అందరివాడికి... అటుకుల ప్రసాదం!

చిన్ని కన్నయ్య నోరు తీపి చేసే పాయసం... వెన్న దొంగకు ఇష్టమైన లడ్డూ.. వేణుమాధవుడికి నైవేద్యంగా తియ్యటి పొంగలి... బాల గోపాలుడు మెచ్చే కేసరి... ఇలా కృష్ణాష్టమి రోజున దేవదేవుడికి

Updated : 29 Aug 2021 05:48 IST

చిన్ని కన్నయ్య నోరు తీపి చేసే పాయసం... వెన్న దొంగకు ఇష్టమైన లడ్డూ.. వేణుమాధవుడికి నైవేద్యంగా తియ్యటి పొంగలి... బాల గోపాలుడు మెచ్చే కేసరి... ఇలా కృష్ణాష్టమి రోజున దేవదేవుడికి అత్యంత ఇష్టమైన అటుకులతో ప్రసాదాలు చేసి పెడదామా. వీటితోపాటు చిన్నారులు ఇష్టపడే మరిన్ని కూడా చేసేద్దామా.

తీపి పొంగలి

కావాల్సినవి: అటుకులు- కప్పు, బెల్లం- ముప్పావు కప్పు, బాదం, కాజూ,  ఎండుకొబ్బరి ముక్కలు- రెండు చెంచాల చొప్పున, నెయ్యి- తగినంత, యాలకులు- మూడు.

తయారీ: అటుకులను పెద్ద జాలీలో వేసి నీళ్లు పోసి కడగాలి. ఎక్కువగా ఉన్న నీటిని వెంటనే చేత్తో అదిమి తీసేయాలి. లేకపోతే అవి మెత్తగా అయిపోతాయి. పొయ్యి మీద గిన్నె పెట్టి బెల్లం వేసి, సరిపడా నీళ్లు పోసి కరిగించాలి. బెల్లం మొత్తం కరిగాక తీసి పక్కన పెట్టేయాలి. పాన్‌లో నెయ్యి వేసి కరిగాక చిన్నగా కోసుకున్న ఎండుకొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్‌మిస్‌, బాదంలను వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. మంటను చిన్నగా చేసి అదే పాన్‌లో కరిగించి పెట్టుకున్న బెల్లం నీటిని జాలీ ద్వారా వడబోయాలి. ఇది దగ్గరపడేదాకా కలుపుతూ ఉండాలి. కొంచెం పాకం వచ్చాక రెండుమూడు యాలకులను దంచి వేసుకోవాలి. వేయించిన కొబ్బరి, జీడిపప్పు మిశ్రమాలనూ జత చేయాలి. రెండు నిమిషాలాగి అటుకులను వేసుకుని బాగా కలపాలి. బెల్లంపాకంలో అటుకులు కలిసేలా కాస్త నెయ్యి వేసి ఉడికించుకోవాలి.


లడ్డూ...

కావాల్సినవి: అటుకులు- కప్పు, బెల్లం, నెయ్యి- అర కప్పు చొప్పున, బాదం, కాజూ తురుము- రెండు పెద్ద చెంచాలు, యాలకుల పొడి- అర చెంచా.

తయారీ: పాన్‌లో అటుకులు వేసి బాగా వేయించాలి. వీటిని చల్లార్చి మిక్సీజార్‌లో పొడి చేసుకోవాలి. దీన్ని పెద్ద గిన్నెలోకి తీసుకుని బెల్లం తురుము, నెయ్యి, బాదం తురుము వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా యాలకుల పొడి జత చేసి చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. బాదంతో గార్నిష్‌ చేసుకుంటే ఆహా అనిపించే అటుకుల లడ్డూలు రెడీ!


కట్లెట్‌...

కావాల్సినవి: అటుకులు- కప్పు, ఉడికించిన ఆలూ- రెండు, తరిగిన పచ్చిమిరపకాయలు- రెండు,  ఉల్లిపాయ- ఒకటి (సన్నగా తరగాలి), జీడిపప్పు తురుము- పావు కప్పు, పోపు దినుసులు, నిమ్మరసం, చాట్‌ మసాలా- చెంచా చొప్పున, పసుపు- చిటికెడు, ఉప్పు- తగినంత, కొత్తిమీర- కొద్దిగా, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు.

తయారీ:  అటుకులను నీళ్లలో వేసి కడిగి నీరు మొత్తం పోయేలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఓ పెద్ద మూతలో పోసి కాస్త ఆరనివ్వాలి. పొయ్యి మీద పాన్‌ పెట్టి నెయ్యి వేసుకోవాలి. అది వేడయ్యాక పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. ఆ తర్వాత జీడిపప్పు తురుము, ఉడికించిన ఆలూ మిశ్రమం, అటుకులు, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర, చాట్‌మసాలా... ఇలా అన్నీ ఒకదాని తర్వాత మరొకటి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని చేత్తో కట్లెట్స్‌లా వత్తుకుని పెనంపై వేసి రెండువైపులా నెయ్యితో చక్కగా కాల్చుకోవాలి. వీటిని టొమాటో సాస్‌తో తింటే బాగుంటాయి.


పాయసం

కావాల్సినవి: అటుకులు- కప్పు,   కొబ్బరి తురుము- పావు కప్పు, పాలు- అరలీటరు, కొబ్బరిపాలు- పావులీటరు, బెల్లం- కప్పు, నెయ్యి- రెండు పెద్ద చెంచాలు,  కిస్‌మిస్‌, కాజూ- గుప్పెడు, యాలకుల పొడి- అర చెంచా.

తయారీ: పొయ్యి మీద కడాయి పెట్టి బెల్లం వేసి, కాసిన్ని నీళ్లు పోసి కరిగించాలి. దీన్ని పక్కనుంచి, మరో బాండీ పెట్టి నెయ్యి వేయాలి. అది వేడయ్యాక జీడిపప్పు, కిస్‌మిస్‌, అటుకులు ఒకదాని తర్వాత మరొకటి వేస్తూ అటుకులు లేత గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించాలి. అటుకుల్లో తగినన్ని పాలు, కొబ్బరిపాలు పోసి ఉడికించాలి. దీంట్లో బెల్లం పాకం, పచ్చికొబ్బరి తురుము వేసి మరికాసేపు ఉడికించాలి. చివరగా యాలకుల పొడి వేసి దించేస్తే అటుకుల పాయసం సిద్ధమైనట్లే.


కేసరి...

కావాల్సినవి: అటుకులు- కప్పు, బాదం, కిస్‌మిస్‌- పది చొప్పున, కాచి చల్లార్చిన పాలు- రెండు కప్పులు, చక్కెర- ముప్పావు కప్పు, నెయ్యి- అర కప్పు, యాలకుల పొడి- అర చెంచా, ఫుడ్‌ కలర్‌- చిటికెడు.

తయారీ: పాన్‌లో అటుకులు వేసి రెండు, మూడు నిమిషాలు వేయించాలి. ఇవి కాస్త క్రిస్పీగా మారిన తర్వాత చల్లార్చి మిక్సీజార్‌లో కొంచెం బరకగా పొడి చేసుకోవాలి. పాన్‌లో నెయ్యి వేసి వేడయ్యాక జీడిపప్పు, కిస్‌మిస్‌ వేయించి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నెయ్యిలో అటుకుల రవ్వను వేసి మీడియం మంటపై అయిదు నిమిషాల పాటు వేయించాలి. అది లేత గోధుమ రంగు వచ్చాక పాలు పోసి ఉడికించాలి. ఇప్పుడు చక్కెర, చెంచా నెయ్యి వేసి మరోసారి బాగా కలపాలి. చిటికెడు ఫుడ్‌ కలర్‌ నీళ్లలో కలిపి దీనికి జత చేయాలి. చివరగా వేయించిన డ్రైఫ్రూట్స్‌, యాలకుల పొడి, రెండు చెంచాల నెయ్యి వేసి బాగా కలపాలి. అంతే కేసరి సిద్ధం.


ఫ్రూట్‌ మిక్స్‌...

కావాల్సినవి: అటుకులు- కప్పు, బెల్లంతురుము- పావు కప్పు, పచ్చికొబ్బరి తురుము, యాపిల్‌ ముక్కలు- అర కప్పు చొప్పున, దానిమ్మ గింజలు- పావు కప్పు, అరటిపండు- ఒకటి, యాలకుల పొడి- పావు చెంచా, తరిగిన పుదీనా తురుము- కొద్దిగా.

తయారీ: గిన్నెలో బెల్లం, పచ్చికొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి బాగా కలిపి కాసేపు పక్కన పెట్టాలి. ఆ తర్వాత దీంట్లో యాపిల్‌ ముక్కలు, దానిమ్మ గింజలు, అటుకులు వేసి బాగా కలపాలి. చివరగా అరటి పండు ముక్కలను వేసుకోవాలి. ఆపై పుదీనా తురుముతో గార్నిష్‌ చేసుకుంటే సరి.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని