కర్బూజ కొండంత అండ!

పచ్చగా మిలమిలలాడుతూ ఉండే కర్బూజ ఏడాది మొత్తం లభిస్తుంది. ఈ పండులో దాదాపు 90 శాతానికి పైగా నీరు ఉంటుంది.

Published : 16 May 2021 01:08 IST

పోషకాలమ్‌

పచ్చగా మిలమిలలాడుతూ ఉండే కర్బూజ ఏడాది మొత్తం లభిస్తుంది. ఈ పండులో దాదాపు 90 శాతానికి పైగా నీరు ఉంటుంది. ఇది దప్పిక తీర్చడంతోపాటు తక్షణ శక్తిని అందిస్తుంది. అంతేకాదు శరీరంలోని వేడినీ చల్లబరుస్తుంది.
* ఈ పండులో విటమిన్‌-ఎ, సి పుష్కలంగా ఉంటాయి. విటమిన్‌-ఎతో పాటు లైకోపిన్‌ కూడా అధిక మోతాదులోనే ఉంటుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు శరీర కణాల ఆరోగ్యంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. దీన్ని తరచూ తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అజీర్తి, మూత్ర సంబంధ, ఎగ్జిమా లాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.  
* 150 గ్రాముల పండ్ల ముక్కల నుంచి మన శరీరానికి కావాల్సిన సగం విటమిన్‌-సి అందుతుంది. అంటే రోజులో 300 గ్రా. పండ్ల ముక్కలు తీసుకుంటే మనకు కావాల్సిన విటమిన్‌-సి దొరుకుతుందన్నమాట.  
* ఈ పండ్ల ముక్కల నుంచి తక్కువ కెలొరీలు అందుతాయి. కాబట్టి దీన్ని అల్పాహారంగానూ తీసుకోవచ్చు. దీనిలోని పీచు పొట్ట నిండిన భావనను కలిగించి ఆకలిగా అనిపించదు. దీని విత్తనాల్లోని పొటాషియం కొవ్వును తగ్గించడంలో సాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు దీన్ని ఎంచుకుంటే సరి.  

* ఈ పండు గింజలను ఎండబెట్టి సలాడ్లలో వేసుకోవచ్చు. అలాగే వేయించి పొడి చేసి కూరల్లో వేసుకుంటే రుచితోపాటు పోషకాలూ అందుతాయి. అలాగే మిల్క్‌షేక్స్‌, పండ్లరసాల్లోనూ కలిపి తాగొచ్చు.  
* కర్బూజ పండులోని ఫోలిక్‌ యాసిడ్‌ గర్భిణులకు ఎంతో మేలు చేసి కడుపులో బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఈ పండులోని విటమిన్‌-సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. తెల్ల రక్తకణాల వృద్ధికి తోడ్పడటమే కాకుండా ఇన్‌ఫెక్షన్లను దరి చేరనివ్వదు.
* ఈ పండులో సోడియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే శరీరానికి కావాల్సిన ఈ మూలకం సమృద్ధిగా అందుతుంది. దీంతోపాటు మిగతా మూలకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ పండును తరచూ తీసుకుంటే మేలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని