తన బద్ధకమే తనకు శత్రువు!

ఓ నదీతీరంలో ఒక చెట్టు మీద ఉడత ఒకటి నివశించేది. ఆ చెట్టు కింద తొర్రలోనే కుందేలు ఉండేది. ఉడత ఆహారం సేకరించి.. కొంత తిని, మిగతాది చెట్టు కింద దాచేది. అయితే దాచిన విషయం తర్వాత మరిచిపోయేది. ఉడతకు మతిమరుపు ఉందన్న విషయం చెట్టు కింద ఉన్న కుందేలు పసిగట్టింది. అందుకే ఉడత మరిచిపోయిన ఆహారాన్ని కుందేలు ఎంచక్కా తినడం మొదలుపెట్టింది. ఉడత రోజూ అలానే ఆహారాన్ని దాచి పెట్టేది.

Published : 11 Nov 2021 01:08 IST

నదీతీరంలో ఒక చెట్టు మీద ఉడత ఒకటి నివశించేది. ఆ చెట్టు కింద తొర్రలోనే కుందేలు ఉండేది. ఉడత ఆహారం సేకరించి.. కొంత తిని, మిగతాది చెట్టు కింద దాచేది. అయితే దాచిన విషయం తర్వాత మరిచిపోయేది. ఉడతకు మతిమరుపు ఉందన్న విషయం చెట్టు కింద ఉన్న కుందేలు పసిగట్టింది. అందుకే ఉడత మరిచిపోయిన ఆహారాన్ని కుందేలు ఎంచక్కా తినడం మొదలుపెట్టింది. ఉడత రోజూ అలానే ఆహారాన్ని దాచి పెట్టేది. కుందేలు శ్రమ పడకుండా.. ఆహారాన్ని తింటూ సోమరితనాన్ని అలవాటు చేసుకొంది. బయటకు వెళ్లకుండా.. తినడం, పడుకోవడం దినచర్యగా మార్చుకుని సోమరిపోతుగా మారింది.

దే చెట్టు మీద నివశిస్తున్న రామచిలుక కుందేలు దినచర్యను గమనించేది. చూసి చూసి ఒకరోజు కుందేలుతో.. ‘నువ్వు చేస్తున్న పని ఏమీ బాలేదు. నీకు కావలసిన ఆహారాన్ని నువ్వు సంపాదించుకోకుండా, ఉడత దాచుకున్న ఆహారాన్ని తింటూ సోమరితనం అలవాటు చేసుకుంటున్నావు. ఇలాగే కొనసాగితే నువ్వు తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటావు’ అని చెప్పింది. అప్పుడు కుందేలు.. ‘నా సంగతి నాకు బాగా తెలుసు. నీ సంగతి నువ్వు చూసుకో.. నాకు హిత బోధ చేయడం మానుకో’ అని ఎద్దేవా చేసింది.

ఇలా రోజులు గడుస్తున్నాయి. కుందేలు తన నివాసం దాటి ఎక్కడికీ వెళ్లకుండా ఉండిపోయేది. ఇంతలో ఉడతకు ఒకరోజు ఆరోగ్యం పాడయింది. అది ఆహార సేకరణకు కూడా వెళ్లడం మానేసింది. దాంతో కుందేలుకు ఆ రోజు ఆహారం దొరకలేదు. బయటకు వెళ్లి సేకరించుకుందామా అంటే బద్ధకం. మరెలా అనుకుని ఉడత దగ్గరకు వెళ్లి ‘ఈ రోజు ఎక్కడికీ వెళ్లలేదా?’ అని అడిగింది. అందుకు ఉడత ‘లేదు! ఆరోగ్యం సరిగా లేదు, అందుకే ఎక్కడికీ వెళ్లలేదు’ అని బదులిచ్చింది. ‘సరే ఒక్కరోజేగా పర్లేదులే.. రేపు చూసుకుందాం’ అని మనసులో అనుకుంది కుందేలు.

రెండో రోజు కూడా ఉడతకు అనారోగ్యం అలానే ఉంది. ఉడత దాచే ఆహారం కోసం ఎదురు చూస్తున్న కుందేలుకు నిరాశే మిగిలింది. రెండు రోజులనుంచి ఆహారం లేక ఆకలితో నకనకలాడిపోయింది. అంతేకాక ఇన్ని రోజులు ఉడత దాచిన ఆహారం తినేందుకు అలవాటు పడటంతో ఆహార సేకరణ ఎలానో కూడా మర్చిపోయింది. అప్పుడు కుందేలుకు తన మేలు కోరి చెప్పిన రామచిలుక మాటలు గుర్తొచ్చాయి. మనసులో బాధపడింది. కుందేలు పరిస్థితిని గమనించిన రామచిలుకకు జాలేసింది. వెంటనే జామ పళ్లు కోసుకొచ్చి కుందేలుకు ఇచ్చింది. ‘చూశావా! నువ్వు ఉడత దాచిన ఆహారం మీద ఆధారపడ్డావు. దాంతో ఆహారం సేకరణ చేయడం కూడా మర్చిపోయావు. నీ సోమరితనం నీకు శత్రువైంది. ఈ రోజుకి ఈ జామ పళ్లతో ఆకలి తీర్చుకో.. ఇక మీదట అయినా ఇతరులు దాచిన ఆహారం మీద ఆధారపడకుండా, సొంతంగా ఆహారాన్ని సంపాదించుకో’ అంటూ హిత బోధ చేసింది. అందుకు కుందేలు కృతజ్ఞతాపూర్వకంగా రామచిలుకతో.. ‘ఆరోజు నీ మాటలు వినకుండా నిన్ను ఎద్దేవా చేశాను. అయినా అవేం పట్టించుకోకుండా నాకోసం జామపళ్లు తెచ్చావు. నన్ను క్షమించు. నాకు కనువిప్పు కలిగించావు. సోమరితనం ఎంత శాపమో నాకు బాగా తెలిసింది. ఇకపై అలా చేయను. నా ఆహారాన్ని నేనే సేకరించుకుంటాను’ అని అంది. ఇక ఆరోజు నుంచి కుందేలు తన సోమరితనాన్ని వీడి.. ఆహారాన్ని సేకరించుకుంటూ ఆనందంగా జీవించసాగింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని