వేడిగా... చపాతీకి తోడుగా!

బాణలిలో రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి కాగాక కాలీఫ్లవర్‌ ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి. తరవాత బంగాళాదుంప ముక్కలు కూడా వేసి రెండూ కలిపి

Published : 27 Jun 2021 19:26 IST

ఆలూ కాలీఫ్లవర్‌

కావలసినవి 
బంగాళాదుంపలు: అరకిలో, కాలీఫ్లవర్‌: ఒకటి (చిన్నది), జీలకర్ర: టేబుల్‌స్పూను, దనియాలు: 2 టీస్పూన్లు, ఉల్లి విత్తనాలు: 2 టీస్పూన్లు, దాల్చినచెక్క పొడి: టీస్పూను, పసుపు: టీస్పూను, కారం: టీస్పూను, నూనె: 4 టేబుల్‌స్పూన్లు, కరివేపాకు: నాలుగు రెబ్బలు, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, టొమాటోలు: నాలుగు, పంచదార: టీస్పూను, నిమ్మకాయ: ఒకటి, కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను 
తయారుచేసే విధానం 

 బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి ముక్కలుగా చేయాలి.  
కాలీఫ్లవర్‌ను రెమ్మలుగా విడదీసి మరిగించిన నీళ్లలో వేసి ఓ ఐదు నిమిషాలు ఉంచి తీయాలి. 
 బాణలిలో రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి కాగాక కాలీఫ్లవర్‌ ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి. తరవాత బంగాళాదుంప ముక్కలు కూడా వేసి రెండూ కలిపి వేగనివ్వాలి. 
 పచ్చిమిర్చి, టొమాటోలు ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. 
 దనియాలు, ఉల్లి విత్తనాలు, జీలకర్ర కొద్దిగా వేయించి తీయాలి. తరవాత వీటిని మిక్సీలో వేసి పొడిలా చేయాలి. 
 నాన్‌స్టిక్‌ పాన్‌ తీసుకుని, నూనె వేసి కాగాక కరివేపాకు, సన్నగా కోసిన వెల్లుల్లి వేసి వేయించాలి. టొమాటో, పచ్చిమిర్చి గుజ్జు వేసి అవసరమైతే కొద్దిగా నీళ్లు చిలకరించి సిమ్‌లో దగ్గరగా అయ్యేవరకూ ఉడికించాలి. ఇప్పుడు అందులో వేయించిన బంగాళాదుంప, కాలీఫ్లవర్‌ ముక్కలు వేసి, దనియాలు, జీలకర్ర మిశ్రమం, దాల్చినచెక్కపొడి వేసి సిమ్‌లో ఐదు నిమిషాలు ఉడికించి, చివరగా కొత్తిమీర తురుము చల్లి నిమ్మరసం పిండి దించాలి.


మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కర్రీ

కావలసినవి 
చిలగడదుంపలు: రెండు, టొమాటోలు: రెండు, క్యారెట్లు: రెండు, కాలీఫ్లవర్‌: ఒకటి(చిన్నది), తెల్ల సెనగలు: పావుకప్పు(ఇష్టమైతేనే), ఉల్లిపాయ: ఒకటి, కొబ్బరి పాలు: కప్పు, టొమాటో గుజ్జు: కప్పు, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు(పేస్టులా చేయాలి), అల్లం: రెండు అంగుళాలముక్క(సన్నగా తురమాలి), దనియాలపొడి: టేబుల్‌స్పూను, జీలకర్రపొడి: ఒకటిన్నర టీస్పూన్లు, కారం: టీస్పూను, మిరియాలపొడి: టీస్పూను, దాల్చినచెక్క: అంగుళం ముక్క, ఉప్పు: తగినంత, నిమ్మరసం: 2 టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, నూనె: 2 టేబుల్‌స్పూన్లు 
తయారుచేసే విధానం 

 సెనగలు నానబెట్టాలి. 
 చిలగడదుంపలు, టొమాటోలు, క్యారెట్లు, కాలీఫ్లవర్‌ ముక్కలు, నానబెట్టిన సెనగలు ప్రెషర్‌ కుక్కర్‌లో లేదా మందపాటి గిన్నెలో వేసి ఉడికించి దించాలి. 
 నాన్‌స్టిక్‌పాన్‌లో నూనె వేసి కాగాక ఉల్లిముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు అల్లం తురుము, వెల్లుల్లి ముద్ద వేసి వేగాక టొమాటో గుజ్జు వేసి నూనె బయటకు వచ్చేవరకూ ఉడికించాలి. దనియాలపొడి, జీలకర్రపొడి, కారం, మిరియాలపొడి, దాల్చినచెక్క వేసి ఓ నిమిషం వేగనిచ్చి ఉడికించిన కూరగాయల ముక్కలు, ఉప్పు వేసి సిమ్‌లో ఉడికించాలి. గ్రేవీ ముక్కలకు పట్టాక చివరగా నిమ్మరసం, కొత్తిమీర తురుమూ చల్లి ఉప్పు సరిచూసి దించాలి.


కడై మష్రూమ్‌ మసాలా

కావలసినవి 
పుట్టగొడుగులు: 200గ్రా., క్యాప్సికమ్‌ ముక్కలు: కప్పు, టొమాటో ముక్కలు: రెండున్నర కప్పులు, ఉల్లిముక్కలు: కప్పు, వెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, గరంమసాలా: టీస్పూను, కసూరిమెంతి: టీస్పూను, మీగడ: 2 టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర తురుము: కొద్దిగా, దనియాలు: టేబుల్‌స్పూను, ఎండుమిర్చి: నాలుగు, నూనె: 2 టేబుల్‌స్పూన్లు 
తయారుచేసే విధానం 

 బాణలిలో దనియాలు, ఎండుమిర్చి వేసి వేయించి తీసి చల్లారాక పొడి చేయాలి. 
 నాన్‌స్టిక్‌ పాన్‌లో నూనె వేసి కాగాక  ఉల్లిముక్కలు వేసి వేయించాలి.  
తరవాత వెల్లుల్లిముద్ద కూడా వేసి వేగాక దనియాలు, ఎండుమిర్చి పొడి వేసి ఓ నిమిషం వేయించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, ఉప్పు వేసి ఉడికించాలి. అవి మెత్తగా ఉడికిన తరవాత క్యాప్సికమ్‌ ముక్కలు, పుట్టగొడుగుల ముక్కలు వేసి ఉడికించాలి. పుట్టగొడుగుల్లోని నీళ్లన్నీ ఆవిరైపోయి అవి బాగా ఉడికిన తరవాత గరంమసాలా, కసూరిమెంతి వేసి కలపాలి. చివరగా కొత్తిమీర తురుము, మీగడ వేసి దించాలి.


గోరుచిక్కుడు సబ్జి

 

కావలసినవి 
గోరుచిక్కుళ్లు: పావుకిలో, ఆవాలు: టీస్పూను, జీలకర్ర: అరటీస్పూను, కరివేపాకు: నాలుగు రెబ్బలు, గరంమసాలా: పావుటీస్పూను, పసుపు: అరటీస్పూను, కారం: టీస్పూను, ఉల్లిముక్కలు: కప్పు, పచ్చిమిర్చి: రెండు, బెల్లంపొడి: అరకప్పు, కొబ్బరి తురుము: టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత, నూనె: 3 టీస్పూన్లు 
తయారుచేసే విధానం 

 గోరుచిక్కుడు కాయలు ఈనెలు తీసి, ముక్కలుగా కోసి కాస్త ఉప్పు వేసి ఉడికించి తీయాలి. 
 బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. తరవాత ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక ఉడికించిన గోరుచిక్కుడు ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు, గరంమసాలా, బెల్లంతురుము వేసి మగ్గనివ్వాలి. చివరగా కొబ్బరి తురుము వేసి ఓ నిమిషం ఉంచి దించాలి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని