దివ్వీదివ్వీ దివ్విట్టం.. ఊరించే మిఠాయి పొట్లం!

దీపావళి అనగానే ఊరించే మిఠాయిలే గుర్తుకొస్తాయి కదా! మన¸మే కాదు... ఇరుగూ పొరుగూ రాష్ట్రాల వాళ్లు కూడా ఈ దీపాల పండగకి ఓ మిఠాయిని ప్రత్యేకంగా చేసుకుని తింటారు. అవే ఇవి..

Updated : 31 Oct 2021 04:16 IST

దీపావళి అనగానే ఊరించే మిఠాయిలే గుర్తుకొస్తాయి కదా! మన¸మే కాదు... ఇరుగూ పొరుగూ రాష్ట్రాల వాళ్లు కూడా ఈ దీపాల పండగకి ఓ మిఠాయిని ప్రత్యేకంగా చేసుకుని తింటారు. అవే ఇవి..


కశ్మీరీ... షుఫ్తా

కావాల్సినవి: బాదం పప్పులు, వాల్‌నట్స్‌, కొబ్బరి, పిస్తాలు, జీడి పప్పులు, నెయ్యి... ఇవన్నీ పావుకప్పు చొప్పున, మిరియాల పొడి, శొంఠి / అల్లంపొడి... ఈ రెండూ చిన్న చెంచా చొప్పున, కుంకుమ పువ్వు- చిటికెడు, ఎండు ఖర్జూరాలు- ఐదు, కాటేజ్‌ చీజ్‌- పావుకప్పు, పంచదార- రెండుకప్పులు, యాలకులపొడి- చిన్న చెంచాలో సగం, దాల్చిన చెక్క పొడి- పావుచెంచా, ఎండిన గులాబీ రేకులు- రెండు చెంచాలు.

తయారీ: ఒక పాత్ర తీసుకొని దానిని గోరువెచ్చని నీళ్లతో నింపాలి. ఈ నీళ్లలో అరగంటపాటు డ్రైనట్స్‌ని నానబెట్టుకోవాలి. ఖర్జూరాలని విడిగా వేరే పాత్రలో అరగంట నానబెట్టుకుని చిన్నముక్కలుగా తరగాలి. స్టౌ మీద పాన్‌ పెట్టుకుని అందులో... కొద్దిగా నెయ్యి వేసుకుని చీజ్‌, కొబ్బరిని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు పాన్‌లో మరికాస్త నెయ్యి వేసుకుని అందులో ముందుగా నానబెట్టుకున్న డ్రైనట్స్‌, తరిగిన ఖర్జూరాలు, చీజ్‌, కొబ్బరి వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా... పంచదార, మిరియాలపొడి, దాల్చినచెక్క, యాలకులపొడి, కుంకుమ పువ్వు వేసి పంచదార కరిగే వరకూ కలుపుకోవాలి. చివరిగా ఎండు గులాబీ రేకులతో అలంకరించుకుంటే కశ్మీరీ షుఫ్తా సిద్ధం.


గుజరాతీ... బాసుంది

కావాల్సినవి: ఫుల్‌ఫ్యాట్‌ మిల్క్‌- రెండుకప్పులు, మిల్క్‌మెయిడ్‌- అరకప్పుపైన మరో రెండు చెంచాలు, యాలకుల పొడి- పావుచెంచా, కుంకుమ పువ్వు- చిటికెడు, బాదం, పిస్తా, జీడిపప్పులు అన్నీకలిపి సన్నగా తరిగి పెట్టుకున్నవి - పావుకప్పు.

తయారీ: అడుగు మందంగా ఉండే పాత్రను ఎంచుకుని దానిలో పాలు పోసి చిన్నమంట మీద మరిగించుకోవాలి. ఇప్పుడు ఆ వేడిపాలల్లోంచి ఓ రెండు చెంచాల పాలను విడిగా తీసుకుని అందులో కుంకుమపువ్వుని నాన బెట్టుకోవాలి. మరుగుతున్న పాలల్లో పైకి పేరుకున్న మీగడను గరిటతో పాత్రలోనే ఒక వారగా పక్కకు తీసుకురావాలి. ఇలా ఏడెనిమిదిసార్లయినా చేయాలి. ఇందులో మిల్క్‌మెయిడ్‌ని వేసి అది ఒకచోటే ఉండిపోకుండా సమంగా కలపాలి. ఇందులోనే యాలకులపొడి, నానబెట్టిన కుంకుమ పువ్వు పాలు, బాదం, పిస్తా పలుకులు వేయాలి. ఈ పాలను ఫ్రిజ్‌లో రెండుగంటలపాటైనా ఉంచితే రుచి అమోఘంగా ఉంటుంది.


కన్నడ... చిరోటీ

కావాల్సినవి: మైదా- ఒకటిన్నర కప్పు, బొంబాయిరవ్వ- అరకప్పు, నెయ్యి - మూడు చెంచాలు, బియ్యప్పిండి - మూడుచెంచాలు, నీళ్లు - తగినన్ని, ఉప్పు- అరచెంచా, నూనె - వేయించడానికి సరిపడా.

తయారీ: ఒక పాత్రలో... చెంచా నెయ్యి తీసుకుని, చెంచా బియ్యప్పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో మైదా, బొంబాయిరవ్వ, ఉప్పు, తగినన్ని నీళ్లు కొద్దికొద్దిగా వేసుకుంటూ చపాతీపిండిలా కలుపుకోవాలి. ఈ పిండి మీద మూతపెట్టి పావుగంట పక్కన పెట్టుకోవాలి. ఈ సమయంలో మిగిలిన నెయ్యి, బియ్యప్పిండి బాగా క్రీంలా అయ్యేంతవరకూ కలపాలి. ఇప్పుడు నానిన పిండిని ఉండలుగా చేసుకుని చపాతీల్లా ఒత్తుకోవాలి. ఒక్కో రోటినీ ఉంచి దానిపై తయారుచేసి పెట్టుకున్న క్రీంని రోటీపైన సమంగా రాయాలి. దానిపైన మరో రోటి ఉంచి మళ్లీ క్రీం రాసుకోవాలి. ఇలా ఆరేడు రోటీలని ఒకదానిపై ఒకటి ఉంచి క్రీం రాసుకోవాలి. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి రోల్‌లా చుట్టుకుని.. దాన్ని సన్నని స్లైసులుగా చాకుతో కోసుకోవాలి. ఇప్పుడా స్లైసులని చపాతీల కర్రతో ఒత్తుకొంటే పొరలుపొరలుగా ఉండే చిరోటీలు తయారవుతాయి. వీటిని నూనెలో చక్కని రంగు వచ్చే వరకూ వేయిస్తే ఊరించే చిరోటీలు సిద్ధమైనట్టే.


పంజాబీ.. పిన్ని

కావాల్సినవి: గోధుమపిండి- రెండుకప్పులు, బొంబాయి రవ్వ- రెండు చెంచాలు, పంచదార- కప్పు, నెయ్యి- కప్పు, బాదం, పిస్తాలు, ఎండుద్రాక్ష- పావుకప్పు, యాలకుల పొడి- చిన్నచెంచా

తయారీ: పాన్‌లో కొద్దిగా నెయ్యి తీసుకుని చిన్న మంట మీద గోధుమపిండిని దోరగా వేయించాలి. పిండి మాడకుండా చూసుకోవాలి. అందులోనే బొంబాయి రవ్వ కూడా వేసి అన్నీ సమంగా వేగనివ్వాలి. ఆపై డ్రైనట్స్‌, పంచదార వేసి పొయ్యి కట్టేసి చల్లారనివ్వండి. వీటిని లడ్డూల్లా చుట్టుకోవాలి. కొద్దిగా కాచిన పాలు కలుపుకొని చేస్తే లడ్డూలు చక్కగా వస్తాయి. రుచిగా కూడా ఉంటాయి.


తెలుగు... కోవా గులాబ్‌ జామూన్‌

కావాల్సినవి: తురిమిన కోవా- 125గ్రా, మైదా- రెండున్నర చెంచాలు, బేకింగ్‌ సోడా- పావుచెంచా, యాలకులపొడి- పావుచెంచా, పాలు- నాలుగు చెంచాలు, నూనె- వేయించడానికి సరిపడా. పాకం కోసం: పంచదార- ఒకటిన్నర కప్పు, నీళ్లు- ముప్పావు కప్పు, యాలకులపొడి- పావు చెంచా, రోజ్‌ వాటర్‌- చెంచా, నిమ్మరసం- ఒకటిన్నర చెంచా

తయారీ: ముందుగా పాకం కోసం... పాత్రలో పంచదార, నీళ్లు పోసి మరిగించుకోవాలి. బాగా మరిగి... సరైన పాకం వచ్చే సమయానికి రోజ్‌వాటర్‌, నిమ్మరసం, యాలకులపొడి వేసి ఓ పక్కన పెట్టుకోవాలి. మరొక పాత్రలో తురిమిన కోవా, మైదా, బేకింగ్‌సోడా, యాలకులపొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. నీళ్లు కొద్దికొద్దిగా కలుపుకొంటూ పిండిని మరీ గట్టిగా ఒత్తేయకుండా... చేత్తో మెత్తగా ఉండచుట్టాలి. ముఖ్యంగా పగుళ్లు రాకుండా చూడాలి. ఎక్కువగా సేపు గాలికి వదిలినా ఇవి ఎండిపోతాయి. అందుకే వెంటనే నూనెలో వేయించాలి. వీటిని ఐదు నిమిషాలు ఆరనిచ్చి ఆ తర్వాత కొద్దిగా వేడిగా ఉన్న పంచదార పాకంలో వేసుకోవాలి. ఓ అరగంట పాకంలో నానితే చాలా రుచిగా ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని