ప్రతిభ ఘనం.. అవార్డులు సలాం!

చిత్రకారుడు.. శిల్ఫి..సంప్రదాయ నృత్యకారుడు.. సూక్ష్మ నమూనా కళాకారుడు... పర్యావరణ ప్రేమికుడు.. సమాజ సేవకుడు... 31 ఏళ్ల యువకుడిలో ఇన్ని కోణాలుండటం మామూలు విషయమేం కాదు... అంత ప్రతిభావంతుడు గనకే అతడిని ప్రపంచ రికార్డులు వరించాయి..

Published : 07 Nov 2020 01:16 IST

చిత్రకారుడు.. శిల్ఫి..సంప్రదాయ నృత్యకారుడు.. సూక్ష్మ నమూనా కళాకారుడు... పర్యావరణ ప్రేమికుడు.. సమాజ సేవకుడు... 31 ఏళ్ల యువకుడిలో ఇన్ని కోణాలుండటం మామూలు విషయమేం కాదు... అంత ప్రతిభావంతుడు గనకే అతడిని ప్రపంచ రికార్డులు వరించాయి.. పలు అంతర్జాతీయ అవార్డులు అందాయి... ప్రముఖుల మెచ్చుకోళ్లు దక్కాయి... తాజాగా బంగ్లాదేశ్‌ నుంచి స్వప్నో యూత్‌ లీడర్‌షిప్‌ పురస్కారం అందుకున్న ఆ ధర్మవరం కుర్రాడే ఎం.ఆర్‌.శ్రీనివాసులు... తన ప్రస్థానం యువతకు స్ఫూర్తిదాయకం.

శ్రీనివాసులుది అనంతపురం జిల్లా ధర్మవరం. చిన్నప్పుడు పెళ్లి కార్డులు, కార్డ్‌బోర్డ్‌లతో సరదాగా ఇళ్లు, సినిమా హాళ్లు, భవనాలు తయారు చేసేవాడు. పెద్దయ్యాక ఆర్కిటెక్ట్‌ కావాలనుకున్నాడు. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు స్నేహితుల దగ్గర ఖాళీ పెన్‌ రీఫిల్స్‌ని సేకరించేవాడు. కొన్నేళ్లకు అవి గుట్టలకొద్దీ పేరుకుపోయాయి. కార్డులతో చేసినట్టు వీటిని మినియేచర్‌ ఆర్ట్‌కి ఎందుకు ఉపయోగించకూడదు అనుకున్నాడు. అదే లక్ష్యంతో 2007లో ఎనిమిది నెలలు కష్టపడి ఈఫిల్‌ టవర్‌ తయారు చేశాడు. తర్వాత లండన్‌ బిగ్‌ బెన్‌, సిడ్నీ బ్రిడ్జ్‌, గేట్‌ వే ఆఫ్‌ ఇండియా, చార్మినార్‌, తాజ్‌మహల్‌, ఇటలీ పీసా టవర్‌, అమృత్‌సర్‌ స్వర్ణదేవాలయం.. ఇలా పది సూక్ష్మ కళాకృతులు రూపొందించాడు. ఒక్కో నమూనా తయారీకి ఏడాది నుంచి మూడేళ్ల సమయం పడుతుంది. శ్రీనివాసులు పని ప్రారంభించడానికి ముందే నమూనా కట్టడాన్ని ఆన్‌లైన్‌లో నిశితంగా పరిశీలిస్తాడు. వీలైతే ప్రత్యక్షంగా వెళ్లి చూసొస్తాడు. తర్వాత ప్లాన్‌ గీసుకోవడం, కొలతలు తీసుకోవడం, రీఫిల్స్‌ని కట్‌ చేయడం, చివరగా నమూనా కట్టడం తయారు చేయడం. ఈ క్రమంలో ఎక్కడా యంత్రాలు వాడకుండా మొత్తం చేతితోనే రూపొందిస్తాడు. రీఫిల్స్‌తోపాటు కాగితం, జిగురు మాత్రమే వాడతాడు.

ఇతర కళల్లోనూ

మినియేచర్‌ కళతోపాటు ఇతర కళల్లోనూ శ్రీనివాసులు దిట్ట. ఆరోతరగతిలో టీచరుగా ఉన్న డ్యాన్స్‌ మాస్టర్‌ దగ్గర శిష్యరికం మొదలుపెట్టాడు. ఎనిమిదేళ్లలో భరతనాట్యం, కూచిపూడి, యక్షగానం, జానపద నృత్యం నేర్చుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో యాభైవరకు ప్రదర్శనలు ఇచ్చాడు. కొన్నిసార్లు సొంతంగా డాన్స్‌ కంపోజ్‌ చేసుకొని వెళ్లి ప్రదర్శనలు ఇస్తుంటాడు. వీటితోపాటు చాక్‌పీసులపై బొమ్మలు చెక్కుతాడు. పెన్సిళ్లు, రంగులతో చిత్రాలు వేస్తాడు. వీటిని సైతం పలు వేదికలపై ప్రదర్శించాడు.

పర్యావరణహితుడిగా..

ఆసక్తి, ఇష్టంతో అరుదైన కళపై పట్టు సాధించిన శ్రీనివాసులు తన ప్రవృత్తిని సమాజహితానికి మార్గంగా మలుస్తున్నాడు. పర్యావరణహితంపై స్కూళ్లు, కాలేజీల్లో తరచూ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాడు. ‘సే నో టు ప్లాస్టిక్‌’ నినాదంతో ప్లాస్టిక్‌ వ్యర్థాలను తిరిగి ఎలా ఉపయోగించాలి? వాటిని ఎలా విభజించాలో పిల్లలకు బోధిస్తున్నాడు. గ్లోబల్‌ వార్మింగ్‌పై ప్రచారం చేస్తున్నాడు. పెన్‌ రీఫిల్స్‌తో కళాఖండాలు సృష్టించడమే కాదు.. ఈ ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైకిల్‌ చేసి ఇటుకలు, ఫుట్‌పాత్‌ బ్లాక్స్‌ తయారు చేసేలా పరిశోధనలు చేస్తున్నాడు. దీనికోసం మైసూరులోని సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌ సంస్థ సాయం తీసుకుంటున్నాడు. శ్రీనివాసులుకి విదేశాల్లోనూ అభిమానులున్నారు. చైనా, జపాన్‌లలోని కొందరు విద్యార్థులు ఖాళీ రీఫిల్స్‌ సేకరించి పంపుతున్నారు.

ప్రతిక్షణం ఆస్వాదిస్తూ

ఆర్కిటెక్ట్‌ కావాలనుకున్నా.. అప్పట్లో ఐటీ బూమ్‌ ఉండటంతో కుటుంబ ప్రోద్బలంతో బీటెక్‌లో చేరాడు శ్రీనివాసులు. ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఉద్యోగంతోపాటే సూక్ష్మ కళ, పర్యావరణహిత కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు వీటన్నింటికీ సమయం ఎలా కుదురుతుందని అడిగితే ‘రాత్రి తొమ్మిదిగంటలకల్లా ఆఫీసు నుంచి వచ్చేస్తాను. పది తర్వాత నా పని మొదలవుతుంది. మినియేచర్‌ వర్క్‌, నృత్య సాధన, వర్క్‌షాప్‌లకు సిద్ధమవడం... తెల్లవారుజామున రెండువరకు కొనసాగిస్తాను. సెలవు, వారాంతాల్లో నా ప్రదర్శనలు, కార్యక్రమాలు ఉండేలా చూసుకుంటాను’ అంటూ తన షెడ్యూల్‌ వివరిస్తాడు. పదేళ్ల నుంచి ఇదే దినచర్య. చేసేపని ఇష్టమైతే ఏదీ కష్టం కాదంటాడు.

అంతర్జాతీయ గుర్తింపు

ఈ బహుముఖ ప్రతిభావంతుడికి ఘనమైన గుర్తింపే దక్కింది. పదికిపైగా అంతర్జాతీయ అవార్డులు, పురస్కారాలు అందుకున్నాడు. అత్యధిక ఖాళీ పెన్‌ రీఫిల్స్‌ ఉపయోగించి చేసిన సూక్ష్మ కళాఖండాలతో ప్రపంచ రికార్డులు సృష్టించాడు. వీటిని ఇటలీలోని లియోనార్డో డావిన్సీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మ్యూజియంలో ప్రదర్శించాడు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ షోకి ప్రపంచవ్యాప్తంగా 40మంది కళాకారులు మాత్రమే ఎంపికయ్యారు. ఇండియా నుంచి అ అరుదైన అవకాశం దక్కించుకున్న ఒకే ఒక్కడు తను. పర్యావరణానికి చేస్తున్న సేవలకుగానూ బంగ్లాదేశ్‌లోని ఢాకా యూనివర్సిటీ నుంచి ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో ‘స్వప్నో యూత్‌ లీడర్‌షిప్‌’ అవార్డు అందుకున్నాడు. ఆల్బర్ట్‌ బేట్స్‌ అనే ప్రముఖ అమెరికన్‌ రచయిత రాసిన పుస్తకంలో ‘ట్రాన్స్‌ఫామింగ్‌ ప్లాస్టిక్‌: ఫ్రం పొల్యూషన్‌ టు ఎవల్యూషన్‌’ పేరుతో శ్రీనివాసులు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గూగుల్‌ అనుబంధ ‘ప్రాజెక్ట్‌ గూగుల్‌ బుక్స్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌’ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కళాకారుల ఆర్ట్‌వర్క్‌ని భావి తరాల కోసం డిజిటల్‌ రూపంలో భద్రపరుస్తోంది. శ్రీనివాసులు మినియేచర్‌ ఆర్ట్‌ని సైతం ఆర్కైవ్స్‌లో చేర్చారు. దేశవ్యాప్తంగా దక్కిన గుర్తింపూ ఎక్కువే. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో ఆహ్వానాలు అందుతున్నాయి. 2016లో మైసూరులో జరిగిన ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో ప్రదర్శన ఏర్పాటు చేసినప్పుడు ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని