ఇంటికి జిప్సం ప్లాస్టరింగ్‌

ఇంటి నిర్మాణం తీరుతెన్నులు మారుతున్నాయి. లోపల గోడలకు సిమెంట్‌ ప్లాస్టరింగ్‌ స్థానంలో జిప్సం వినియోగిస్తున్నారు. కొత్త ప్రాజెక్టుల్లో ఎక్కువగా దీన్నే వాడుతున్నారు.

Published : 19 Dec 2020 01:44 IST

ఇసుకకు ప్రత్యామ్నాయంగా వినియోగం
ప్రాజెక్టుల్లో నిర్మాణదారుల కొత్త పోకడ  
ఈనాడు, హైదరాబాద్‌

ఇంటి నిర్మాణం తీరుతెన్నులు మారుతున్నాయి. లోపల గోడలకు సిమెంట్‌ ప్లాస్టరింగ్‌ స్థానంలో జిప్సం వినియోగిస్తున్నారు. కొత్త ప్రాజెక్టుల్లో ఎక్కువగా దీన్నే వాడుతున్నారు. నది ఇసుక కొరత కారణంగా జిస్సం వైపు మొగ్గుచూపుతున్నారు. గట్టిదనానికి ఢోకా ఉండదని, పగళ్లు రావని, సమయమూ కలిసి వస్తుందని నిర్మాణదారులు చెబుతున్నారు.
అపార్ట్‌మెంట్ల నిర్మాణంలో వ్యయమే కాదు సమయమూ ముఖ్యమే. ప్రాజెక్ట్‌ ఆలస్యమయ్యేకొద్దీ వ్యయం పెరుగుతుంది. స్తంభాలు, శ్లాబుల పనులు పూర్తయినా గోడల నిర్మాణం, ప్లాస్టరింగ్‌, క్యూరింగ్‌కు చాలా సమయం పడుతుంది. ఈ ఆలస్యం నివారించేందుకు మొదట గోడలను సైతం కాంక్రీట్‌తో(మెవాన్‌ టెక్నాలజీ) నిర్మించడం మొదలెట్టారు. ఆకాశహార్మ్యాల ప్రాజెక్టుల్లో చాలాకాలంగా ఈ సాంకేతికతతోనే చేపడుతున్నారు. భారీ నిర్మాణాల్లో మట్టి ఇటుకల స్థానంలో సిమెంట్‌వి వాడుతున్నారు. ఇంటర్‌లాకింగ్‌ ఇటుకలతో ఖర్చు, సమయం ఆదా అవుతోంది. ఇలాగే మరో ప్రయోగానికి నిర్మాణదారులు తెరతీశారు.
ఎందుకు ఇటువైపు?
ప్రస్తుతం జిప్సం బోర్డులను ఫాల్స్‌ సీలింగ్‌ కోసం ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో మరో రకమే మినరల్‌ జిప్సం. సన్నని పొడి మాదిరి 74 మైక్రాన్ల పరిమాణంలో ఉంటుంది.  ఇంటిలోపలి గోడలకు ఇసుకతో చేసే ప్లాస్టరింగ్‌ స్థానంలో దీన్ని ఉపయోగిస్తున్నారు. నది ఇసుక కొరతతో రోబో ఇసుక వినియోగం పెరిగింది. ఇసుక, సిమెంట్‌ సమపాళ్లలో వాడకపోవడం, వీటిలో నాణ్యత లోపించడం, సరిగా క్యూరింగ్‌ చేయకపోవడంతో గోడలకు పగుళ్లు ఎక్కువగా వస్తున్నాయి. జిప్సంతో ఈ సమస్యలకు అడ్డుకట్ట వేయవచ్చంటున్నారు.

ఇవీ ప్రయోజనాలు

* సిమెంట్‌ ప్లాస్టరింగ్‌కు 15 రోజులు పడితే జిప్సంతో వారం రోజుల్లోనే చేయొచ్చు.
*
జిప్సంతో చేస్తే క్యూరింగ్‌ అవసరం లేదు.
* సిమెంట్‌తో ఎక్కువ మందం చేయలేం. పగుళ్లు వస్తాయి. పైగా రెండుసార్లు చేయాల్సి ఉంటుంది. మొదట దొడ్డు ఇసుకతో దుబారా చేస్తారు. ఆ తర్వాత సన్న ఇసుకతో చేస్తారు. జిప్సంతో ఒకేసారి ప్లాస్టరింగ్‌ చేసుకోవచ్చు.  
* సిమెంట్‌ ఇటుకలకైతే 8-12 ఎంఎం మందం, మట్టి ఇటుకలకు 12-15 ఎంఎం మందం వరకు చేసుకోవచ్చు.
* 25 కిలోల బస్తాల 20 చదరపు అడుగులకు సరిపోతుంది.
* ఉష్ణోగ్రతలను నిరోధిస్తుంది కాబట్టి బయటి కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువే ఉంటుంది.
* ఇంటిలోపల చూడటానికి చాలా విశాలంగా, అందంగా కన్పిస్తుంది.

పగుళ్లు రావు: పి.కౌండిన్య, డైరెక్టర్‌, ఎన్‌కేవీ జిప్సం

పాత రోజుల్లో గోడలకు సున్నం ఉపయోగించేవారు. చెక్కు చెదరకుండా ఉండేవి. బ్రిటీషర్ల రాకతో ఇసుకకు మారింది. మనదేశంలో నదుల ఇసుక విరివిగా లభిస్తుండటంతో 1ః4 నిష్పత్తిలో ఇసుక, సిమెంట్‌ వాడకంతో నిర్మాణాలు చేపట్టడం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల జిప్సంనే ప్లాస్టరింగ్‌కు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మనకు నాణ్యమైన నది ఇసుక కొరత ఏర్పడటంతో దీని వైపు చూస్తున్నారు. కాల్షియం సల్ఫేటే ఈ జిప్సమ్‌. రాజస్థాన్‌లో గనులున్నా నాణ్యమైనవి లేవు. ఎక్కువగా ఇరాన్‌, ఒమన్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. సిమెంట్‌ ప్లాస్టరింగ్‌ మాదిరే గట్టిదనం ఎక్కువే. ఇటుకలకు ఒకసారి పడితే వదలదు. ఊడిపోవడం, పగళ్లు రావు. నగరంలో ప్రస్తుతం కొన్ని సంస్థలు గృహ, వాణిజ్య నిర్మాణాల్లో జిప్సంనే ప్లాస్టరింగ్‌కు ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం బిహార్‌, ఒడిశా కార్మికులు ఈ పని చేస్తున్నారు.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని