విటమిన్‌ మాత్ర వంటిది కాదనే విషయాన్ని ఇది స్పష్టంగా వెల్లడించి నట్టయ్యింది. ఆస్ప్రిన్‌తో లాభాలు ఉన్నాయి. అలాగని నష్టాలు లేకపోలేదు. కాబట్టి వయసు మీద పడిందని ఎవరికివారు ఆస్ప్రిన్‌ వేసుకోవటానికి బదులు డాక్టర్‌తో చర్చించి ఆరంభించటం మేలని నిపుణులు చెబుతున్నారు.

గతంలోనూ సిఫారసుల మార్పులు

వైద్య సిఫారసులు మార్చుకోవటం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి ఉదంతాలు చాలానే ఉన్నాయి.

* నెలసరి నిలిచాక ఇచ్చే హర్మోన్ల భర్తీ చికిత్సతో గుండెజబ్బుల ముప్పు తగ్గుతుందని ఒకప్పుడు సిఫారసు చేశారు. కానీ దీన్ని తీసుకుంటున్న మహిళల్లో గుండెపోటు కేసులు పెరిగినట్టు గుర్తించటంతో కొంతకాలం తర్వాత ఉపసంహరించుకున్నారు.

* మోకీళ్ల నొప్పిగలవారికి పాక్షికంగా దెబ్బతిన్న మెనిస్కస్‌ను తొలగించటం ఒకప్పటి రివాజు. అయితే దీంతో అంతగా ఉపయోగం లేదని ఫిన్‌లాండ్‌ శాస్త్రవేత్త ఒకరు గుర్తించటంతో పాటించటం మానేశారు. ఇప్పుడు దీనికి ఫిజియోథెరపీనే ప్రథమ చికిత్సగా సూచిస్తున్నారు.

* విటమిన్‌ మాత్రలు క్యాన్సర్లు, గుండెజబ్బుల ముప్పును తగ్గిస్తాయని డాక్టర్లు చాలా ఏళ్లుగా భావిస్తుండేవారు. కానీ అధ్యయనాల్లో దీనికి భిన్నమైన ఫలితాలే వెలువడ్డాయి. పొగ అలవాటు గల మగవారిలో బీటా కెరటిన్‌, విటమిన్‌ ఎ మాత్రలు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ముప్పును తగ్గించటం అటుంచి మరింత పెరిగేలా చేస్తున్నట్టు ఒక అధ్యయనంలో వెల్లడైంది. విటమిన్‌ ఇ, సెలీనియంతో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పు తగ్గకపోగా ఇంకాస్త ఎక్కువవుతున్నట్టు మరో అధ్యయనంలో తేలింది.

* గుండె రక్తనాళాల్లో పూడికలు గలవారికి ఇతరత్రా ఇబ్బందులేవీ లేకపోయినా ఒకప్పుడు ముందు జాగ్రత్తగా స్టెంట్‌ అమరుస్తుండేవారు. అయితే గుండెపోటు నివారణలో ఇది మందుల కన్నా గొప్పగా ఏమీ ప్రభావం చూపటం లేదని తర్వాత తేలటంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు.


Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని