మెదడుకూ వ్యాయామ ‘బలం’!

వ్యాయామం అనగానే కండరాలు బలోపేతం కావటం, శరీర పటుత్వం ఇనుమడించటమే గుర్తుకొస్తుంది. దీని ప్రభావం ఒక్క కండరాలతోనే ఆగిపోయేది కాదు. మెదడుకూ ఎంతో మేలు చేస్తుంది. వ్యాయామం చేసినప్పుడు గుండె వేగం పెరుగుతుంది కదా.........

Published : 02 Dec 2020 09:42 IST

వ్యాయామం అనగానే కండరాలు బలోపేతం కావటం, శరీర పటుత్వం ఇనుమడించటమే గుర్తుకొస్తుంది. దీని ప్రభావం ఒక్క కండరాలతోనే ఆగిపోయేది కాదు. మెదడుకూ ఎంతో మేలు చేస్తుంది. వ్యాయామం చేసినప్పుడు గుండె వేగం పెరుగుతుంది కదా. దీంతో మెదడుకు మరింత ఎక్కువ రక్తం, ఆక్సిజన్‌ సరఫరా అవుతాయి. వ్యాయామంతో మెదడు కణాల ఎదుగుదలకు తోడ్పడే హార్మోన్లు విడుదలవుతాయి. మెదడు కణాల మధ్య కొత్త అనుసంధానాలు పుట్టుకొచ్చేలానూ ప్రేరేపిస్తుంది. ఇవన్నీ రకరకాల ప్రయోజనాలు చేకూరేలా చేస్తాయి.

1. కుదురైన ఏకాగ్రత

* చదువుల మీద, పనుల మీద ధ్యాస ఉండటం లేదా? అయితే వ్యాయామాల వైపు ఓ కన్నేయండి. దీంతో ఏకాగ్రత మెరగవుతుంది. తీవ్రంగా వ్యాయామాలు చేసేవారిలో ఏకాగ్రత సామర్థ్యాన్ని సూచించే ఐఏపీఎఫ్‌ (ఇండివిడ్యువల్‌ అల్ఫా పీక్‌ ఫ్రీక్వెన్సీ) పుంజుకుంటున్నట్టు అధ్యయనాలు పేర్కొంటుండటమే దీనికి నిదర్శనం. అయితే జాగింగ్, సైకిల్‌ తొక్కటం వంటి ఒకింత ‘నిలకడ స్థితి’ వ్యాయామాలతో పెద్దగా మార్పేమీ కనిపించకపోవటం గమనార్హం.

2. జ్ఞాపకశక్తి మెరుగు

* నడక, జాగింగ్, తోటపని వంటి ఏరోబిక్‌ వ్యాయామాలు (గుండె, శ్వాస వేగం పెరిగేలా చేసేవి) మెదడులోని హిప్పోక్యాంపస్‌ అనే భాగం వృద్ధి చెందేలా చేస్తాయి. మనం ఆయా విషయాలను నేర్చుకోవటం, జ్ఞాపకం పెట్టుకోవటం వంటివాటికి తోడ్పడేది హిప్పోక్యాంపసే. ఇది వయసుతో పాటు కుంచించుకుపోకుండానూ వ్యాయామం కాపాడుతుంది. అంటే వృద్ధాప్యంలో మతిమరుపు రాకుండానూ చూస్తుందన్నమాట. పనులను మరింత ఇష్టంగా చేసేవారిలో మెదడు కణాలు తిరిగి ఉత్తేజితం కావటం ఇంకాస్త ఎక్కువగా ఉంటున్నట్టూ కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇంకేం మనసుకు ఆనందాన్ని, ఉత్సాహాన్నిచ్చే పనులను, వ్యాయామాలను ఎంచుకోవటం మీద దృష్టి సారించండి.

3. కుంగుబాటు, ఆందోళన తగ్గుముఖం

* ఏరోబిక్‌ వ్యాయామాలు కుంగుబాటు (డిప్రెషన్‌), ఆందోళన (యాంగ్జయిటీ) లక్షణాలు తగ్గటానికీ తోడ్పడతాయి. అందుకే ఇలాంటి సమస్యలు గలవారికి డాక్టర్లు చికిత్సలో భాగంగా వ్యాయామాన్నీ సూచిస్తుంటారు. మెదడు కణాలు దెబ్బతినటాన్ని, విచ్ఛిన్నం కావటాన్ని వ్యాయామం నెమ్మదింపజేస్తుంది. దీని పూర్తి ప్రయోజనాలు పొందటానికి కొన్ని నెలలు పట్టొచ్చు. అందువల్ల వ్యాయామాన్ని ఒక అలవాటుగా మలచుకొని, కొనసాగించటం మంచిది.

4. కొత్త విషయాలు నేర్చుకునేలా..

* కొత్త విషయాలను నేర్చుకునేటప్పుడు మెదడు కూడా అందుకు అనుగుణంగా మార్పు చెందుతుంటుంది (న్యూరోప్లాస్టిసిటీ). వ్యాయామంతో ఇలాంటి సామర్థ్యం బాగా పుంజుకుంటుంది. సాధారణంగా పెద్దవాళ్ల కన్నా చిన్నవారిలో ఇది ఎక్కువ. కానీ ఒకే వయసువారిని తీసుకుంటే వ్యాయామం చేసేవారిలో కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఏరోబిక్, కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు ఏవైనా ఇందుకు తోడ్పడతాయన్నది శాస్త్రవేత్తల భావన.

5. డిమెన్షియా నుంచి రక్షణ

* వ్యాయామం చేయనివారికి అల్జీమర్స్‌ వంటి డిమెన్షియా రకం జబ్బుల ముప్పు ఎక్కువ. డిమెన్షియాతో ముడిపడిన ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, కుంగుబాటు వంటి సమస్యలను వ్యాయామం నివారిస్తుండటమే దీనికి కారణం. నిజానికి వ్యాయామం సైతం నేరుగానే ప్రభావం చూపుతుంది. వ్యాయామం చేసేవారిలో తెల్ల, బూడిద రంగు మెదడు పదార్థం మరింత ఎక్కువగానూ, దెబ్బతిన్న కణజాలం తక్కువగానూ ఉంటుంది. ఇవి మెదడు ఆరోగ్యంగా ఉందనటానికి సూచికలే. 

6. రక్త ప్రసరణ మెరుగు

* వ్యాయామంతో గుండెతో పాటు తలకు రక్తాన్ని తీసుకొచ్చే పెద్ద రక్తనాళం, మెదడులోని సూక్ష్మ రక్తనాళాలూ బలోపేతమవుతాయి. దీంతో మెదడుకు రక్తం బాగా అందుతుంది. ఫలితంగా మెదడు చక్కటి ఆరోగ్యంతో కళకళలాడుతుంది. మేధోశక్తి పుంజుకుంటుంది. అల్జీమర్స్‌కు కారణమయ్యే ప్రొటీన్‌ ముద్దలు పోగుపడటమూ నెమ్మదిస్తుంది.

7. నైపుణ్యం ఇనుమడిస్తుంది

* సమాచారాన్ని విశ్లేషించటం, అంచనా వేయటం, వర్గీకరించటం వంటి నైపుణ్యాలు వ్యాయామంతో ఇనుమడిస్తాయి. దీంతో కార్య నిర్వహణ మెరుగవుతుంది. కేవలం ఒక్కసారి వ్యాయామం చేసినా ఈ ఫలితం కనిపిస్తుంది. అదే దీర్ఘకాలం చేస్తే? మరింత ఎక్కువ ప్రయోజనమే చేకూరుతుంది. వ్యాయామం మూలంగా మెదడు కణాలు ఒకదాంతో మరోటి అనుసంధానమయ్యేలా మెదడులోని తెల్ల పదార్థం ఆకృతి మారిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

8. నిద్రకు దన్ను

* వ్యాయామంతో నిరాశా నిస్పృహలు తగ్గుతాయి. ఉల్లాసం, ఉత్సాహం పెంపొందుతాయి. ఇది రాత్రిపూట నిద్ర బాగా పట్టటానికీ తోడ్పడుతుంది. నిద్ర, మెలకువలను నియంత్రించే జీవగడియారం సరిగా పనిచేసేలా పురికొల్పుతుంది. కచ్చితమైన కారణమేంటో తెలియదు గానీ వ్యాయామం చేసేవారిలో మెదడు తరంగాలు నెమ్మదిగా సాగే నిద్ర దశ మరింత ఎక్కువకాలం కొనసాగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇదో రకమైన గాఢ నిద్ర. ఈ దశలోనే మెదడు, శరీరం పునరుత్తేజాన్ని సంతరించుకుంటాయి.

9. ఎంత వ్యాయామం అవసరం?

* రోజుకు కనీసం అరగంట చొప్పున వారానికి ఐదు రోజుల పాటు వ్యాయామం చేయాలన్నది ప్రామాణిక సిఫారసు. ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ ప్రయోజనం దక్కుతుంది. ఏదేమైనా 45-60 నిమిషాల సేపు చేస్తే వ్యాయామంతో మెదడుకు ఒనగూరే ప్రయోజనాలు ఎక్కువగా లభించేలా చూసుకోవచ్చని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే ఏవైనా జబ్బులతో బాధపడేవారు శరీర సామర్థ్యాన్ని బట్టి వ్యాయామాల తీవ్రత, సమయాన్ని నిర్ణయించుకోవటం మంచిది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని