కొత్తిమీరతో కొత్త రుచులు!

కొత్తిమీర కనిపిస్తే చట్నీ చేస్తాం. లేదంటే రుచికోసమో సువాసనకోసమో కూరల్లోనో, సాంబారు, రసాల్లోనో వేస్తుంటాం. కానీ కొత్తిమీరతోనూ కొన్ని రకాల వంటలు చేసుకోవచ్చు. అవేమంటే...

Published : 27 Jun 2021 19:33 IST

కొత్తిమీర కనిపిస్తే చట్నీ చేస్తాం. లేదంటే రుచికోసమో సువాసనకోసమో కూరల్లోనో, సాంబారు, రసాల్లోనో వేస్తుంటాం. కానీ కొత్తిమీరతోనూ కొన్ని రకాల వంటలు చేసుకోవచ్చు. అవేమంటే...

కొత్తిమీర-టొమాటో పచ్చడి

కావలసినవి 
కొత్తిమీర తురుము: 2 కప్పులు, 
టొమాటోలు: రెండు (చిన్నవి), పచ్చిమిర్చి: నాలుగు, ఎండుమిర్చి: రెండు, వెల్లుల్లి: రెండు, జీలకర్ర: టీస్పూను, చింతపండు: కొద్దిగా, ఉప్పు: తగినంత, నూనె: 2 టేబుల్‌స్పూన్లు, పోపుకోసం: ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు: కొద్దికొద్దిగా 
తయారుచేసే విధానం 
* బాణలిలో టేబుల్‌స్పూను నూనె వేసి కాగాక ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేయించి తీయాలి. 
* తరవాత పచ్చిమిర్చి కూడా వేయించి తీసి, అందులోనే 
తరిగిన కొత్తిమీర, టొమాటో వేసి మగ్గనివ్వాలి. తరవాత నీరంతా ఆవిరైపోయేవరకూ వేయించి తీయాలి. చల్లారాక ఎండుమిర్చి, 
పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, కొత్తిమీర, టొమాటో, 
చింతపండు అన్నీ కలిపి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి, మిగిలిన నూనెతో పోపు వేస్తే సరి.

కొత్తిమీర కట్లెట్‌

కావలసినవి 
సెనగపిండి: 2 కప్పులు, కొత్తిమీర తురుము: 2 కప్పులు, మంచినీళ్లు: ఒకటిన్నర కప్పులు, పసుపు: టీస్పూను, 
బియ్యప్పిండి: టేబుల్‌స్పూను, జీలకర్ర: 2 టీస్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు: ఎనిమిది, అల్లం తురుము: టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి: ఎనిమిది, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా 
తయారుచేసే విధానం 
* కొత్తిమీర కడిగి శుభ్రంగా తరగాలి. 
* అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి మెత్తగా రుబ్బాలి. 
* ఓ గిన్నెలో సెనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు వేసి మంచినీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలపాలి. 
* బాణలిలో నూనె వేసి కాగాక జీలకర్ర, పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. అందులోనే కొత్తిమీర తురుము కూడా వేసి ఓ నిమిషం వేయించాలి. తరవాత సెనగపిండి మిశ్రమం వేసి బాగా కలిపి దగ్గరగా అయ్యేవరకూ ఉడికించి స్టవ్‌ ఆఫ్‌ చేయాలి.
* ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేటులో మిశ్రమాన్ని వేసి అట్లకాడతో సమంగా సర్ది, ఆరాక ముక్కలుగా కోసి, పెనంమీద నూనె వేస్తూ రెండువైపులా కాల్చి తీసి ఏదైనా చట్నీతో 
వడ్డించాలి.

కొత్తిమీర పన్నీర్‌

కావలసినవి 
పన్నీర్‌: 100గ్రా., కార్న్‌ఫ్లోర్‌: టేబుల్‌స్పూను, నూనె: 4 టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర తురుము: 2 కప్పులు, సోయాసాస్‌: 
అరటేబుల్‌స్పూను, మైదా: 3 టేబుల్‌స్పూన్లు, మిరియాలపొడి: టీస్పూను, ఉప్పు: అరటీస్పూను, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, 
ఉల్లిపాయ: ఒకటి, నిమ్మరసం: టీస్పూను 
తయారుచేసే విధానం 
* మైదా, కార్న్‌ఫ్లోర్‌, ఉప్పు, మిరియాలపొడి వేసి కలపాలి. తరవాత తగినన్ని నీళ్లు పోసి పకోడీ పిండిలా కలపాలి. పన్నీర్‌ను ముక్కల్లా కోసి పిండిలో ముంచి కాగిన నూనెలో మీడియం మంటమీద వేయించి తీయాలి. 
* ఉల్లి, వెల్లుల్లి, పచ్చిమిర్చి సన్నగా తరగాలి. తరవాత వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర చేర్చి మెత్తగా రుబ్బి తీశాక, అందులోనే నిమ్మరసం కూడా కలపాలి. 
* పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఉల్లిముక్కలు వేసి వేగాక, రుబ్బిన కొత్తిమీర ముద్ద వేసి ఓ నిమిషం వేయించాలి. 
తరవాత సోయా సాస్‌ కూడా వేసి కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి కొత్తిమీర పచ్చివాసన పోయేవరకూ మరిగించాలి. తరవాత వేయించిన పన్నీర్‌ ముక్కలు వేసి కలుపుతూ గ్రేవీ చిక్కగా 
అయ్యేవరకూ ఉడికించి దించాలి.

కొత్తిమీర ఉప్మా

కావలసినవి 
బొంబాయిరవ్వ: పావుకిలో, నూనె: 3 టేబుల్‌స్పూన్లు, మినప్పప్పు: 2 టీస్పూన్లు, ఆవాలు: టీస్పూను, 
కరివేపాకు: 4 రెబ్బలు, ఉల్లిపాయలు: రెండు, ఉప్పు: రుచికి సరిపడా, కొత్తిమీర తురుము: 2 కప్పులు, పచ్చిమిర్చి: నాలుగు, జీలకర్ర: టీస్పూను, నిమ్మరసం: టీస్పూను 
తయారుచేసే విధానం 
* నాన్‌స్టిక్‌ పాన్‌లో రవ్వ వేసి నాలుగైదు నిమిషాలు వేయించి తీయాలి. 
* కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి నిమ్మరసం పిండి పక్కన ఉంచాలి. 
* బాణలిలో నూనె వేసి మినప్పప్పు, ఆవాలు వేసి వేగాక కరివేపాకు కూడా వేసి వేయించాలి. తరవాత సన్నగా పొడవుగా కోసిన ఉల్లిముక్కలు వేసి వేగాక అందులో రుబ్బిన కొత్తిమీర మిశ్రమం వేసి కలుపుతూ ఓ రెండు నిమిషాలు వేయించాలి. 
* ఇప్పుడు సుమారు ముప్పావులీటరు వేడి నీళ్లు పోసి, ఉప్పు వేసి మరిగించాలి. 
*తరవాత రవ్వ వేసి మీడియం మంటమీద కలుపుతూ నీళ్లన్నీ ఆవిరై రవ్వ ఉడికే వరకూఉంచి దించితే కొత్తిమీర ఉప్మా రెడీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని