చిలుకా కుశలమా!

రోజూ ఓ జామతోటలోకి ఒక చిలుక వచ్చేది. దాని పేరు కుశల. జామచెట్టు మీద వాలి దోర దోర పళ్లను హాయిగా తింటూ ఉండేది. అలా రోజూ జామ చెట్టు మీద వాలడం, చాలాసేపు అక్కడే కూర్చుని పళ్లను తినడాన్ని గమనించింది జంగు అనే ఒక పిల్లి.

Published : 12 Nov 2021 01:02 IST

రోజూ ఓ జామతోటలోకి ఒక చిలుక వచ్చేది. దాని పేరు కుశల. జామచెట్టు మీద వాలి దోర దోర పళ్లను హాయిగా తింటూ ఉండేది. అలా రోజూ జామ చెట్టు మీద వాలడం, చాలాసేపు అక్కడే కూర్చుని పళ్లను తినడాన్ని గమనించింది జంగు అనే ఒక పిల్లి.
బొద్దుగా, ముద్దుగా ఉన్న కుశలను చూడగానే జంగుకు నోట్లో నీళ్లూరాయి. ‘రోజూ దోర జామకాయల్ని తింటూ ఎంత అందంగా ఉంది ఈ చిలుక! ఈ పళ్లను తిన్న దీని మాంసం ఎంత రుచిగా ఉంటుందో కదా!’ అని ఆలోచిస్తూ చెట్టు కింద లొట్టలేసుకుంటూ కూర్చుంది జంగు.
తను నేరుగా కుశల దగ్గరకు వెళితే భయపడి ఎగిరిపోతుంది. తిరిగి ఈ దరిదాపులకు కూడా రాదు. తన కోరిక ఎప్పటికీ తీరదు. కాబట్టి రోజూ కొద్దికొద్దిగా మచ్చిక చేసుకోవాలి. నేర్పుగా నమ్మించి స్నేహం నటించి, అదను చూసి అమాంతంగా తినేయాలని జంగు ఒక పథకం వేసుకుంది.
ఒకరోజు కుశల దగ్గరకు వచ్చింది జంగు. ‘కుశలా! నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా! నీ రెక్కలు ఆకుపచ్చని రంగులో ఉండి, లేత జామాకుల్లో కలిసిపోయి.. భలేగా ఉన్నాయి. నీ ముక్కు జామపండు లోపల ఉండే గుజ్జు రంగు కంటే ఇంకా ఎర్రగా భలే చూడముచ్చటగా ఉంది. నీవంటి అందమైన స్నేహితురాలు నాకు దొరకడం నా అదృష్టం. నా మిత్రులు మనల్ని చూసి ఎంతగా కుళ్లుకుంటున్నారో తెలుసా’ అంది. ఇలా మాటలు చెబుతూ మెల్లిగా దగ్గరకు రాసాగింది. కుశల ముందు కాస్త సందేహించినా.. క్రమంగా జంగు పొగడ్తలకు పొంగిపోతోంది. దాని తియ్యటి మాటల్ని నమ్మి స్నేహం చేయసాగింది.
జామచెట్టు చెరో కొమ్మపై కూర్చుని ఇద్దరూ కబుర్లు చెప్పుకోవడం చూసిన తోటి చిలుకలు కుశలను హెచ్చరించాయి. ‘అవసరానికి మించి అతిగా పొడిగేవాళ్లను అసలు నమ్మకూడదు. జాగ్రత్తగా ఉండు’ అని చెప్పాయి.
అపాయం వచ్చినప్పుడు చూసుకుందాం. అయినా నాకు రెక్కలు ఉన్నాయి కాబట్టి ఎగిరిపోగలను. జంగు ఎగరలేదు కాబట్టి అంతగా ప్రమాదం లేదు. మీరేం కంగారు పడకండని తన మిత్రులకు సర్దిచెప్పింది కుశల.
‘అబ్బ! నీ ముక్కును ఎంతసేపు చూసినా తనివి తీరట్లేదు. నీ ముక్కుకు ఎర్రమందారం పూసినట్లు అంత ఎరుపురంగు ఎక్కడిది? ఒక్కసారి నన్ను ముట్టుకోనివ్వవా’ అని ఓ రోజు కుశలతో అంటూ దగ్గరకొచ్చింది జంగు. ఈ మాటలకు చాలా పొంగిపోయింది కుశల. అంతలోనే తనకు తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ‘ఎవరితో స్నేహమైనా.. ఎంతవరకు ఉండాలో.. అంత వరకే ఉండాలి. ఆ పరిధి దాటనిచ్చామంటే ఆ స్నేహమూ నిలవదు. మనకు అపాయమూ తప్పదు’ అని తల్లి తనతో చాలాసార్లు చెప్పేది. తన స్నేహితులు కూడా జంగు విషయంలో తనను చాలాసార్లు హెచ్చరించిన సంగతి గుర్తొచ్చి వెంటనే అప్రమత్తమైంది కుశల.
‘మనం ఎంత స్నేహితులమైనా నువ్వు అతి చనువు తీసుకోవడం నాకు నచ్చలేదు. అనవసరంగా నన్ను పొగడుతుంటే నువ్వు నానుంచి ఏదో ఆశిస్తున్నట్లుగా అనిపిస్తోంది. గోడ మీది పిల్లితో, చెట్టు మీద చిలుక స్నేహం చేయాలనుకున్నా అది కుదరదని అర్థమైంది. ఇక నా దగ్గరకు రాకు. నీ పని నువ్వు చూసుకో’ అంటున్న కుశలను గట్టిగా పట్టుకోబోయింది జంగు. చటుక్కున ఎగిరి చిటారు కొమ్మపై వాలింది కుశల. ‘నీ స్నేహం స్వచ్ఛమైంది కాదని నేను ముందే అనుమానించాను. అది ఇప్పుడు రుజువైంది. ఇక మన స్నేహం నేటితో రద్దు’ అంటూ జంగుకు చిక్కకుండా తుర్రున ఎగిరిపోయింది కుశల.

- గొర్తి వాణిశ్రీనివాస్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని