తప్పు... అలా వేలెత్తి చూపొద్దు!

లావూ సన్నం... తెలుపూ నలుపూ... పొడుగూ పొట్టీ... ఇవన్నీ మనుషుల్ని వర్ణించడానికీ, ఫలానావాళ్లూ అని వివరంగా చెప్పడానికీ వాడే మాటలు. ఆఖరికి పూజించే దేవుణ్ణి కూడా ‘నల్లనయ్య’ అనీ ‘బొజ్జ గణపయ్య’ అనీ నోరారా పిలుచుకునే మనకి ఇందులో తప్పేమీ కనిపించదు.

Updated : 22 May 2022 03:40 IST

తప్పు... అలా వేలెత్తి చూపొద్దు!

లావూ సన్నం... తెలుపూ నలుపూ... పొడుగూ పొట్టీ... ఇవన్నీ మనుషుల్ని వర్ణించడానికీ, ఫలానావాళ్లూ అని వివరంగా చెప్పడానికీ వాడే మాటలు. ఆఖరికి పూజించే దేవుణ్ణి కూడా ‘నల్లనయ్య’ అనీ ‘బొజ్జ గణపయ్య’ అనీ నోరారా పిలుచుకునే మనకి ఇందులో తప్పేమీ కనిపించదు. కానీ, అతి ఏదైనా అనర్థదాయకమే. ఒకటికి రెండుసార్లు ‘నువ్వు లావుగా ఉన్నావ’నో, ‘నల్లగా ఉన్నావ’నో అంటే సున్నితమనస్కులకు చివుక్కుమంటుంది. పుట్టుకతో వచ్చిన రూపానికి వ్యక్తుల్ని బాధ్యుల్ని చేసి పదే పదే వేలెత్తి చూపడాన్నే ‘బాడీ షేమింగ్‌’ అంటారు. సామాజిక మాధ్యమాలలో ఇప్పుడిది అడ్డూ ఆపూ లేకుండా చెలరేగిపోతూ వికృత రూపం దాలుస్తోంది. ఆ సమస్యనూ బాధితుల ఆవేదననూ అర్థం చేసుకుంటే అనాలోచితంగానైనా ఆ పొరపాటును మళ్లీ చేయకుండా చూసుకోవచ్చు.

‘అందంగా లేనా... అసలేం బాలేనా...’ అంటూ ప్రేమిస్తున్న వ్యక్తిని ప్రశ్నిస్తుంది ఓ తెలుగు సినిమాలో నాయిక. అమ్మాయి అందం చుట్టూ తిరిగే సినిమా ప్రేమల్ని పక్కనబెట్టినా, మన సమాజంలో పెళ్లి సంబంధం కుదుర్చుకునేటప్పుడు మొట్టమొదట చూసేది రూపమే. అది నచ్చాకే ఇతర విషయాల్లోకి వెళ్తారు. యువతీ యువకుల రూపాల గురించి నిస్సంకోచంగా, బహిరంగంగా చర్చించడం మనదేశంలోనే ఎక్కువ. సౌందర్య సాధనాలూ వ్యాయామ పరికరాల వాణిజ్య ప్రకటనల్లోనే కాదు, ఆఖరికి పెళ్లి సంబంధాల ప్రకటనల్లోనూ ఆ విషయాన్ని ప్రస్తావిస్తారు. అమ్మాయి తెల్లగా ఉండాలనీ పొడవుగా ఉండాలనీ చెబుతారు. రూపం కన్నా గుణం ముఖ్యమని మాట వరసకి అందరూ ఒప్పుకుంటారు కానీ తమదాకా వచ్చేసరికి మాత్రం అందానికే మొదటి ప్రాధాన్యమిస్తారు. తప్పులేదు, ఎవరిష్టం వారిది. కానీ అందంగా లేరని అవతలి వాళ్లను అవమానించే హక్కు మాత్రం ఎవరికీ లేదన్న విషయాన్ని గుర్తించడం లేదు. అందువల్ల ఏం జరుగుతోందంటే...

పెళ్లైన ఏడాదిన్నర తర్వాత- అందంగా లేవనీ, అందుకు పరిహారంగా అదనపు కట్నం తేవాలనీ భార్యని వేధించడం మొదలెట్టాడు నారాయణ్‌పేట్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి. ఆ వేధింపులు తట్టుకోలేకా, తమ తాహతుకు మించి వాళ్లు కోరిన కట్నకానుకలన్నీ ఇచ్చిన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పి మనసు కష్టపెట్టడం ఇష్టంలేకా... ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది.

దిల్లీకి చెందిన ఒక ఫ్యాషన్‌ డిజైనర్‌ని- ‘నువ్వు దుస్తులు బాగా డిజైన్‌ చేస్తావు కానీ వాటిని నీమీద వేసుకుని చూపించకు. నీ రంగువల్ల డ్రెస్‌ అందం కూడా పోతుంది’ అనేవారట. నల్లగా ఉన్నందువల్ల తన రూపం పట్ల పలువురు చేస్తున్న వ్యాఖ్యలు బాధిస్తున్నాయనీ ఇక తనవల్ల కాక ఈ లోకాన్ని వీడుతున్నాననీ సూయిసైడ్‌ నోట్‌ రాసిపెట్టి మరీ చనిపోయింది. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో పదమూడేళ్ల బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. లావుగా ఉన్నావని తోటి విద్యార్థులు వెక్కిరిస్తున్నారనీ సోషల్‌ మీడియాలో తన ఫొటోలు పెట్టి నవ్వడంతో తట్టుకోలేక చచ్చిపోతున్నాననీ తల్లికి లేఖ రాసింది. కేరళలోని పాలక్కాడ్‌లో ఒక యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఆమె లావుగా ఉండటం వల్లే పెళ్లై పది నెలలైనా గర్భం దాల్చలేదని అత్తింటి వాళ్లు వేధించేవారట.

ఇవన్నీ అప్పుడప్పుడు పత్రికల్లో వచ్చిన వార్తలే. ఇలా ఇంకెన్ని జరుగుతున్నాయో మన దగ్గర లెక్కలు లేవు కానీ విదేశాల్లో 15-19 ఏళ్ల పిల్లల్లో ఆత్మహత్యలకు ప్రధాన కారణాల్లో బాడీ షేమింగ్‌ కూడా ఒకటని తేలింది. అలవాటుగా, అనాలోచితంగా గబుక్కున నోరు జారే చిన్న మాట కొందరికి తూటాలా తాకి ప్రాణాంతకంగా పరిణమిస్తుందనడానికి పైన పేర్కొన్న సంఘటనలే నిదర్శనం. ‘బాడీ షేమింగ్‌’ అనేది చిన్న విషయం కాదనీ, ఎదుటి వ్యక్తి భావోద్వేగాలతో ఆడుకునే ఈ చర్య సోషల్‌ మీడియా వేదికల మీద వికృత రూపం దాల్చడం వల్ల తీవ్ర పరిణామాలకు దారితీస్తోందనీ, అందుకే ఆచి తూచి మాట్లాడాల్సిన అవసరం చాలా ఉందనీ అంటున్నారు నిపుణులు.

ఏమిటీ బాడీ షేమింగ్‌?
ఒక వ్యక్తి రూపాన్ని చూసి వ్యాఖ్యానించడాన్నీ, గేలి చేయడాన్నీ ‘బాడీ షేమింగ్‌’ అంటున్నారు. ఒంటి రంగు, ఎత్తు, లావు, కనుముక్కు తీరు... ఇలా ఒక్క రూపాన్నే కాదు- వస్త్రధారణనీ, ఆహారపుటలవాట్లనీ, నడవడికనీ, మాటతీరునీ, హావభావాల్నీ... దేని గురించైనా వెక్కిరించడం, బాగోలేదనడం, ఆ కారణంగా వివక్ష చూపడం కూడా దాని కిందికే వస్తుంది. బాడీ షేమింగ్‌ అనేది ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. బయట దాకా అక్కర్లేదు, ఇంట్లోనే పుట్టినప్పుడే మొదలవుతుంది. పాపో బాబో పుట్టగానే చుట్టూ ఉన్నవాళ్లు రంగు గురించి వ్యాఖ్యానిస్తారు. అమ్మ రంగు రాలేదు, నాన్న ముక్కు రాలేదు... అంటూ రూపానికి మార్కులు వేయడం మొదలెడతారు. పిల్లలు పెరిగే కొద్దీ ఇదీ పెరుగుతుందే కానీ తగ్గదు. అలాంటి మాటలు వింటూ పెరిగిన పిల్లలు కూడా స్కూల్లో తమ తోటివారి రూపాన్ని బట్టి ‘మోటూ’, ‘బక్కోడు’, ‘నల్లోడు’ లాంటి పేర్లు పెట్టి వెక్కిరిస్తుంటారు. చిన్నప్పుడు పిల్లలు సన్నగా ఉన్నారనీ సరిగా తినడం లేదనీ బాధపడిపోయే తల్లులే పెద్దవగానే తిండి మీద నియంత్రణలు పెడుతుంటారు. అమ్మాయిలు లావైతే పెళ్లి కుదరడం కష్టమవుతుందని బాధపడతారు.  
‘నీ ఒంటి రంగుకి ఇంత ముదురు రంగు నప్పదని ఎన్నిసార్లు చెప్పాలీ...’ ‘మొహానికి ఏమన్నా రాసుకోకూడదూ...’‘జిమ్‌కి వెళ్లరాదూ, కొంచెం తగ్గితే చక్కగా ఉంటావు...’ లాంటి సలహాలు టీనేజీ నుంచే మొదలవుతాయి.
ఒకప్పుడు బాడీషేమింగ్‌ లావుగా ఉన్నవాళ్లకే ఎక్కువగా ఎదురయ్యేది. ఇప్పుడు నడక నుంచీ నడత వరకూ అన్నీ సమస్యలే. స్కూలు నుంచి ఆఫీసుల వరకూ ప్రతిచోటా ప్రతి విషయమూ విమర్శకు గురవుతూనే ఉంది. స్త్రీ పురుషులన్న తేడా లేదు. రకరకాల కారణాలతో తెలియక కొందరూ, తెలిసి కొందరూ బాడీ షేమింగ్‌కి పాల్పడుతున్నారు.


కారణాలేముంటాయి?
తల్లిదండ్రులూ తోబుట్టువులూ సన్నిహిత మిత్రులూ ప్రేమతో సూచనలూ సలహాలూ ఇస్తుంటారు... మార్చుకోగలిగిన విషయాల్లో వాటిని పాటిస్తే లాభముంటుందని. అవైనా నొప్పించకుండా చెప్పే పద్ధతిలో చెప్పొచ్చు కానీ చాలామందికి ఆ స్పృహ ఉండదు. లావుగా ఉన్నది నిజమేగా, మేం అన్నదాంట్లో తప్పేముందీ... అనుకుంటారే తప్ప  అది అవతలివారిని బాధిస్తుందని ఆలోచించరు. కొందరేమో వెక్కిరింతనీ ప్రశంసనీ కలిపి చెబుతారు. ‘నువ్వు చక్కగా తయారవుతావు కానీ కాస్త బరువు తగ్గాలి...’ అంటారు.
పొగిడినందుకు సంతోషించాలో లావుగా ఉన్నావన్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో పడిపోతారు అవతలివాళ్లు. ఇంకొందరు నేరుగా విమర్శించడమే పనిగా మానసిక దాడికి పాల్పడతారు. ‘నీ దుస్తుల ఎంపిక ఏమీ బాగోదనో, లావుగా ఉండీ జంక్‌ ఫుడ్‌ తింటున్నా’వనో ఒకటికి నాలుగు సార్లు అంటూ ఉంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అంటే అన్నారులే అని పట్టించుకోకుండా వదిలేయడం అందరికీ సాధ్యం కాదు. దాంతో తామేదో తప్పు చేసినట్లు బాధపడుతూ లోలోపల కుంగిపోతారు. ఎదుటివాళ్లకు కావాల్సిందీ అదే. అలా కుంగిపోయి ఆత్మన్యూనతతో బాధపడేవాళ్లను చూసి వాళ్ల అహం తృప్తిపడుతుంది. ఎవరు ఏ ఉద్దేశంతో ఎలా చెప్పినా దాన్ని ఎదుర్కొనేవారి మనఃస్థితిని బట్టే సమస్య తీవ్రత ఉంటుంది.

ఎలా?
మనకి ఏం బాగుంటాయో, ఏవి బాగుండవో, ఎలా ఉంటే అందంగా ఉంటామో... సన్నిహితులు చెప్పినప్పుడు వాటిని సలహాలుగానే తీసుకుని నచ్చిన మార్పులు చేసుకుని ముందుకు సాగిపోతే సమస్యే ఉండదు. కానీ ‘నేను నల్లగా ఉన్నాననే కదా అలా అన్నారు, లావుగా ఉన్నాననే కదా, పొట్టిగా ఉన్నాననే కదా...’ ఇలాంటి ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడిక అవే మాటలు మళ్లీ మళ్లీ చెవుల్లో విన్పిస్తుంటాయి. నిత్యం అలాంటి మాటలు ఇంట్లోనే సొంత వ్యక్తుల నుంచే వినిపిస్తుంటే అది ఇంకా దుర్భరం. ఆత్మన్యూనతతో దీర్ఘకాలం ఇలా లోలోపల మధనపడడం వల్ల వారిలో రకరకాల శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతున్నాయంటున్నారు నిపుణులు.
* సమస్యని ఎలా ఎదుర్కోవాలో తెలీక తమను తాము శిక్షించుకుంటారు. తిండి తినరు, నిద్ర పోరు. తీవ్రఒత్తిడికి లోనవుతారు.
* తమ శరీరాన్ని తామే అసహ్యించుకుంటారు. తమ నైపుణ్యాల్నీ శక్తిసామర్థ్యాల్నీ మర్చిపోయి శరీరం గురించే బాధపడతారు. క్రమంగా తమ మీద తామే నమ్మకం కోల్పోతారు. ఫలితంగా చదువులో, ఉద్యోగాల్లో, క్రీడల్లో... వైఫల్యాలను ఎదుర్కొంటారు.  
* చిన్నప్పటి నుంచీ బాడీ షేమింగ్‌కి గురైన వారు జీవితంలో ఏదో ఒక దశలో కుంగుబాటుకు లోనయ్యే అవకాశాలు ఎక్కువ.
* ఈ సమస్య ఈటింగ్‌ డిజార్డర్లకు దారితీస్తుంది. అతిగా తినడం, అసలు తినకపోవడం, జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తినడం లాంటివి చేస్తుంటారు. మద్యం, డ్రగ్స్‌లాంటి వ్యసనాలకు అలవాటు పడడానికి ఇదీ ఒక కారణం.
* ఆత్మన్యూనతతో బాధపడేవారికి మొత్తంగా ఆరోగ్యం బాగా దెబ్బతింటుందనీ, మధుమేహం, గుండెజబ్బులు, స్ట్రోక్‌ లాంటివి వచ్చే ప్రమాదం మూడు రెట్లు ఎక్కువనీ అధ్యయనాల్లో తేలింది.
* జీవితం పట్ల అసంతృప్తీ, అసహనం పేరుకుపోతాయి. ఎవరితోనూ కలవలేరు. ఒంటరితనాన్ని ఇష్టపడతారు.
* సమస్య అలాగే కొనసాగితే దీర్ఘకాలంలో పానిక్‌ అటాక్స్‌ వస్తాయి, ఆత్మహత్యలకూ దారి తీయవచ్చు.

ఎదుర్కొనే మార్గం లేదా?
బాడీ షేమింగ్‌కి పాల్పడేవాళ్లు ఇంట్లోనూ, బయటా, సోషల్‌మీడియాలో... చాలామంది ఉంటారు. వాళ్లందరినీ మార్చడం సాధ్యం కాదు కాబట్టి ఎవరికివారే తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. ‘విమర్శించేవారి మాటలకు ఒకసారి విలువ ఇవ్వడం మొదలుపెడితే ఇక ఆ తర్వాత మనశ్శాంతి అనేదే ఉండదు. లావుగా ఉంటే సన్నబడమంటారు.
సన్నబడితే ‘అలా చిక్కిపోయావేంటీ... ఆరోగ్యం బాగాలేదా, డాక్టరు దగ్గరికి వెళ్లు’ అని సలహా ఇస్తారు. కాబట్టి ఎవరికి వారు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి కానీ ఇతరుల కామెంట్లను కాదు. ఎవరో అన్నారని కాకుండా, తమకి ఏం కావాలో నిర్ణయించుకుని తగిన విధంగా నడచుకోవడం ఉత్తమం’ అంటారు మనస్తత్వ నిపుణులు. సమస్యని ఎదుర్కొనే విషయంలో వాళ్లు చెబుతున్న సూచనలు కొన్ని...

* ర్యాగింగ్‌, ఈవ్‌ టీజింగ్‌లాగే బాడీ షేమింగ్‌ కూడా ఒకరకమైన వేధింపు. దానికి భయపడకూడదు, లొంగిపోకూడదు. ఎవరికి చేతనైన పద్ధతిలో వారు ఎదుర్కోవాలి.
* అసలు విననట్టే ఉండడం ఉత్తమం. ఆ మాట మనని కాదనుకోవాలి.
* ఎందుకలా అన్నావని పోట్లాడకూడదు, వాదించకూడదు. అలా ఉండడానికి కారణాలను వివరించే ప్రయత్నమూ చేయొద్దు.
* వీలైతే ఎదురు ప్రశ్నించాలి. ‘నా రూపం సంగతి ఎందుకు ఇప్పుడు. అది అంత చర్చించాల్సిన విషయమా, నా పనికీ రూపానికీ సంబంధం లేదు కదా-’అని అడగాలి.
* ఇంకా గట్టిగా సమాధానం చెప్పాలనుకుంటే- ‘నాకు చెబితే చెప్పారు కానీ ఇంకెప్పుడూ ఎవరికీ ఇలా చెప్పకండి, అందరూ నాలాగా విని ఊరుకోరు. ఎదురు తిరిగి మీ లోపాలను ఎత్తి చూపితే బాధపడాల్సి వస్తుంది’ అనొచ్చు.  
* ముందుగా... అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరికి వారు తమను తాము విమర్శించుకోవడం మానాలి. ‘నేనెంత లావుగా ఉన్నాను, ఈ నల్లటి మొహానికి ఏ రంగైతే ఏముందిలే...’ లాంటి వ్యాఖ్యలు మానెయ్యాలి. శరీరాన్ని
ఉన్నది ఉన్నట్లుగా ప్రేమించడం నేర్చుకోవాలి. దాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి.


‘బాడీ పాజిటివిటీ’ అంటే అదేనా?
అవును. బాడీ షేమింగ్‌ని ఎదుర్కొనడానికి మానసిక నిపుణులు ప్రోత్సహిస్తున్న విధానం ఇది. బాడీ షేమింగ్‌ సమస్య టీనేజర్లూ యువతీ యువకులదేనన్న అపోహ చాలామందిలో ఉంది. నిజానికి దీనికి వయసుతో సంబంధం లేదనీ యాభైల్లో అరవైల్లో కూడా ఈ సమస్య పర్యవసానాన్ని అనుభవిస్తూ చికిత్స పొందుతున్న వాళ్లు ఉన్నారనీ నిపుణులు అంటున్నారు.
వాస్తవానికి, వంకలు పెట్టడానికి లేని పర్ఫెక్ట్‌ రూపం అంటూ ఎవరికీ ఉండదు. కాకపోయినా, పుట్టుకతో వచ్చే రూపాన్ని మార్చుకోవడమూ అసాధ్యం. అటువంటప్పుడు ఎవరితోనో పోల్చుకోవడం, జీరో సైజ్‌ అనీ, సిక్స్‌ ప్యాక్‌ అనీ శరీరాన్ని కష్టపెట్టడం... లేని సమస్యల్ని కొనితెచ్చుకోవడమే అవుతుంది. ఇప్పుడిప్పుడే ఈ విషయం పట్ల అవగాహన పెరుగుతోంది. లండన్‌ నగరంలో బాడీ షేమింగ్‌ అర్థం వచ్చే ప్రకటనలను నిషేధించారు అక్కడి మేయర్‌. దేశమంతటా దీన్ని అమలుచేసే విషయమూ అక్కడ పరిశీలనలో ఉంది. సోషల్‌మీడియా ఆప్స్‌ కూడా కొన్ని ఇలాంటి ప్రకటనలను నిషేధించాయి.
అయితే అది మాత్రమే సరిపోదనీ సమాజంలో మార్పు రావాలంటే- అందరి ఆలోచనలూ మారాలనీ చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే - ఈ సృష్టిలో ప్రతిపండూ పువ్వూ పక్షీ పశువూ దేనికదే ప్రత్యేకం. ఒకటి ఘనమూ కాదు, ఒకటి హీనమూ కాదు. మనుషులైనా అంతే. రంగులోనూ రూపంలోనూ ఎవరికి వారే విలక్షణం. ఒకరు ఎక్కువా కాదు, ఒకరు తక్కువా కాదు. ఆ విషయాన్ని అందరూ గుర్తిస్తే... వివేకంతో ప్రవర్తిస్తే... బాడీ షేమింగ్‌తో బాధపెట్టేవారూ ఉండరు, ఆ మాటలకు నొచ్చుకునేవారూ ఉండరు.


బాధితులూ... బాధపెడతారు!

సాధారణంగా ఒక సమస్యకి బాధితులైనవారు అలాంటి బాధ మరొకరికి కలిగించరు. కానీ బాడీ షేమింగ్‌ విషయంలో మాత్రం ఒకప్పుడు బాధపడ్డామని చెప్పినవారిలో 32 శాతం తామూ బాడీ షేమింగ్‌కి పాల్పడ్డామని ఒప్పుకున్నారు. ఈ విషయంలో జరిగిన అధ్యయనాలు పలు ఆసక్తికర అంశాలను వెల్లడించాయి.
* సమాజం మన రూపం గురించి ఏమనుకుంటుందోనన్న ఆందోళనా, తప్పుగా అర్థం చేసుకుంటుందేమోనన్న భయమూ... స్త్రీ పురుషులిద్దరిలోనూ సమానంగా ఉంటుందని తేల్చింది ఒక అధ్యయనం.
* ఒక అధ్యయనంలో పాల్గొన్న మహిళల్లో 70 శాతం బాడీ షేమింగ్‌ మహిళలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య అని చెప్పగా, 60 శాతం తాము స్వయంగా అనుభవించామని చెప్పారు.
* టీనేజ్‌ పిల్లల్ని ఈ సమస్య తీవ్రంగా ఇబ్బంది పెడుతోందట. కుటుంబసభ్యులూ, సన్నిహితులూ, స్కూళ్లూ కాలేజీల్లో స్నేహితులే దానికి కారణమని ఒక అధ్యయనంలో తేలింది. దానివల్ల ఎదురవుతున్న ఒత్తిడి వారి ఆహారపుటలవాట్లను ప్రభావితం చేయడమే కాక అది ఆరోగ్య సమస్యగా మారి వారిని జీవితకాలం వెంటాడుతోందనీ తల్లిదండ్రులు పిల్లలతో జాగ్రత్తగా మాట్లాడాలనీ అంటున్నారు పరిశోధకులు.
* సినిమాలూ సాహిత్యం కూడా అందానికి రకరకాల నిర్వచనాలను ఇస్తూ తప్పుదారి పట్టిస్తుంటాయి. పిల్లల సినిమాలూ కార్టూన్లపై జరిగిన ఒక అధ్యయనంలో బాడీ షేమింగ్‌ విషయంలో రెండు డిస్నీ సినిమాలు మొదటి స్థానంలో నిలిచాయి. సన్నగా ఉంటేనే అందంగా ఉన్నట్లని అర్థం వచ్చేలా వీటిల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పదుల సార్లు ప్రస్తావించారట. 64 శాతం వీడియోల్లో లావుగా ఉన్నవారిని వికృతంగా, చెడ్డవారిగా చూపించారట.


సెలెబ్రిటీలకు మరీ ఎక్కువ..!

సినిమా, క్రీడారంగాలకు చెందిన సెలెబ్రిటీలకు బాడీ షేమింగ్‌ సమస్య మరీ ఎక్కువ. సెరెనా నుంచి సానియా వరకూ సామాజిక మాధ్యమాల్లోనూ బయటా కూడా బాడీ షేమింగ్‌కు గురికాని క్రీడాకారిణులు లేరు. క్రీడాకారులకు శరీరమే మొదటి ఆయుధం. తమ నైపుణ్యాలకు శారీరక సామర్థ్యం తోడైతేనే ఆటల్లో రాణించగలరు. అలాంటిది వారి శరీరం గురించి వ్యాఖ్యానించడం చాలా ఎక్కువగా కన్పిస్తుంది. అక్కాచెల్లెళ్లైన వీనస్‌, సెరెనాలను ‘ద విలియం బ్రదర్స్‌’ అని వ్యాఖ్యానించినందుకు రష్యన్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు షమిల్‌ టర్పిశ్చెవ్‌ దాదాపు 20 లక్షల రూపాయల ఫైన్‌ కట్టాల్సి వచ్చింది. వాళ్లు పవర్‌ఫుల్‌గా ఆడుతున్నారన్నది అతడి ఉద్దేశం కావచ్చు. కానీ మహిళలను మగవాళ్లతో పోల్చడం ‘బాడీ షేమింగ్‌’లో భాగమే. మన దేశంలో అయితే మిథాలీ రాజ్‌, సానియా మిర్జా, జ్వాలా గుత్తా తదితరులందరూ దుస్తుల విషయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఆటల్లో ప్రతిభ వల్లే సెలెబ్రిటీలైన వీళ్లను ఆట గురించి వదిలేసి దుస్తులూ మేకప్‌ లాంటి వాటి గురించి సామాజిక మాధ్యమాల్లో ట్రోల్‌ చేశారు. ‘నా బరువైతే జాతీయ సమస్యే అయిపోయింది’ అంటారు సినీనటి విద్యాబాలన్‌. హార్మోన్ల సమస్యతో బాధపడుతున్న ఆమె లావైనందుకు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌ గెలుచుకున్న హర్నాజ్‌ సంధుకి కూడా ఆ బాధ తప్పలేదు. అరుదైన జబ్బుతో బాధపడుతున్న ఆమె ఒక ఫ్యాషన్‌ షోలో పాల్గొన్న ఫొటోని పంచుకుంటే కింద వచ్చిన కామెంట్లలో నూటికి డెబ్భై ఆమె బరువు పెరగడం గురించే. అయితే ఒకప్పటిలా అలాంటివారిని చూసీ చూడనట్లు వదిలేయడం లేదిప్పుడు. బాధితులే కాకుండా ఇతరులు కూడా ప్రశ్నిస్తున్నారు, ఎదురు తిరుగుతున్నారు... ఇది మంచి పరిణామం- అంటున్నారు మనస్తత్వనిపుణులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..