కనువిప్పు

నీలిమ ఆఫీస్‌ నుండి ఇంటికి వచ్చేసరికి ఇల్లు ఒక రణరంగంలా ఉంది. హాల్లో అయిదేళ్ల కూతురు నిత్య ఇంకా స్కూల్‌ యూనిఫాంలోనే ఉంది. మూడేళ్ల శరత్‌ నిత్యా కలిసి న్యూస్‌పేపర్‌ను చింపి ముక్కలు చేస్తున్నారు.

Updated : 23 Jan 2022 07:15 IST

కనువిప్పు

- యశోదాకైలాస్‌ పులుగుర్త

నీలిమ ఆఫీస్‌ నుండి ఇంటికి వచ్చేసరికి ఇల్లు ఒక రణరంగంలా ఉంది. హాల్లో అయిదేళ్ల కూతురు నిత్య ఇంకా స్కూల్‌ యూనిఫాంలోనే ఉంది. మూడేళ్ల శరత్‌ నిత్యా కలిసి న్యూస్‌పేపర్‌ను చింపి ముక్కలు చేస్తున్నారు. తమ్ముడిమీద తన అధికారాన్ని చూపుతూ నిత్య వాడి మెడను వంచి దెబ్బలు కొడుతూ ఉంటే వాడు గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. నిత్య స్కూల్‌ బ్యాగ్‌, విడిచిన షూస్‌ సోఫాలోనే చెరోపక్కన విసిరేసినట్లుగా ఉన్నాయి.

అప్పుడే లోపలనుండి అత్తగారూ, పక్కింటి రామలక్ష్మిగారూ వచ్చారు. రామలక్ష్మిగారు నీలిమ వైపు ఓరగా చూస్తూ ‘‘వస్తానండీ పార్వతిగారూ’’ అంటూ వీడ్కోలు తీసుకుని వెళ్లిపోయింది.

రోజూ దాదాపుగా అదే పరిస్థితి నీలిమ ఆఫీసు నుండి వచ్చేసరికి... కాస్త పిల్లలను సముదాయించడం, మనవరాలికి స్కూల్‌ యూనిఫాం మార్పించడం లాంటి పనులేవీ అత్తగారు చేయరు... తను పెద్దగా ఆవిడ నుండి ఏమీ ఆశించడం లేదు కూడా... మూడేళ్ల శరత్‌ను రోజంతా ఆవిడే చూసుకుంటున్నారు కదా అని కూడా నీలిమ జాలిపడుతుంది. కానీ ఆ బాధ్యత ఇంక తప్పదురా దేవుడా అనుకుంటూ, కోడలు ఎప్పుడొస్తుందా ఆ బాధ్యతనుండి విముక్తి అవుదామా అనుకుంటుందావిడ.

గవర్నమెంట్‌ ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది నీలిమ... ఆమె భర్త కృష్ణమోహన్‌ జూనియర్‌ కాలేజీలో ఫిజిక్స్‌ లెక్చరర్‌. కాలేజీ తరువాత అక్కడ విద్యార్థులకు ఎమ్‌సెట్‌, ఐఐటి
కోచింగ్‌ క్లాసెస్‌ తీసుకుని రాత్రి ఏడుగంటలకు గానీ అతను ఇంటికి రాడు.

ఇంట్లో పొద్దుటే లేచి టిఫిన్‌, వంట చేసి కూతురిని స్కూల్‌కి పంపించి అప్పుడు ఆఫీస్‌కి బయలుదేరుతుంది నీలిమ. మూడేళ్ల శరత్‌ స్నానం కూడా నీలిమే చేయించాలి. మొదట్లో అత్తగారు చేయిస్తారనుకుంటూ ఆఫీస్‌కు వెళ్లిపోయేది. కానీ ఒకరోజు అత్తగారు ‘వాడికి స్నానం చేయించడం నావల్ల కాదమ్మాయ్‌, ఆ పనికూడా నువ్వే పూర్తిచేసి వెళ్ల’మని చెప్పింది. మామగారు లేని మూలాన అత్తగారు వీరితోనే ఉంటారు. కోడలు పొద్దుటే ఆఫీస్‌కు వెళితే ఎప్పటికో వస్తుంది పాపం, చేయగలిగిన సహాయం చేద్దామని కూడా ఆవిడ అనుకోరు.

నీలిమది సర్దుకుపోయే స్వభావం. ఆఫీస్‌ నుండి ఇంటికి రాగానే కాసేపు కూడా కూర్చోకుండానే వెంటనే పనిలోకి దిగుతుంది. భర్త వచ్చేసరికి ఇంటినీ పిల్లలనూ నీట్‌గా ప్రశాంతంగా ఉంచాలని నీలిమ తాపత్రయం.

నీలిమ ఆఫీసుకి వెళ్లాక, భోజనం చేయగానే పక్కింటి రామలక్ష్మిగారు వచ్చేస్తారు. ఆవిడ కోడలు హౌస్‌వైఫ్‌. అన్నీ ఆ అమ్మాయే చూసుకుంటుంది. ఈవిడకు పనీపాటా ఉండదు, తోచదు. పార్వతమ్మగారింటికి వచ్చేస్తుంది... ఇక వారిద్దరి కాలక్షేపం లోకంలోని కోడళ్లే. చుట్టుపక్కల ఇళ్లల్లోని కోడళ్లూ బంధువులింట కోడళ్లే కాకుండా, వారి కోడళ్ల గురించి కూడా అనర్గళంగా చర్చలు చేసుకుంటూ, వాళ్లపై లేనిపోని అభియోగాలు చేస్తూ సంతృప్తి పడిపోతారు.

‘‘మీరు చూడడమేమిటండీ మీ మనవడిని ఈ వయసులో. మీ కోడలేమో టిప్‌టాప్‌గా తయారై ఆఫీస్‌కు వెళుతూ లక్షలు లక్షలు సంపాదిస్తోంది... మీరేమో ఒక పనిమనిషిలా పొద్దుటినుంచీ సాయంత్రంవరకూ ఈ పిల్లాడిని సాకడమేంటీ? హాయిగా ఈ వయసులో ఏ బాదరబందీలు లేకుండా స్వేచ్ఛగా ఉండాలిగానీ’’ అంటూ లేనిపోని ఆలోచనలను పార్వతమ్మగారి తలకాయకు అంటిస్తుంది.

నీలిమ పెళ్లై అత్తవారింటికి వచ్చాక అత్తగారు నీలిమతో బాగానే ఉండేది. ఆవిడే వంటపని అంతా చూసుకునేవారు. మనవరాలు పుట్టాక కూడా ఆ పాపను బాగానే చూసేవారు. ఎప్పుడైతే రామలక్ష్మిగారు వారి పక్కింటిలోకి వచ్చారో అప్పటినుండీ ఆవిడలో మార్పు చోటు చేసుకుంది. రామలక్ష్మిగారి కోడలు ఉద్యోగస్తురాలు కాదు. కోడలిపై అత్తరికం చేస్తూ, ఆ అమ్మాయిమీద లేనిపోని చాడీలు చెబుతూ అత్తగార్లు అంటే నాలా ఉంటేనే రోజులంటూ పార్వతమ్మగారికి హితోపదేశం చేస్తుంది. అత్తగారిలో వచ్చిన మార్పుని నీలిమ కనిపెట్టగలిగినా ఆవిడ పెద్దరికానికి విలువనిస్తూ ఆవిడను పల్లెత్తు మాట అనకుండా అన్నిపనులూ సక్రమంగా చేసేసుకుంటూ ఉంటుంది.

ఒకరోజు రాత్రి అందరూ భోజనాలు చేస్తుండగా పార్వతమ్మగారు కొడుకుతో ‘‘ఒరేయ్‌ క్రిష్ణా, మీ మామయ్యను చూసి చాలా రోజులైంది, విజయవాడ వెళ్లి మామయ్య ఇంట్లో ఒక వారంరోజులుండి వస్తానురా’’ అనేసరికి కృష్ణమోహన్‌, ‘‘అదేంటమ్మా, ఇప్పుడు వెళ్లడం ఏంటీ? శరత్‌ను ఎవరు చూస్తారు? నిత్య స్కూల్‌ నుండి వచ్చాకా ఎక్కడుంటుంది? నాకు శెలవు పెట్టడం కుదరదు... మరి నీకూ నీలూ? అమ్మ వచ్చేవరకూ శెలవు పెట్టగలవా?’’ అన్నాడు.

‘‘అయ్యో, అస్సలు కుదరదండీ... టెండర్స్‌ కాల్‌ఫర్‌ చేశాం. వాటి ఓపెనింగ్స్‌ అవీ చాలా ఉన్నాయి. నేను తప్పకుండా అటెండ్‌ అవ్వాలి. ఈ నెలంతా బిజీనే. కానీ పాపం అత్తయ్యగారు వెళతానంటున్నారు, ఎలా?’’ అంటూ భర్తవైపు సాలోచనగా చూసింది.

అప్పుడైనా ఆవిడ ‘పోనీలేరా, తరువాత వెళతా’నని అనలేదు.

ఇంతలో నీలిమే, ‘‘పోనీలెండి, అత్తయ్యగారిని పంపిద్దాం. ఆవిడకు కూడా కొంచెం మార్పూ, విశ్రాంతీ ఉండాలి కదా. నేను మా పిన్ని కూతురు కల్యాణి ఇంట్లో బాబుని దింపేసి ఆఫీసుకి వెళతాను. మన ఆటోడ్రైవర్‌తో నిత్యను స్కూలు అయిపోయిన తరువాత కల్యాణి ఇంట్లో దింపమంటాను. నేను ఆఫీసునుండి వస్తూ పిల్లలిద్దరినీ తెచ్చేసుకుంటాను’’ అంది. నీలిమ పిన్ని కూతురు ఉండేది పక్కవీధిలోనే... అవసరానికి సహాయపడుతూ ఉంటుంది.

‘‘ఎలా ఉంది ఐడియా’’ అంటూ భర్తవైపు చూసింది... ‘‘బాగానే ఉందిగానీ, మెయిన్‌టైన్‌ చేసుకోగలవా నీలూ’’ అన్నాడు.

‘‘ఫరవాలేదండీ... అన్నీ కావాలంటే కుదరవు. రేపు ఆదివారమే కదా. అత్తయ్యగారిని ట్రైన్‌ ఎక్కించండి. మీ మామయ్యగారికి ఫోన్‌చేసి చెప్పండి’’ అంటూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఏ సమస్యనైనా చక్కగా తృటిలో పరిష్కరించగలిగే నీలిమ అంటే కృష్ణమోహన్‌కు చాలా ఇష్టం. ఇంట్లో పనులన్నీ ఓర్పుగా నేర్పుగా నిర్వహించు కుంటుంది. ఏనాడూ తనమీద చికాకు పడని భార్య అంటే ఎంతో అనురాగం అతనికి.

అసలు పార్వతమ్మగారి ప్రయాణానికి నారు పోసింది రామలక్ష్మిగారే. ‘మీరు మీ మనవడినీ మనవరాలినీ చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి మీ కోడలి ఆటలు సాగుతున్నాయి. మీ విలువేమిటో తెలిసిరావాలంటే ఒక వారం పదిరోజులు మీరు ఎక్కడికైనా వెళ్లిపొండి. అప్పుడు మీ కోడలు లబోదిబోమంటుంది. అప్పుడప్పుడూ ఇటువంటి చురకలు అంటించకపోతే ఈనాటి కోడళ్లు మరీ పేట్రేగిపోతార’ంటూ చెవిలో నూరిపోసింది.

మర్నాడు ఆదివారం తల్లిని విజయవాడకు ట్రైన్‌ ఎక్కించి వచ్చాడు కృష్ణమోహన్‌.

నీలిమ అనుకున్నట్లుగా యధాప్రకారం పొద్దుటే అన్నిపనులూ పూర్తి చేసుకుని బాబుని కల్యాణి ఇంట్లో దిగబెట్టి ఆఫీస్‌కు వెళ్లిపోతోంది.

ఇక్కడ పార్వతమ్మ రామలక్ష్మిగారి మాటల ప్రభావంలో పడిపోయి అన్నగారింటికి వచ్చిందే కానీ, ఆవిడను ఎవరూ ఆప్యాయంగా ఆదరించనే లేదు. అన్నగారికీ వదినగారికీ పార్వతమ్మ పట్ల అభిమానమున్నా, ఇంట్లోని మిగతావారికి ఆవిడ రాక అసహనంగా ఉంది- ముఖ్యంగా ఆ ఇంటి కోడలికి. అసలు పార్వతమ్మను సరిగ్గా పలకరించనే లేదు ఆ అమ్మాయి. అన్నయ్య కోడలు రేఖ అహంభావి అని పార్వతమ్మ విని ఉంది. చదువుకున్న అమ్మాయి అయినా ఉద్యోగం చేయదు. ఇంట్లో అన్ని పనులూ వదినగారే చేయాలి. వదిన పొద్దుటే లేచి యంత్రంలా ఇంట్లో పనులన్నీ చేయడం చూసింది. కనీసం ఆ అమ్మాయి తన పిల్లలను కూడా పట్టించుకోదు. ఎప్పుడూ మొబైల్‌ ఫోన్‌ చేతిలో పట్టుకుని ఏదో అజమాయిషీ చేసేస్తున్నట్లు అటూ ఇటూ తిరుగుతూ ఇంట్లో బాద్యతలన్నీ తనే నిర్వహిస్తున్నట్లుగా బిల్డప్‌ ఇస్తుంది. ఎప్పుడు చూసినా ఫుల్‌ మేకప్‌లో ఉంటుంది. ఎవరో ఒకరు స్నేహితులంటూ వస్తూనే ఉంటారు. మామగారి ఎదుటే పొట్టిపొట్టి టీ షర్ట్స్‌, జీన్స్‌లో తిరుగుతూ ఈనాటి ఆధునికతకు ప్రతీకగా ఉంటుంది. పెడసరి మాటలతో మామగారినీ అత్తగారినీ చిన్నబుచ్చుతూనే ఉంటుంది.

అన్నయ్యా వదినా ఆ అమ్మాయి ప్రవర్తనకు ఆవేదన పడడం ప్రత్యక్షంగా గమనించింది పార్వతమ్మ.

పార్వతమ్మ వచ్చి వారం రోజులు గడిచిపోయాయి. కొడుకూ కోడలూ మామూలుగా యోగక్షేమాలడుగుతూ ఫోన్‌ చేస్తున్నారే తప్ప వచ్చేయమని మాత్రం అనడం లేదు. అమ్మను వచ్చేయమంటానని కృష్ణమోహన్‌ అంటున్నా నీలిమే ‘అయ్యోపాపం ఆవిడను కొన్నాళ్లపాటూ ఉండనీయండి. మీ మామయ్యా అత్తయ్యతో ఆవిడకు చక్కని కాలక్షేపం అవుతోందేమో’ అంటూ భర్త ప్రయత్నాన్ని నివారించింది.
మరో అయిదు రోజులు గడిచిపోయాయి.

ఒకరోజు రేఖ పార్వతమ్మ దగ్గరకు వచ్చి ‘‘ఇంకా మీరు ఇక్కడ ఎన్నిరోజులు ఉంటారండీ? అసలు మీకు తిరిగి మీ ఊరు వెళ్లిపోవాలన్న ఉద్దేశం లేనట్లుగా కనపడుతోందే’’ అనేసింది ఠక్కున.

‘‘మిమ్మల్ని మీ అబ్బాయీ కోడలూ ఇక్కడకు శాశ్వతంగా పంపేయలేదు కదా?’’ అదో జోక్‌లాగా అంటుంటే పార్వతమ్మగారి ముఖం నల్లగా మాడిపోయింది. నోటమాట రావడం లేదు. అవమానంతో ఆవిడ కళ్లు కన్నీటితో నిండిపోతుంటే తల వంచుకుంది.

‘‘మా ఇల్లేమీ అతిథి గృహం కాదు... రోజుల తరబడి బంధువులను పోషించడానికి’’ అంటూ విస విసా అక్కడనుండి నడుస్తూ వెళ్లిపోయింది.

రేఖ మాటలకు పార్వతమ్మగారి ముఖం సిగ్గుతో చితికిపోయింది. ఇంకా నయం అన్నయ్యా వదినా రేఖ మాటలు వినలేదు. విని ఉంటే ఇంటి ఆడపడుచుకి జరిగిన అవమానానికి బాధపడి ఉండేవారు అనుకుంది.
వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేసి మరుసటి రోజునే అన్నగారిచేత టికెట్‌ తెప్పించుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైంది పార్వతమ్మ. ఏమిటో ఒకరకమైన ఆవేదన మనసుని కోసేస్తుంటే కొడుక్కి తను బయలుదేరుతున్నట్లుగా కూడా ఫోన్‌ చేసి చెప్పలేదు.

మరునాటి ఉదయాన్నే ఇంటిముందు ఆటోలో నుండి దిగిన అత్తగారిని చూస్తూనే నీలిమ గబగబా దగ్గరకు వచ్చేసి, ఆవిడ బ్యాగ్‌ను అందుకుంటూ ‘‘ఏమిటత్తయ్యా, ఫోన్‌ అయినా చేయలేదు బయలుదేరుతున్నట్లు... మీ అబ్బాయి స్టేషన్‌కు వచ్చేవారు కదా’’ అంటూ ఆప్యాయంగా పలకరించేసరికి ఆవిడ గొంతు గద్గదమైపోయి మాటరాలేదు.

‘‘నాయనమ్మా’’ అంటూ ఆవిడ కాళ్లకు చుట్టుకున్న శరత్‌నూ నిత్యనూ దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. ఈలోగా కృష్ణ ‘‘ఏంటమ్మా, చెప్పాపెట్టకుండా వచ్చేశావు’’ అనగానే ‘‘అవునురా, రెండురోజులనుండీ మీరంతా కళ్లల్లో కదలాడుతున్నారు. ముందుగా చెప్పేదేముందిలే అని అప్పటికప్పుడు అనుకుని బయలుదేరి వచ్చేశాను. నాకేమైనా ఊరు తెలియదా ఏమన్నానా’’ అంటుండగా నీలిమ వేడి వేడి కాఫీ గ్లాస్‌ అత్తగారి చేతికందిస్తూ ‘‘మిమ్మల్ని బాగా మిస్‌ అవుతున్నాం అత్తయ్యా, మీ అబ్బాయి అమ్మను వచ్చేయమంటానని అంటూనే ఉన్నారు. నేనే ‘పాపం కొన్నాళ్లు అక్కడ విశ్రాంతిగా ఉండనీయండి’ అంటూ ఆపాను. ఇక్కడ ఎలాగూ మీకు పిల్లలతో విశ్రాంతి ఉండదని...’’ అంది.

‘‘అయ్యో అదేమీ లేదు తల్లీ. నా మనవడూ మనవరాలిని చూసుకోవడం కూడా ఒక పనేనా’’ అంటూ... ‘‘నువ్వు ఆఫీస్‌కు తయారవ్వు నీలిమా, నేను పిల్లల సంగతి చూస్తా’’నంటూ పార్వతమ్మగారు లేచేసరికి...
‘‘లేదు అత్తయ్యా, ఈరోజు ఆఫీసుకి రానని ఫోన్‌ చేసి చెబుతాను. ప్రయాణం చేసి వచ్చారు. ఈరోజుకి విశ్రాంతి తీసుకోండి’’ అని నీలిమ అనడంతో ఆదరంగా ఆవిడ హృదయం ఆర్ధ్రమైంది.

నీలిమ ఎంత మంచిదో, రామలక్ష్మిగారితో స్నేహం, ఆవిడ చెప్పుడు మాటలూ తన మనసుమీద ఎంత ప్రభావం చూపించాయో అర్థమయ్యేసరికి ఆవిడ మనసు సిగ్గుతో కుంచించుకుపోయింది. ‘రామలక్ష్మి లాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. చెప్పుడు మాటలతో బాంధవ్యాలను దూరం చేస్తారు. నిజానికి తను ఇక్కడ లేకపోయినా నీలిమ సమర్థంగా ఇంటినీ పిల్లలనూ చక్కబెట్టుకుంది. ఇంటిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకుంది. మనిషి దగ్గరగా ఉన్నప్పుడు ఆ మనిషి విలువ తెలియదని దూరంగా ఉన్నప్పుడే ఆ విలువ అర్థమౌతుందని రామలక్ష్మిగారు చెబితే తను ఆ మాటలు నిజమని నమ్మి ప్రయోగం చేసి భంగపడింది.
మంచి చదువు చదివి, బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తున్నా నీలిమలో వీసమెత్తు అహంభావం కూడా కనపడదు. తనని ఎంత ఆదరంగా చూసుకుంటుంది. నీలిమ- రేఖలలో ఎంత వ్యత్యాసం. అహంభావానికి ప్రతీక రేఖ. ఒక విధంగా రేఖా, రామలక్ష్మిగారు వ్యక్తిగతంగా ఎంత చెడ్డవారైనా తన మనసులో ఒక గొప్ప మార్పుకి కారణ భూతులు అవడమే కాదు, బాంధవ్యానికి ఉన్న విలువ ఏమిటో తెలియచెప్పి కనువిప్పు కలిగించారు... అనుకుంటే ఆవిడ మనసు ఎంతో తేలికగా ప్రశాంతంగా అయిపోయింది.

మర్నాడు నీలిమ ఆఫీస్‌కు వెళ్లగానే మధ్యాహ్నం రామలక్ష్మిగారు వచ్చారు ఎంతో ఆత్రంగా... ‘‘వచ్చేశారా పార్వతిగారూ’’ అంటూ. పిల్లల బట్టలు మడతపెడుతున్న పార్వతమ్మగారు ముభావంగా తలతిప్పుకున్నారు.

‘‘ఏమంటోంది మీ కోడలు? మన మంత్రం పనిచేసిందా? మీ విలువేమిటో ఇప్పటికైనా మీ కోడలికి అర్థమై ఉండాలే’’ అనగానే పార్వతమ్మగారు తీక్షణంగా ఆవిడవైపు చూస్తూ...

‘‘ఎవరి విలువ ఎవరికి అర్థం కావాలి రామలక్ష్మిగారూ? మనం లేకపోయినా హాయిగా సమర్థించుకోగలిగే ఆర్థికబలం, స్వాతంత్య్రం కలిగి ఉన్నారు నేటి కోడళ్లు. పనిమనుషులనో ఆయాలనో పెట్టుకునీ, లేకపోతే డేకేర్లలో పిల్లలను వేసుకునీ ఎలాగోలాగ సర్దుకుపోగలరు.

కానీ మనలాంటివాళ్లకే వాళ్ల ఆదరణ లేకపోతే దిక్కు ఉండదని గ్రహించుకోవాలి. కోడళ్లను ప్రేమగా మన ఇంటి ఆడపిల్లగా చూసుకున్నప్పుడు వాళ్లు కూడా మనల్ని గౌరవిస్తారు. మనకు ఓపిక ఉన్నంతవరకూ వాళ్లకు సహాయపడాలే తప్ప కోడళ్లకు మనం చేయడం ఏమిటనుకుంటూ అహంభావానికి పోకూడదు.

మా అన్నయ్య కోడలు మా అన్నయ్యనూ వదిననూ గడ్డిపోచల్లా చూస్తున్నా మా అన్నయ్యా వదినా మౌనంగా సహిస్తున్నారు. అలాగే ఉండాలని కాదు నేను చెప్పేది... ఏదోనాటికి ఆ అమ్మాయిలో మార్పు వస్తుందనీ, అత్తమామల విలువేమిటో గ్రహిస్తుందనీ వాళ్ల ఆశ. బంధానికి దగ్గరవ్వాలని వాళ్లు అనుక్షణం తాపత్రయపడుతున్నారు.

మీరు మా ఇంటికి రావచ్చు... కానీ మంచి విషయాలను చెప్పండి. బాంధవ్యాలను విడగొట్టే సలహాలివ్వకండి దయచేసి... చక్కగా ఆధ్యాత్మిక విషయాలను మాట్లాడుకుంటూ మనసుని ప్రశాంతంగా ఉంచుకుందాం... పాపం మీ కోడలు చిన్నపిల్ల. అదే పనిగా ఆ అమ్మాయినీ ఆడిపోసుకోకుండా ఉండండి. మీ ప్రవర్తనకు విసిగిపోయి ఆ అమ్మాయి ఏదో ఒకరోజు మీ మెడపట్టి బయటకు గెంటేస్తే... అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీ కోడలితో ప్రేమగా మెలగండి’’ అంటూ మెత్తగా చివాట్లు వేసి పంపించింది.

ఆ సాయంత్రం నీలిమ ఆఫీస్‌ నుండి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా ఎంతో నీట్‌గా సర్దింది. పిల్లలు శుభ్రంగా కడిగిన ముత్యాల్లా మెరిసిపోతున్నారు. నీలిమ రాకను చూసిన పార్వతమ్మగారు
‘‘వచ్చావా నీలిమా’’ అంటూ వేడివేడిగాకాఫీ కప్పులో పోసి నీలిమకు అందించారు. ‘‘అయ్యో అత్తయ్యా, మీకెందుకంత శ్రమ’’ అని నీలిమ ఆదరంగా అనేసరికి ఆవిడ హృదయం ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనైంది. ‘భగవంతుడా నాకీ అదృష్టం చాలు’ అంటూ ఆదేవుడికి మనసులోనే కృతజ్ఞతలు సమర్పించుకున్నారు పార్వతమ్మగారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..