అరటికాయ కోఫ్తా కర్రీ

అరటి కాయలని ముక్కలుగా కోసి కుక్కర్‌లో ఒక కూత వచ్చేవరకు ఉడకబెట్టి, చల్లారిన తర్వాత తొక్క తీసేసి, పూర్తిగా మెదపాలి. ఈ గుజ్జులో సెనగపిండి, తరిగిన కొత్తిమీర....

Updated : 14 Nov 2021 06:15 IST

కావాల్సినవి: అరటికాయలు- నాలుగు, అల్లంవెల్లుల్లి ముద్ద- రెండు చెంచాలు, సెనగపిండి- రెండు పెద్ద చెంచాలు, కొత్తిమీర- పావు కప్పు, ఎర్ర మిరప పొడి- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, నూనె- మూడు పెద్ద చెంచాలు, బిర్యానీ ఆకు- ఒకటి, తరిగిన ఉల్లిపాయ- ఒకటి (పెద్దది), పసుపు- అర చెంచా, తరిగిన టొమాటో- ఒకటి, గరంమసాలా- అర చెంచా.

తయారీ: అరటి కాయలని ముక్కలుగా కోసి కుక్కర్‌లో ఒక కూత వచ్చేవరకు ఉడకబెట్టి, చల్లారిన తర్వాత తొక్క తీసేసి, పూర్తిగా మెదపాలి. ఈ గుజ్జులో సెనగపిండి, తరిగిన కొత్తిమీర, అల్లంవెల్లుల్లి ముద్ద, కారం, ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని పది, పన్నెండు ఉండలుగా చేసుకోవాలి. కడాయిలో సరిపడా నూనె వేసి వేడయ్యాక ఉండలుగా చేసిన కోఫ్తాలను మీడియం మంట మీద బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. పెద్ద చెంచా నూనె వేడి చేసి, బిర్యానీ ఆకు, తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత మిగిలిన అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి, వేయించాలి. మిగిలిన కారం, పసుపు, టొమాటో ముక్కలను వేసి తక్కువ మంట మీద ఉడికించాలి. రెండు కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి నూనె పైకి తేలే వరకు గ్రేవీని మరిగించాలి. ఆ తర్వాత మంటను తగ్గించి కోఫ్తాలను వేయాలి. అయిదు నిమిషాలు చిన్న మంటపై ఉడికించుకోవాలి. అందులో గరంమసాలా వేసి కొత్తిమీరతో అలంకరించి వేడి వేడిగా సర్వ్‌ చేయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని