వేప పూల రసం

ఉగాది రోజున మనం వేప పువ్వుతో పచ్చడి చేసుకున్నట్టుగా తమిళులు రసం చేసుకుంటారు. వేపపూలు ఏడాది పొడవునా దొరకవు కాబట్టి పుష్కలంగా దొరికే ఈ కాలంలోనే వీటిని సేకరిస్తారు.

Published : 15 Mar 2020 00:10 IST

పక్కాలోకల్‌!

ఉగాది రోజున మనం వేప పువ్వుతో పచ్చడి చేసుకున్నట్టుగా తమిళులు రసం చేసుకుంటారు. వేపపూలు ఏడాది పొడవునా దొరకవు కాబట్టి పుష్కలంగా దొరికే ఈ కాలంలోనే వీటిని సేకరిస్తారు. చెట్ల కింద తెల్లని వస్త్రాన్ని పరచి రాలిన పూలను తీసుకుని,  ఎండబెట్టి, పొడిచేసి నిల్వ చేసుకుంటారు. ఆ తర్వాత వీలుదొరికినప్పుడల్లా వంటల్లో వాడుకుంటారు.
వేపలోని అత్యున్నత ఔషధ గుణాల కారణంగా శతాబ్దాల నుంచీ ఆయుర్వేద మందుల తయారీలో వీటిని వాడుతున్నారు. వేప చెట్టు వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు, కాయలు... అన్నీ ఆరోగ్యానికి మంచివే. ముఖ్యంగా వేపపూలకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. రక్తశుద్ధికి, దేహంలోని మలినాలను తొలగించడానికీ వీటిని ఉపయోగిస్తారు.  వేప పూలు చేదుగా ఉన్నా వాటితో చేసే రసం చాలా రుచికరంగా ఉంటుంది.

తమిళనాడు ప్రత్యేకం!

కావాల్సినవి: ఎండబెట్టిన వేపపూలు- రెండు టీస్పూన్లు, చింతపండు- చిన్న నిమ్మకాయంత, ఎండుమిర్చి- నాలుగు, కందిపప్పు- టీస్పూన్‌, ఆవాలు- పావుటీస్పూన్‌, ఇంగువ- చిటికెడు, కరివేపాకు- రెమ్మ, పసుపు- పావు టీస్పూన్‌, బెల్లంపొడి- అర టీస్పూన్‌, తురిమిన కొత్తిమీర- రెండు టీస్పూన్లు, నెయ్యి- టీస్పూన్‌, ఉప్పు- తగినంత.

తయారీ: చింతపండును ఒకటిన్నర కప్పుల వేడినీళ్లలో నానబెట్టుకుని రసం తీసుకోవాలి. ఈ రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని కందిపప్పు, ఇంగువ, పసుపు, ఉప్పు, కరివేపాకు వేయాలి. పావు టీస్పూన్‌ నెయ్యిలో మిర్చిని వేయించి ఈ మిశ్రమంలో వేయాలి. అన్నీ కలిపిన చింతపండు రసాన్ని చిన్న మంట మీద పచ్చి వాసన పోయేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు రెండు కప్పుల నీళ్లలో బెల్లం పొడి వేసి మరిగించాలి. టీస్పూన్‌ నెయ్యిలో ఆవాలు, కరివేపాకు వేసి వేయించి రసంలో కలపాలి. మరో టీస్పూన్‌ నెయ్యిలో చిన్న మంట మీద వేప పువ్వులను గోధుమ రంగులోకి వచ్చేంతవరకు వేయించాలి. వీటిని రసంలో కలపాలి. చివరగా తురిమిన కొత్తిమీర వేయాలి. ఈ రసాన్ని అన్నంలో కలుపుకుని తినొచ్చు లేదా సూప్‌లా తాగేయొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని