Published : 27/03/2021 02:45 IST

ఇంటిని ఇట్టే మార్చేస్తున్నారు

కొత్త వాటిని అమ్మేందుకు వెనకాడటం లేదు
ఆధునిక నివాసాల వైపు కొనుగోలుదారుల మొగ్గు
ఈనాడు, హైదరాబాద్‌

ముచ్చటపడి కొనుగోలు చేసిన కలల గూడు.రూపాయి రూపాయి కూడబెట్టి కట్టుకున్న పొదరిల్లు..ఇంతటి భావోద్వేగం పెనవేసుకున్న సొంతింటిని సైతం మూడు నాలుగేళ్లు తిరగకముందే అమ్మకానికి పెడుతున్నారు. స్మార్ట్‌ ఫోన్‌ మార్చేసినంత సులువుగా ఈ రోజుల్లో ఇళ్లను చాలామంది మార్చేస్తున్నారు. ఇంటిల్లిపాదికీ నచ్చే పరిసరాలు.. మెచ్చే సౌకర్యాలున్న మరో కొత్త ఇంటిని కొనుగోలు చేస్తున్నారు. ఎదిగే పిల్లల అవసరాలు. ఆహ్లాదకర పరిసరాలు. ప్రశాంతతను ఆస్వాదించేందుకు వీలుగా నచ్చిన చోట మరో ఇంటిని సొంతం చేసుకుంటున్నారు. గతంలో ఇంటితో బంధాన్ని దూరం చేసుకునేందుకు ఇష్టపడేవారు కాదు.. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా ప్రస్తుతం సాధారణ ఫ్లాట్స్‌ నుంచి ఖరీదైన విల్లాల వరకూ.. ఏదైనా ఇట్టే మార్చేందుకు సిద్ధపడుతున్నారు. తాము కోరుకునే ఇంటిని వెతుక్కుంటూ సాగుతున్నారు. ఫలితంగా నగరంలో కొంతకాలంగా ఇళ్ల క్రయ విక్రయాలు బాగా పుంజుకున్నాయి.
మనం మాట్లాడే స్మార్ట్‌ఫోన్లు, ఉపయోగించే వాహనాలను మార్కెట్లోకి కొత్త మోడల్‌ రాగానే మార్చేయడం చాలామందికి అలవాటు. గృహ నిర్మాణ మార్కెట్‌లోనూ ప్రస్తుతం ఇదే పోకడ నడుస్తోంది. ఇంటి ఆధునికీకరణకు(అప్‌గ్రేడేషన్‌) ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఫ్లాట్ల నుంచి వ్యక్తిగత ఇళ్లు, విల్లాలకు,  సాధారణ ఇళ్ల నుంచి గేటెడ్‌ కమ్యూనిటీలకు,  విలాసవంతమైన భవనాల్లోకి, ఆకాశ హర్మ్యాల్లోకి, హరిత భవనాల్లోకి మారిపోతున్నారు. ముచ్చటపడి కొన్న ఇల్లు, పరిసరాలు నచ్చపోయినా ఇదివరకు సర్దుకుపోయేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా.. వ్యక్తిగత అభిరుచులు.. కుటుంబ అవసరాలు.. సామాజిక గుర్తింపు.. ఇవన్నీ కూడా ఆధునిక ఇళ్ల వైపు మొగ్గేలా చేస్తున్నాయి.

గేటెడ్‌  కమ్యూనిటీల్లోకి..
మొదట్లో ఇల్లు ఉంటే చాలనుకునేవారు చాలామంది.. ఇప్పుడు గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు. ఆలోచన వచ్చిన వెంటనే అన్వేషణ మొదలెడుతున్నారు. కొత్త ఇల్లు కొని మూడు నాలుగేళ్లే అయినా అమ్మడానికి వెనకాడడం లేదు. అమ్మినా మంచి ధరే వస్తుండటంతో విక్రయించి గేటెడ్‌ కమ్యూనిటీల్లో విల్లానో, ఫ్లాటో తీసుకుంటున్నారు. ఇక్కడైతే సౌకర్యాలన్నీ ప్రాంగణం లోపలే ఉంటాయి. మరికొందరు నగరం మధ్యలో ఉండే గేటెడ్‌ కమ్యూనిటీల నుంచి శివార్లలో ప్రశాంతంగా ఉండే విల్లాల వైపు చూస్తున్నారు. ఇప్పటికే విల్లాలు ఉన్నవారు ఎకరం విస్తీర్ణంలోని విల్లాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు బంజారాహిల్స్‌లో నివాసం సామాజిక హోదా కావడంతో కొత్తగా కట్టే అపార్ట్‌మెంట్ల వైపు చూస్తున్నారు.  ఇక్కడ వ్యక్తిగత ఇళ్లలో ఉంటున్నవారు శివార్లలోని ఫామ్‌హౌస్‌లకు తరలుతున్నారు. అందరి అవసరాలకు తగ్గట్టుగా నగరంలో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. రూ.40 లక్షల నుంచి రూ.50 కోట్ల వరకు వీటి ధరలు పలుకుతున్నాయి.

స్మార్ట్‌గా నివసించాలని..
అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో ఇళ్లు సైతం స్మార్ట్‌గా మారిపోతున్నాయి. హోమ్‌ ఆటోమేషన్‌ తాజా పోకడగా ఉంది. పలువురు బిల్డర్లు ప్రస్తుతం స్మార్ట్‌ హోమ్స్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఇంటిని ఆటోమేషన్‌ చేయడం సాధ్యమే అయినా.. అన్ని హంగులతో ఉండే కొత్త ఇళ్లవైపు నవతరం మొగ్గు చూపుతోంది. భద్రత, వనరుల ఆదా దృష్ట్యా ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే యాప్స్‌, సెన్సర్లతో ఇంట్లో విద్యుత్తు దీపాలు, ఫ్యాన్లు, ఏసీలు, తలుపు తాళం సహా తీసే, వేసే విధంగా నియంత్రించే వ్యవస్థలను నేటితరం కోరుకుంటోంది. కొందరు ఇప్పుడున్న ఇళ్లను అమ్మేసి వీటి వైపు చూస్తున్నారు. విద్యుత్తు వాహనాలను రీఛార్జ్‌ చేసుకునేందుకు ఛార్జింగ్‌ పాయింట్లు ఉన్న కమ్యూనిటీల వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ తరహాలో ఎప్పటికప్పుడు గృహ నిర్మాణంలో మార్పులు వస్తున్నాయి. వీటిని అందిపుచ్చుకునేందుకు కొనుగోలుదారులు సదా సిద్ధంగా ఉంటున్నారు.

మరింత విశాలంగా..
కొవిడ్‌ తర్వాత చిన్న ఇళ్ల నుంచి విశాలమైన నివాసాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంటి నుంచే పనిచేస్తుండటం, ఆన్‌లైన్‌ క్లాసుల నేపథ్యంలో వీటికోసం ప్రత్యేక గది ఉండాలనుకుంటున్నారు. బిల్డర్లు ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని 2.5 నుంచి 3.5 పడకగదుల ఇళ్లను నిర్మిస్తున్నారు. ఉన్న విస్తీర్ణంలో రెండు పడక గదులతో పాటూ ప్రత్యేకంగా ఒక చిన్నగది (పడక గదిలో సగం) ఏర్పాటు ఉంటే వాటిని 2.5 పడక గదులుగా చెబుతున్నారు.


Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని