స్నేహం విలువ

ఒకానొక అడవిలో వృద్ధ సింహం, వృద్ధ కుందేలు చాలా స్నేహంగా ఉండేవి. అయితే రెండింటికీ వేటాడే శక్తి లేకపోవడంతో ఇతర జంతువులు దయదలచి ఏదైనా పెడితే, దాంతో కడుపు నింపుకునేవి. లేని రోజు పస్తులుండేవి.కుందేలు ఒక రోజు సింహం దగ్గరకెళ్లి, ‘సింహం మిత్రమా! కొన్ని రోజులుగా నీకు ఆహారం లేక, ఆకలితో బాధపడటం గమనించాను.

Published : 15 Nov 2021 00:50 IST

కానొక అడవిలో వృద్ధ సింహం, వృద్ధ కుందేలు చాలా స్నేహంగా ఉండేవి. అయితే రెండింటికీ వేటాడే శక్తి లేకపోవడంతో ఇతర జంతువులు దయదలచి ఏదైనా పెడితే, దాంతో కడుపు నింపుకునేవి. లేని రోజు పస్తులుండేవి.

కుందేలు ఒక రోజు సింహం దగ్గరకెళ్లి, ‘సింహం మిత్రమా! కొన్ని రోజులుగా నీకు ఆహారం లేక, ఆకలితో బాధపడటం గమనించాను. ఇప్పుడే నాకొక కుందేలు దోసకాయ ఇచ్చి వెళ్లింది. రా.. ఇద్దరం చెరి సగం తిందాము’ అంది. అప్పుడు వెంటనే సింహం ‘నా ప్రాణ స్నేహితుడివైన నువ్వు, నన్ను ఇలా అడగడం తప్పనిపించలేదా? సింహం ఆకలితో చావడానికైనా సిద్ధపడుతుంది కానీ, ఇలా సాధు జంతువుగా మారదు అని నీకు తెలియదా? ఇంకొకసారి ఇలా అడిగావంటే క్రూరంగా ప్రవర్తించవలసి వస్తుంది. ఇక్కణ్నుంచి వెళ్లు’ అని కోపంగా అంది. ‘నువ్వు ఆకలితో బాధపడటం చూడలేక అడిగాను’ అని బాధగా అంది కుందేలు.

ఇంతలో చెట్టు వెనుక పులి నిలబడి ఉండటం సింహం గమనించింది. వెంటనే తమాయించుకుని, మెల్లిగా.. ‘సరే గానీ కుందేలు మిత్రమా! నువ్వు ఇటువైపు వెళ్లి పారిపో.. అక్కడ చెట్టు వెనుక పులి ఉంది. మనం మళ్లీ కలుసుకొందాం’. సింహం అలా అనగానే కుందేలు దోసకాయను నోట కరుచుకొని లేని శక్తిని కూడదీసుకుని వేగంగా పారిపోయింది. అది చూసిన పులి కోపంగా సింహం ముందు నిలబడి ‘నేను కుందేలును చంపి తిందామని వచ్చాను. కానీ నువ్వు అంతా పాడు చేశావు. నువ్వు కుందేలుతో మాట్లాడటం కూడా విన్నాను. అంత ఆకలి ఉన్నవాడివి ఆ కుందేలును చంపి తినవచ్చుగా!’ అంది.

అప్పుడు సింహం ‘ కుందేలు నాకు ప్రాణస్నేహితుడు. కుందేలుకు ఎదురు ప్రాణం ఇస్తాను, కానీ ప్రాణం తీయను. అంతటి రాక్షసగుణం నాలో లేదు’ అంది. వెంటనే పులి.. ‘అంత ఆకలితో బాధపడేదానివి ఆ కుందేలు తెచ్చిన దోసకాయలో సగం తిని ఆకలి తీర్చుకోవచ్చుగా. సింహం సాధు జంతువుగా మారదు అంటూ ప్రగల్బాలు పలకడం ఎందుకు?’ అంది. ‘అదేం కాదు.. నాకు బాగా ఆకలిగా ఉంది. నాకు తినాలనిపించినా కావాలనే బలవంతంగా అలా చెప్పాను’ అంది సింహం. పులి ఆశ్చర్యంగా ‘ఎందుకు’ అని అడిగింది. అప్పుడు సింహం ‘కుందేలూ నాలాగే కొన్ని రోజులనుంచి ఆకలితో ఆహారం కోసం అలమటించిపోతుంది. ఒక కుందేలు దయవల్ల ఆ దోసకాయ లభించింది. ఇప్పుడు నేను తిననని కోప్పడితే గానీ ఆ దోసకాయను కుందేలు తినదు. అది తింటే కుందేలు కొంత అయినా తన ఆకలి తీర్చుకొంటుంది. అందుకే నేను తినను అన్నట్లు నటించాను’ అంది.  విషయం తెలుసుకున్న పులి.. ‘మీ ఇద్దరినీ చూస్తుంటే స్నేహం విలువేంటో అర్థమయ్యింది నాకు. సరే నేను నీకు ఏదైనా ఆహారం తీసుకొని వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు’ అంటూ అడవిలోకి వెళ్లింది.

- ఓట్ర ప్రకాష్‌ రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని