Updated : 13/11/2021 06:15 IST

టింకు పెట్టిన తిప్పలు!

టింకు ఒక అల్లరి పిల్లవాడు. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒకటి కావాలని పేచీ పెడుతూ ఉండేవాడు. టింకు.. లడ్డూలు అడిగాడు కదా అని వాళ్ల అమ్మ శ్రమపడి చేయబోతే... కాదు చెకోడీలు చేయమనేవాడు. తీరా చెకోడీలు చేశాక.. ఇవి కూడా వద్దు పకోడీలు తినాలని ఉందనేవాడు. అలా వాళ్ల అమ్మని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు.

వాళ్ల నాన్నతో బజారుకు వెళ్లినా అంతే! గుర్రం బొమ్మ కావాలని అడిగి.. దుకాణానికి వెళ్లాక ఏనుగు బొమ్మే గుర్రం కంటే బాగుందని, అదే కొనమని పేచీ పెట్టేవాడు. వాళ్ల నాన్న బొమ్మల వ్యాపారితో ఏనుగు బొమ్మ బేరం చేశాక టింకుకు ఆ దుకాణంలో బొమ్మల కంటే పక్క దుకాణంలోని బొమ్మలు ఇంకా బాగుంటాయేమో అనిపించేది. నాకిక్కడ బొమ్మలేమీ నచ్చలేదు అంటూ వెంటనే వాళ్ల నాన్నతో చెప్పేవాడు. బేరం చేశాక బొమ్మ కొనకుండా వద్దని చెప్పడంతో దుకాణ యజమాని దగ్గర టింకు వాళ్ల నాన్న అవమానపడాల్సి వచ్చేది. వేరే దుకాణంలో తనకు ఇష్టమైన బొమ్మ కొనిచ్చినా కూడా ఇంటికొచ్చాక ఆ బొమ్మ నచ్చలేదనేవాడు. ఇలా టింకు తనకు కావాల్సిన వాటిని ఎంచుకోవడంలో తికమక పడుతూ అమ్మానాన్నలను ఇబ్బంది పెట్టేవాడు. టింకును ఎలా సంతృప్తి పరచాలో తెలియక వాళ్ల అమ్మానాన్న తలలు పట్టుకునేవారు.

టింకు ఇప్పుడు అయిదో తరగతికి వచ్చాడు. అయినా టింకు ప్రవర్తనలో మార్పేమీ రాలేదు. రోజూ ఇంట్లో ఏదో ఒక దాని కోసం పేచీ మామూలే! వాళ్ల అమ్మ ఎందుకిలా చేస్తున్నావని టింకును అడిగితే.. ‘అమ్మా! నేను కావాలని పేచీ పెట్టను. నాకు ఈ నిమిషంలో ఒకటి నచ్చుతుంది. కాసేపు ఆగేసరికి మరోటి దీనికంటే బాగా ఉందనిపిస్తుంది. అందుకే అలా అడుగుతాను’ అంటాడు అమాయకంగా. టింకు అమాయకత్వానికి వాళ్ల అమ్మకు కూడా జాలి వేసేది. వయసు పెరిగే కొద్దీ వాడిలో మార్పు వస్తుందిలే అనుకుని ఊరుకునేది. ఒకసారి.. ఊరి నుంచి టింకు వాళ్ల మావయ్య వచ్చాడు. మావయ్య అంటే టింకుకు ఎంతో ఇష్టం. అదే సమయానికి వాళ్ల ఊళ్లో జాతర జరుగుతుండడంతో మావయ్యతో కలిసి టింకు జాతరకు వెళ్లాడు. రంగులరాట్నం చూసి టింకు ‘మావయ్యా! మనం రాట్నం ఎక్కుదామా’ అని అడిగాడు. ‘దాని కంటే బాగుండేవి ఇంకా చాలా ఉంటాయి. అన్నీ తిరిగి చూద్దాం పద’ అని చెప్పి మావయ్య టింకును ముందుకు తీసుకెళ్లిపోయాడు. కొంచెం ముందుకు వెళ్లాక రైలుబండి కనబడింది. మావయ్య అదైనా ఎక్కిస్తాడేమో అని ఆశగా చూసిన టింకుకు నిరాశే ఎదురైంది. అలా అన్నీ దాటుకుంటూ జాతర చివరికి వచ్చేసరికి టింకుకు కాళ్ల నొప్పులు మొదలయ్యాయి.

‘మావయ్యా! ఇంకా ఎంత సేపు? ఇదిగో ఈ మోటారుబండి అయినా ఎక్కించు’ అన్నాడు టింకు. ‘మోటారు బండి ఇంట్లోనే ఉంది కదరా! ఇక్కడ ఎందుకు? మొదట్లో చూసిన రంగులరాట్నమే బాగున్నట్టుంది. పద.. అదే ఎక్కుదాం’ అన్నాడు మావయ్య. ‘బాబోయ్‌! మళ్లీ అంత దూరం నేను నడవలేను. నాకిప్పుడే కాళ్ల నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఉన్న మోటారు బండి ఎక్కించేయి చాలు’ అన్నాడు. అదేంటి టింకూ! నీకది నచ్చింది కదా. నేను ఎత్తుకుని తీసుకువెళతాలే పద’ అని సగం దూరం ఎత్తుకుని మిగతా దూరం మెల్లిగా నడిపించాడు. ఎలాగూ రంగులరాట్నం ఎక్కబోతున్నానన్న సంతోషంలో, టింకు కాస్త హుషారుగానే నడిచేశాడు.

అక్కడ.. రాట్నం ఎక్కడానికి చాల ఎక్కువ మంది లైన్లో నిలబడి ఉన్నారు. ఒక అరగంట తర్వాత రంగులరాట్నంలో ఏదో సమస్య వచ్చి ఆగిపోయింది. మరమ్మతు చేయించి ఇంక రేపు నడుపుతామంటూ ఆట నిలిపివేశారు. అప్పటికే కాళ్ల నొప్పులతో, ఆకలితో బాధపడుతున్న టింకుకు కళ్లలో నీళ్లు వచ్చేశాయి. టింకు పరిస్థితి చూసిన మావయ్యకు చాలా జాలేసింది. తన జేబులో నుంచి బిస్కెట్లు తీసి టింకు చేతికి ఇవ్వగానే ఆకలితో ఉన్న టింకు వాటిని తిని కాస్త కుదుటపడ్డాడు. అప్పుడు మావయ్య ‘చూశావా! ఈ బిస్కెట్లు మీ నాన్నతో కొనిపించుకున్నాక.. నువ్వు నచ్చలేదని పక్కన పెట్టేసినవి. ఇప్పుడు ఆకలితో ఉన్న నీకు ఆ సంగతి గుర్తులేకుండా తినేశావు. ఆహారం విలువ ఆకలితో ఉన్నప్పుడే తెలుస్తుంది. ఆకలిగా ఉన్నా కడుపు నిండక ఎంతో మంది కష్టాలు పడుతుంటారు. అలాంటిది నువ్వు అడిగినవన్నీ అమ్మ చేసి పెడుతుంటే నచ్చలేదని చెప్పి వాటిని వృథా చేయడం ఎంత సబబో నువ్వే ఆలోచించుకో!

అలాగే ఎదురుగా ఉన్న రంగులరాట్నం కంటే మంచివి వెతుక్కోవడంలో మన సమయం, శ్రమ రెండూ వృథా అయిపోయాయి. నువ్వైతే ఏదో ఒకటి ఎక్కేస్తే చాలని మోటారు బండి ఎక్కేస్తా అన్నావు. మనం వద్దనుకున్న రంగులరాట్నం దగ్గరకు మళ్లీ కావాలని వెళ్లే సరికి ఎక్కే అవకాశం మనకు దొరకలేదు. అన్నింటిని ఆచితూచి ఎంచుకోవడం ఎంత ముఖ్యమో మన కళ్లముందున్న దాన్ని అందిపుచ్చుకోవడం కూడా అంతకన్నా ముఖ్యం. మనకేది కావాలో స్పష్టత ఉండాలి. ఒకసారి నిర్ణయించుకున్నాక దాని మీద నుంచి దృష్టి మరల్చకూడదు. అలాగే మనకు ఉన్న దాంతో సంతృప్తి పడటం నేర్చుకోవాలి. ఇక ఇంటికి వెళ్దాం పద’ అన్నాడు మావయ్య.

అంతా విన్న టింకు.. ‘మావయ్యా! నాకు ఇంటికి వెళ్లేటప్పుడు నీలం రంగు బుడగ ఒకటి కొనవా’ అని అడిగాడు. మావయ్య కొనిస్తే ఆనందంగా అందుకున్నాడు. ఇంటికెళ్లాక దాంతో చక్కగా ఆడుకున్నాడు.                 

- హారిక చెరుకుపల్లి


Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని