మురిపిస్తూనే... ముంచేస్తున్నాయి!

మీకు పొడుపుకథలు ఇష్టమేనా..? అయితే ఇది చెప్పగలరేమో చూడండి.వంటింట్లో ఉంటాయి...డ్రెసింగ్‌ టేబుల్‌ మీద ఉంటాయి.హాల్లో ఉంటాయి...బయటినుంచి తెప్పించుకున్న పిజ్జా బాక్స్‌లో ఉంటాయి. గుడ్డులో ఉంటాయి...

Updated : 23 Jan 2022 06:49 IST

మురిపిస్తూనే... ముంచేస్తున్నాయి!

మీకు పొడుపుకథలు ఇష్టమేనా..? అయితే ఇది చెప్పగలరేమో చూడండి.వంటింట్లో ఉంటాయి...డ్రెసింగ్‌ టేబుల్‌ మీద ఉంటాయి.హాల్లో ఉంటాయి...బయటినుంచి తెప్పించుకున్న పిజ్జా బాక్స్‌లో ఉంటాయి. గుడ్డులో ఉంటాయి... కూరగాయల్లో ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మనచుట్టూ ఉంటాయి... మనలోనూ ఉంటాయి. ఏమిటో చెప్పండి చూద్దాం... తెలియలేదా, సరే... అవే... ‘ఫరెవర్‌ కెమికల్స్‌’ అనే విష రసాయనాలు..! ఒకప్పుడు అద్భుతమైన ఆవిష్కరణగా పేరొంది ఇప్పుడు ప్రజల ప్రాణాలకే పెను ప్రమాదంగా పరిణమించిన ఈ రసాయనాలు అణువణువునూ ఆక్రమించి ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఎందుకో మీరే చూడండి..!

దో చేయబోతే మరేదో అయింది... అంటుంటాం వంటింట్లో కొత్త వంటల ప్రయోగాలు చేసినప్పుడు. ఎనభయ్యేళ్ల క్రితం డాక్టర్‌ రాయ్‌ ప్లంకెట్‌కి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. కాకపోతే ఆయన శాస్త్రవేత్త కాబట్టి దాని ఫలితం మొత్తం ప్రపంచం మీద పడింది. అమెరికాలోని డ్యుపాంట్‌ రసాయన కర్మాగారంలో శాస్త్రవేత్తగా ఉన్న- రాయ్‌ రిఫ్రిజిరేషన్‌ వ్యవస్థకోసం చల్లబరిచే గ్యాస్‌ని కనిపెట్టాలని ప్రయత్నిస్తూ, ఓరోజు చేస్తున్న ప్రయోగాన్ని సగంలో వదిలేసి ఇంటికి వెళ్లాడు. మర్నాడు అతడొచ్చేసరికి అది కాస్తా విచిత్రమైన పదార్థంగా మారింది. ముట్టుకుంటే జారిపోతూ, వ్యాక్స్‌లా గట్టిపడిన ఆ రసాయనాన్ని మరిన్ని పరీక్షలు చేస్తే దానికి ఎన్నో ప్రత్యేక లక్షణాలు ఉన్నాయని తెలిసింది. ఎంత వేడినైనా ఎంత చల్లదనాన్నైనా తట్టుకుని నిలుస్తుందనీ, ఎలాంటి యాసిడ్స్‌ పడ్డా పాడవదనీ, ద్రావకాల్లో కరగదనీ అర్థమైంది.

ఇది 1938 నాటి సంగతి. అప్పుడే రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. సైంటిస్టులు ఏం కనిపెట్టినా దానికి యుద్ధంలో ఏమన్నా ఉపయోగం ఉంటుందేమోనని చూసేవి ప్రభుత్వాలు. సరిగ్గా సమయానికి అందుబాటులోకి వచ్చింది ఈ విచిత్రమైన రసాయనం. అప్పటివరకూ అణుబాంబుని భద్రంగా ఎలా ప్యాక్‌చేయాలా అని కిందా మీదా పడుతున్నవారికి అన్నిటినీ తట్టుకునే ఈ రసాయనం చేతికి అందింది. ఇంకేముంది... దీని సాయంతో అణుబాంబు తయారవడమూ దాన్ని ప్రయోగించి రెండో ప్రపంచయుద్ధానికి ముగింపు పలకడమూ అయిపోయింది.

మరోపక్క పరిశోధనలు కొనసాగించిన డ్యుపాంట్‌ ఫ్యాక్టరీ-  ‘పీటీఎఫ్‌ఈ’ అనే ఆ విలక్షణ రసాయనానికి సాటి రాగలవి ఏవీ లేవని తెలుసుకుంది. ‘టెఫ్లాన్‌’ అనే ట్రేడ్‌ మార్క్‌తో వెంటనే పేటెంట్‌ కూడా తీసుకుంది. మరిన్ని ప్రయోగాలు చేసిన కొద్దీ పీటీఎఫ్‌ఈ తరహాలో కొత్త కొత్త లక్షణాలతో సరికొత్త రసాయన పదార్థాలు తయారవుతోంటే శాస్త్రవేత్తలు అబ్బుర పడిపోయారు. వ్యాపార ప్రపంచం వాటిని అందిపుచ్చుకుని రకరకాల ఉత్పత్తులను తయారుచేయడం మొదలెట్టింది.

అలా పుడుతూనే ప్రపంచయాత్ర ప్రారంభించింది టెఫ్లాన్‌. 1950వ దశకంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో ప్రవేశించిన టెఫ్లాన్‌కి ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని దేశాలూ అనుమతులు ఇచ్చేశాయి. అణుబాంబు తర్వాత దాన్ని ప్రధానంగా వాడింది వంటపాత్రలకే. దాంతో పలుచటి పూత వేస్తే చాలు... పాత్రలు నున్నగా జారిపోతున్నట్లుండేవి. శుభ్రం చేయడం తేలికయ్యేది. పదార్థాలు అంటుకోకుండా, నూనె అక్కర్లేకుండా వంట చేయడంలో ఉన్న ఆనందం అనుభవంలోకి రావడంతో నాన్‌స్టిక్‌ పాత్రలకి డిమాండ్‌ ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. 1961లో ఒక్క అమెరికాలోనే నెలకు పదిలక్షల చొప్పున నాన్‌స్టిక్‌ వంట, పాత్రలు అమ్ముడుపోయాయట. ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకునే పీటీఎఫ్‌ఈ అంతరిక్ష యాత్ర తాలూకు ప్రయోగాలకూ కీలకమైంది. 1969లో చందమామనీ చూసొచ్చింది.

ఆ తర్వాత బాబ్‌ గోరె అనే శాస్త్రవేత్త పీటీఎఫ్‌ఈతో చేసిన ప్రయోగాలు ‘గోరె-టెక్స్‌’ అనే వస్త్రంలాంటి పొరని తయారుచేయడానికి తోడ్పడ్డాయి. ఈ పొర ఎంత పలుచగా మృదువుగా ఉంటుందో అంత దృఢంగానూ ఉంటుంది. తేమని దరిచేరనివ్వదు కాబట్టి నీటిలో తడవదు. ఇంకేముంది... వ్యాపార ప్రపంచానికి ‘వాటర్‌ రెసిస్టంట్‌’ అనే మరో కొత్త కాన్సెప్ట్‌ దొరికింది. రకరకాల ఉత్పత్తులతో అవి మార్కెట్‌ని ముంచెత్తాయి.

ఎక్కడెక్కడ...

చెమట పట్టినా మేకప్‌ చెదరకుండా ఉంటుంది కాబట్టి వాటర్‌ రెసిస్టంట్‌ మేకప్‌ సామాను అనగానే రెండో ఆలోచన లేకుండా కొనేస్తాం. మేకప్‌ అంటే మరేమిటో కాదు, సాధారణంగా వాడే ఫౌండేషన్‌ క్రీమ్‌,సన్‌స్క్రీన్‌ లోషన్‌, మాయిశ్చరైజర్‌, హెయిర్‌ కండిషనర్‌ లాంటివీ; వంటకి వాడే నాన్‌స్టిక్‌ పాత్రలూ; హాల్లో వేసిన మెత్తటి సోఫా, దాని ముందు పరిచిన ఖరీదైన తివాచీ(పొరపాటున టీ కాఫీ లాంటివి ఒలికినా అంటుకోవు, మరకలు పడవు); అలా సూపర్‌ మార్కెట్‌ నుంచి తెచ్చి ఇలా మైక్రోవేవ్‌లో పెట్టేసే పాప్‌కార్న్‌ బ్యాగ్స్‌; ఆన్‌లైన్లో ఆర్డరిచ్చి తెప్పించుకునే పిజ్జాలూ ఇతర ఆహారపదార్థాల ప్యాకేజింగులూ; ఇంటి గోడలకు వేసిన పెయింట్లూ, తడి తగలకుండా చెదలూ తుప్పూ పట్టకుండా- ఫర్నిచర్‌కి వేసే వార్నిష్‌; చెమట పట్టినా ఒంటికి అతుక్కోని క్రీడా దుస్తులూ; వర్షంలో తడవని రెయిన్‌ కోట్లూ; కృత్రిమ లెదర్‌ బ్యాగులూ; ఫొటోల ప్రింట్‌కి వాడే పేపరూ... అన్నీ పీటీఎఫ్‌ఈ సంబంధిత రసాయనాల చలవే. సౌరశక్తితో కరెంటు తయారుచేసుకునే సోలార్‌ ప్యానల్స్‌పైన పూతగా, పెట్రోల్‌ లాంటి వాటివల్ల జరిగే అగ్నిప్రమాదాలను ఆర్పడానికి వాడే ఫోమ్‌లో, లాన్‌లా కనిపించేందుకు వేసే కృత్రిమగడ్డిలో, నిత్యం వాడే సెల్‌ఫోన్లలో, క్రిమిసంహారక మందుల్లో, విమానాల తయారీలో... క్లుప్తంగా చెప్పాలంటే- అసలు దీన్ని వాడని పరిశ్రమ లేదు. వాటర్‌ రెసిస్టంట్‌ అనీ, తడి తగలవనీ చెప్పిన ప్రతి వస్తువూ ఈ రసాయనాలను కలిగివుంటుంది. అన్ని మంచి లక్షణాలు ఉన్నప్పుడు వాటిని ఎక్కువగా ఉపయోగించుకోవడం సహజమేగా... అనుకున్నాయి అటు శాస్త్రీయ ప్రపంచమూ ఇటు వాణిజ్య ప్రపంచమూ కూడా. నిజమే కానీ...

ఒక్క రైతు వల్ల...

అమెరికాలోని వెస్ట్‌ వర్జీనియాలో పార్కర్స్‌బర్గ్‌ అనే ఊళ్లో పాడి పశువులు తరచూ అనారోగ్యానికి గురై మరణించేవి. సరైన కారణమేమీ లేకుండానే వందలాది పశువులు క్రమంగా బలహీనమైపోతూ చికిత్సకు స్పందించక ప్రాణాలు కోల్పోవడం ఒక రైతుని తీవ్రంగా కలచివేసింది. పశువులు మేత మేసే ప్రాంతాన్నంతా తిరిగి క్షుణ్ణంగా పరీక్షించడం మొదలెట్టాడు. ఒకచోట భూమి లోపలినుంచి తెల్లని నురగతో కూడిన నీరు పైకి రావడం చూశాడు. పశువులు ఆ నీటిని తాగే అవకాశమూ ఆ ప్రాంతంలో మొలిచిన గడ్డిని తినే అవకాశమూ ఉన్నాయి. అది తప్ప అనుమానించాల్సిన విషయం మరొకటేదీ కన్పించలేదు. ఆ నీరు ఎక్కడినుంచీ వస్తోందని ఆరా తీస్తే దగ్గరలోనే ఉన్న డ్యుపాంట్‌ వాళ్ల ఫ్యాక్టరీ నుంచి అని తెలిసింది. అది టెఫ్లాన్‌ తయారీ ఫ్యాక్టరీ. ఆ కర్మాగారం నుంచి వెలువడుతున్న కలుషిత జలాల వల్లే పశువులు అనారోగ్యానికి గురవుతున్నాయని ఆరోపిస్తూ కోర్టుకి వెళ్లాడు రైతు. ఆ కేసు నేపథ్యంలో ఊరి ప్రజలు 70వేల మందికి రక్తపరీక్షలు చేస్తే చాలామంది రక్తంలో పీఎఫ్‌ఏఎస్‌ అనే విష రసాయనాలు ఉన్నట్లు వెల్లడైంది. మూత్రపిండాలూ ఇతర క్యాన్సర్‌ కేసులూ, హైకొలెస్ట్రాల్‌ కేసులూ ఈ ప్రాంతంలోనే ఎక్కువగా వస్తున్నట్లు వైద్య అధికారులు కూడా ధ్రువీకరించారు. దాంతో ఆ రసాయనాలకీ రోగాలకీ మధ్య సంబంధం మీద చర్చ మొదలైంది. అప్పటివరకూ టెఫ్లాన్‌ అద్భుత లక్షణాలను వినియోగించుకోవడంలోనే తలమునకలుగా ఉన్న సైన్సు ప్రపంచం దృష్టిని 1998నాటి ఆ కేసు ఆరోగ్యంపై టెఫ్లాన్‌ ప్రభావంవైపు మళ్లించింది. ఒక్క టెఫ్లాన్‌ అనే కాదు, అలాంటివే మరికొన్ని రసాయనాలూ ఉన్నాయనీ ఇవన్నీ కలిసి మనిషి ఆరోగ్యాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయనీ గుర్తించారు.

ఆ ప్రత్యేకతే...

ఏ ప్రత్యేకత చూసి ప్రపంచం పీటీఎఫ్‌ఈని తలకెత్తుకుందో ఆ ప్రత్యేకతే ఇప్పుడు మన కొంప ముంచుతోంది- అంటున్నారు పరిశోధకులు. అసలేం జరిగిందంటే- టెఫ్లాన్‌ తదితర రసాయనాలన్నీ కూడా మనం కృత్రిమంగా ప్రయోగశాలలో తయారుచేసు కున్నవే. ప్రత్యేకించి కార్బన్‌, ఫ్లోరిన్‌ అనే రెండు మూలకాలను కలిపినప్పుడు ఏర్పడిన రసాయన బంధం ఆధారంగా దాదాపు తొమ్మిది వేల సంయోగ పదార్థాలు తయారయ్యాయి. వాటిల్లో టెఫ్లాన్‌ తయారీకి కారణమైన పీటీఎఫ్‌ఈ మొట్టమొదటిది. పనికి వచ్చే గుణాలు చాలా ఉన్నందున దాన్నీ దానిలాంటి మరికొన్ని రసాయనాలనూ పరిశ్రమల్లో విపరీతంగా వినియోగిస్తున్నారు. మిగిలిన వాటిలాగే జీవితకాలం అయిపోయాక ఈ రసాయనాలూ భూమిలో కలిసి పోతాయని శాస్త్రవేత్తలు భావించారు. కానీ వాడగా వాడగా తేలిందేమిటంటే... కార్బన్‌- ఫ్లోరిన్‌ల మధ్య ఏర్పడుతున్న బంధం మొత్తంగా రసాయనశాస్త్రంలోనే బలమైన బంధమనీ దాన్ని మళ్లీ విడదీయడం అసాధ్యమనీ. వేడి చేసినా, ఎండలో ఉంచినా, నీట ముంచినా... అవి విడిపోవడం లేదు. వేరే ఏ రసాయనాలు కలిసినా ఈ మూడిటిలో ఏదో ఒక విధానం ద్వారా విడిపోతాయి. ఇవి మాత్రం విడిపోకపోగా అటు పర్యావరణంలోనూ ఇటు మన శరీరంలోనూ కలిసిపోతున్నాయి. కాలం గడుస్తున్నా నాశనమైపోవడం లేదు సరికదా, ఎన్నేళ్లైనా శాశ్వతంగా పడి ఉంటున్నాయి. అందుకే వాటికి ‘ఫరెవర్‌ కెమికల్స్‌’ అన్న పేరొచ్చింది. వివిధ పరిశ్రమల్లో వాడుతున్న రసాయనాల్లో ప్రధానంగా - పీఎఫ్‌ఓఏ(పెర్‌ఫ్లోరోఆక్టేనోయిక్‌ యాసిడ్‌), పీఎఫ్‌ఓఎస్‌(పెర్‌ఫ్లోరోఆక్టేన్‌సల్ఫోనిక్‌ యాసిడ్‌) అనే రెండు రకాలు ఇప్పుడు మననీ మన చుట్టూ ఉన్న వాతావరణాన్నీ ఆక్రమించుకుని ప్రజారోగ్యానికి పెను సవాలు విసురుతున్నాయి.

ఎక్కడ చూసినా అవే!

ఎప్పటికీ నాశనం కాని ఈ రసాయనాలతో వస్తువులను తయారుచేసేటప్పుడు వెలువడే కాలుష్యాల వల్లా, తయారైన వస్తువుల్ని వాడి పారేయడం వల్లా ఇప్పుడీ రసాయనాలు మొత్తంగా పర్యావరణంలో వ్యాపించాయి. అత్యంత సూక్ష్మరూపంలో ఉండే వీటి అణువులు గాలిలో, నీటిలో, నేలలో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. నీళ్లలో చేరినవి సబ్బునీటిలాగా మారి సముద్రాలూ నదుల ఉపరితలాన్ని ఆక్రమించి అలల కదలికల్నీ, మేఘాల తయారీనీ కూడా ప్రభావితం చేస్తూ వాతావరణ మార్పులకు తమ వంతు దోహదం చేస్తున్నాయి. ఎవరెస్టు పర్వతం మీదా, ఆర్కిటిక్‌ ధ్రువపు మంచులోకీ కూడా చేరాయి. 2015లో జరిగిన ఒక అధ్యయనంలో గంగా నదిలో 15 రకాల పీఎఫ్‌ఏలు కనిపించాయి. యమునానది కలిశాక అవి రెట్టింపయ్యాయి. అందులో పెరిగే చేపలన్నిటిలోనూ పీఎఫ్‌ఏలున్నాయి. వందమీటర్ల లోతుకి వెళ్తే చాలు మొత్తం భూగర్భ జలాలన్నిటిలోనూ పీఎఫ్‌ఏలున్నాయి. మనదేశంలోనే కాదు, ప్రపంచమంతటా తాగే నీళ్లలోనూ తినే ఆహార పదార్థాల్లోనూ చేరిన ఈ విష రసాయనాలు వాటి ద్వారా మనిషి శరీరంలో ప్రవేశిస్తున్నాయి. అక్కడినుంచి జీర్ణవ్యవస్థ ద్వారా బయటకు పోవడం లేదు. లోపలే ఎక్కడో పేరు కుంటున్నాయి. అలా ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోతే ఏమవుతుందన్నదే ఇప్పుడు పరిశోధకులను వేధిస్తున్న ప్రశ్న. రక్తంలో ఉంటే ఏ స్థాయిలో ఉన్నాయో పరీక్షించవచ్చు(అదీ అన్ని దేశాల్లో అందుబాటులో లేదు). కానీ మిగిలిన కణాల్లోకీ మెదడులోకీ చేరితే గుర్తించడం కష్టం. ప్రత్యేకించి కొన్ని రకాల పీఎఫ్‌ఏఎస్‌- నాడీ మండలం పాలిట విషాలుగా పరిణమిస్తున్నాయి. పర్‌ద్యూ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జేసన్‌ కేనన్‌ చేసిన పరిశోధనలో కీలకమైన డోపమైన్‌ హార్మోన్‌ స్థాయులమీద ఈ రసాయనాలు ప్రభావం చూపుతున్నట్లు తెలిసింది. 2008లో మనదేశంలో జరిగిన పరిశోధనలో తల్లిపాలలో ఇవి 46 పీపీటీ స్థాయిలో ఉన్నాయని వెల్లడైంది. సురక్షిత స్థాయి ఒక పీపీటీ(పార్ట్స్‌ పర్‌ ట్రిలియన్‌) మాత్రమే. శాస్త్రవేత్తల అంచనాలను బట్టి ప్రపంచమంతటా దాదాపు 98శాతం ప్రజల శరీరాల్లో ఇవి ఉన్నాయి. పరీక్ష చేసిన వారిలో ప్రతి ఐదుగురిలోనూ ఒకరికి సురక్షిత స్థాయికన్నా ఎక్కువున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ‘ఇప్పటివరకూ తెలిసినదాన్ని బట్టి చూస్తే పరిస్థితి ప్రమాదకరంగా ఉందనీ జాగ్రత్తపడక తప్పదనీ మాత్రం కచ్చితంగా చెప్పగలం’ అంటున్నారు హార్వర్డ్‌ చాన్‌ స్కూల్‌ పరిశోధకుడు జోసెఫ్‌ అలెన్‌.

భస్మాసుర హస్తం

మనం తయారుచేసుకున్నవే మన పాలిట భస్మాసుర హస్తంలా మారిన ఈ పరిస్థితిని సాధ్యమైనంత త్వరగా అదుపులోకి తెచ్చు కోవాలని హెచ్చరిస్తున్నాయి పర్యావరణ, ఆరోగ్య సంస్థలన్నీ. ఇప్పటికిప్పుడు వీటి ఉత్పత్తి పూర్తిగా ఆపేసినా పర్యావరణంలో ఉన్నవాటిని ఏమీ చేయలేం. ఇప్పటికే శరీరంలో చేరినవి వదిలి పోనూ పోవు. కాబట్టి అదనంగా చేర్చడమైనా తగ్గిస్తేనే అవి ప్రమాదకర స్థాయికి పెరగకుండా ఉంటాయి. ముఖ్యంగా తాగునీటి విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. ఎంఐటీ పరిశోధనల్లో- పలు బ్రాండెడ్‌ తాగునీటి సీసాల్లోనూ ఈ రసాయనాల పరిమాణం ప్రమాదకర స్థాయుల్లో ఉన్నట్లు తేలింది. కొంతవరకూ ఫిల్టరింగ్‌ ప్లాంట్స్‌ నీటినుంచి వీటిని వడ పోయగలవు. రివర్స్‌ ఆస్మాసిస్‌, గ్రాన్యులర్‌ యాక్టివేటెడ్‌ కార్బన్‌ ఫిల్టర్లూ అయితే ఫలితం ఉంటుంది. కానీ అవి ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి అన్ని చోట్లా వాటిని వాడడం లేదు. ఇప్పుడు అమెరికాలో చాలా రాష్ట్రాలు ఈ దిశగా చర్యలు చేపడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఫ్యాక్టరీల కాలుష్యాల్ని నదుల్లోకీ చెరువుల్లోకీ వదిలే మన దేశంలో భూగర్భ జలాలు ఎంత సురక్షితమో తెలియదు. ఫరెవర్‌ కెమికల్స్‌కి సంబంధించి మనదేశంలో ఎలాంటి ఆంక్షలూ లేకపోవడాన్ని ఇంటర్నేషనల్‌ పొల్యూటంట్స్‌ ఎలిమినేషన్‌ నెట్‌వర్క్‌ 2019 నివేదికలో పేర్కొంది.

అమెరికాలో పార్కర్స్‌బర్గ్‌ ఉదంతం తర్వాత దాదాపు ఇరవయ్యేళ్లుగా ఈ విషరసాయనాల వాడకానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. 1970ల నాటి కంపెనీ పత్రాలు బయటికి రావడంతో టెఫ్లాన్‌ వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందన్న విషయం డ్యుపాంట్‌ కంపెనీకి ముందే తెలుసని వెల్లడవడంతో, ఆ సంస్థ- బాధితులకు నష్టపరిహారం చెల్లించింది. ఆ తర్వాత పలు కర్మాగారాల్లో పనిచేసే సిబ్బందినీ పరిసరాల్లో నివసించే ప్రజలనీ పరీక్షించడంతో ఫరెవర్‌ కెమికల్స్‌ ప్రభావానికి సంబంధించి చాలా కేసులు వెలుగులోకి వచ్చాయి. దాంతో క్రమంగా టెఫ్లాన్‌ తయారీని అమెరికాతో సహా పలు దేశాలు ఆపేశాయి. ప్రజారోగ్యానికి సంబంధించిన అత్యవసర పరిస్థితిగా దీన్ని పరిగణించిన అమెరికా గతేడాదే ఫరెవర్‌ కెమికల్స్‌ని పూర్తిగా నివారించడానికి ఎన్విరాన్‌మెంటల్‌ జస్టిస్‌ ప్లాన్‌నిప్రారంభించింది. డెన్మార్క్‌ ఫుడ్‌ ప్యాకేజింగ్‌లో ఫరెవర్‌ కెమికల్స్‌ వాడకూడదని చాన్నాళ్లక్రితమే చట్టం చేసింది. అక్కడ మెక్‌డోనల్డ్స్‌తో సహా ఏ ప్యాకింగ్‌లోనూ అవి ఉండవు. జర్మనీ, నెదర్లాండ్స్‌, నార్వే, స్వీడన్‌ తదితర దేశాలు మరో రెండేళ్లకల్లా ఈ రసాయనాల వాడకాన్ని పూర్తిగా నిషేధించేలా చర్యలు తీసుకుంటున్నాయి. వీటి సరసన మన దేశమూ చేరాలని కోరుకుందాం..!

వందేళ్లకో వెయ్యేళ్లకో నాశనమయ్యే ప్లాస్టిక్‌కే ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నప్పుడు అసలు నాశనం కాని విషాలకు విరుగుడు వెతుక్కోవడం... అత్యవసరం కదా!


అవే కారణమా?

ఫరెవర్‌ కెమికల్స్‌ అన్నీ క్యాన్సర్‌ కారకాలేనని బల్లగుద్ది చెబుతున్నారు పరిశోధకులు. ప్రత్యేకించి కిడ్నీ క్యాన్సర్‌, టెస్టిక్యులార్‌ క్యాన్సర్‌ లాంటివే కాక ఇంకా వీటివల్ల...

* శరీరంలో కొలెస్ట్రాల్‌, స్థూలకాయం, గుండెజబ్బుల ప్రమాదం పెరుగుతాయి.

సంతానరాహిత్యం, జీవభౌతిక చర్యల్లో మార్పులు చోటుచేసుకుంటాయి.

హార్మోన్ల పనితీరు దెబ్బతింటుంది. థైరాయిడ్‌ సమస్యలు వస్తాయి. కాలేయం చెడిపోతుంది.

* వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాక్సిన్లు పనిచేయవు.

* పిల్లల్లో జన్యులోపాలూ, పెరుగుదల, ప్రవర్తన లోపాలూ ఉంటాయి.

*అల్సరేటివ్‌ కోలిటిస్‌, గర్భిణుల్లో అధిక రక్తపోటు లాంటి సమస్యలు రావచ్చు.

* మూర్ఛవ్యాధి వస్తుంది.

* క్లుప్తంగా చెప్పాలంటే- ఫరెవర్‌ కెమికల్స్‌ మన జీవిత కాలాన్నే గణనీయంగా తగ్గించి వేస్తాయి.

జాగ్రత్తపడాలి!

ఈ విష రసాయనాల వాడకాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అయినా ఎవరికి వారు కూడా తమ వంతు ప్రయత్నం చేయాలి.

* తాగునీరు ఎక్కడి నుంచి వస్తోందో గమనించుకోవాలి. తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి.

వంటపాత్రల నుంచీ ఫర్నిచర్‌ వరకూ వినిమయ వస్తువులు ఏవి కొన్నా వాటివల్ల ఆరోగ్యానికి ఇబ్బంది లేదన్నది నిర్ధారించుకోవాలి.  

* వాటర్‌ రెసిస్టంట్‌ అని ఉన్న వస్తువులు కొనేటప్పుడు అందులో ఏం వాడారోతెలుసుకోవాలి. మరకలు పడని ఖరీదైన వస్తువుల కన్నా తేలిగ్గా శుభ్రం చేసుకోవడానికి వీలయ్యే పర్యావరణహిత ఉత్పత్తులే అన్నిటికీ మంచిది.

* పేరులో ఫ్లోరో, పీటీఎఫ్‌ఈ అనే రసాయనాలు ఉన్న కాస్మెటిక్స్‌ వాడకూడదు.

* కొన్న వస్తువుల లేబుల్స్‌ చెక్‌ చేయడం అలవాటు చేసుకోవాలి. హానికర రసాయనాల ఆనవాళ్లు ఉన్నపదార్థాలకు దూరంగా ఉండాలి.పీఎఫ్‌ఏస్‌, పీఎఫ్‌సీ- రహిత ఉత్పత్తులను మాత్రమే కొనుక్కోవాలి.

* భవన నిర్మాణంలో, రంగుల తయారీలో- సిలికాన్‌, అక్రిలిక్‌, పారఫిన్‌ వ్యాక్స్‌ లాంటి ప్రత్యామ్నాయాలు మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..