కిడ్నీ వైఫల్యంతో స్త్రీల ఆయుష్షు క్షీణం

కిడ్నీ వైఫల్యం ఆయుష్షు మీద పెద్ద ప్రభావమే చూపిస్తుంది. ఇది మహిళలపై మరింత ఎక్కువ ప్రభావమే చూపిస్తున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ అధ్యయనం పేర్కొంటోంది. జబ్బులు, వీటి పర్యవసానాల విషయంలో మగవారు,

Updated : 23 Nov 2021 06:38 IST

కిడ్నీ వైఫల్యం ఆయుష్షు మీద పెద్ద ప్రభావమే చూపిస్తుంది. ఇది మహిళలపై మరింత ఎక్కువ ప్రభావమే చూపిస్తున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ సిడ్నీ అధ్యయనం పేర్కొంటోంది. జబ్బులు, వీటి పర్యవసానాల విషయంలో మగవారు, ఆడవారి మధ్య తేడాలు కొత్తేమీ కాదు. చాలాకాలం నుంచి చూస్తున్నదే. అయితే కిడ్నీ వైఫల్యం బారిన పడ్డవారిలో పురుషుల కన్నా ఆడవారు ఎక్కువ సంఖ్యలో చనిపోతుండటం ఆందోళనకరమైన విషయం. మగవారి కన్నా స్త్రీలు సగటున 3.6 సంవత్సరాల ముందే కన్ను మూస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. కిడ్నీ వైఫల్యం బారినపడ్డ మహిళలకు అన్ని కారణాలతో మరణించే ముప్పూ ఎక్కువగానే ఉంటోంది. సుమారు 30 ఏళ్ల పాటు 80వేలకు పైగా మంది ఆరోగ్య వివరాలను పరిశీలించి ఈ విషయాన్ని తేల్చారు. కిడ్నీ వైఫల్యం మొదలైన వయసు కూడా ఆయుష్షు మీద ప్రభావం చూపుతోంది. చిన్న వయసులో జబ్బు బారినపడ్డ మహిళలు మరింత ఎక్కువగా జీవనకాలాన్ని కోల్పోతున్నారు. ఉదాహరణకు- 15 ఏళ్ల వయసులో కిడ్నీ వైఫల్యం తలెత్తితే సగటున 33 ఏళ్ల ఆయుష్షు తగ్గుతోంది. అదే మగవారిలోనైతే 27 ఏళ్ల జీవనకాలం క్షీణిస్తోంది. శరీర నిర్మాణమో, మరే కారణమో గానీ మామూలుగా మగవారి కన్నా ఆడవారు ఎక్కువ కాలం జీవిస్తుంటారు. దీర్ఘకాల కిడ్నీ జబ్బు (సీకేడీ) మహిళల్లో ఎక్కువగా కనిపించినప్పటికీ మగవారిలోనే త్వరగా ముదిరి, కిడ్నీ వైఫల్యానికి దారితీస్తుంటుంది. కిడ్నీ వైఫల్యం సంభవిస్తున్నవారిలో మగవారి సంఖ్యే అధికం. కానీ జీవనకాలం విషయంలో మాత్రం కిడ్నీ వైఫల్యం ఆడవారికి చాలా నష్టం కలగజేస్తోంది. ఇందుకు శారీరక స్వభావం, ఇతరత్రా జబ్బులకు చికిత్స పొందటంలో వ్యత్యాసాల వంటి కారణాలెన్నో ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అందువల్ల ఈ తేడాలపై మరిన్ని పరిశోధనలు నిర్వహించి, అసలు విషయాన్ని తెలుసుకోవాలని సూచిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని