NO చెప్పే దమ్ముందా?

‘నో’.. చిన్నమాటే. అవసరానికి ఈ ఆయుధం ప్రయోగించకపోతే, జీవితంలో కొన్నిసార్లు ఓటమి తప్పదు. కుర్రకారైతే మొహమాటాన్ని పక్కన పెట్టేయాల్సిందే. కాదు, కూడదని చెప్పలేని అశక్తతే ఎక్కువమందిని చెడు సావాసాల.....

Updated : 20 Nov 2021 01:22 IST

ఎఫ్‌బీలో పరిచయమైన అబ్బాయి.. ‘డేట్‌’కి పిలిచాడు. మొహమాటంకొద్దీ వెళ్లిందా అమ్మాయి. అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

- హైదరాబాద్‌లో ఘటన.

‘మామా.. మంచి కిక్‌ వస్తుంది ఒక్కసారి హుక్కా సెంటర్‌కి రారా’ ఫ్రెండ్‌ బలవంతపెట్టాడు. వద్దంటూనే వెళ్లాడు. ఆ మత్తుకి బానిసైపోయాడు.

- ఓ కార్పొరేట్‌ కాలేజీ విద్యార్థి గాథ.

ఇలాంటివి ఈమధ్య కోకొల్లలు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ‘నో’ చెప్పలేక చిక్కుల్లో పడుతూనే ఉంటారు. అందుకే ఇష్టంలేని పని చేయాల్సి వస్తే జిగిరీ దోస్త్‌కైనా ‘నో’ చెప్పే దమ్ముండాలంటారు పెద్దలు. ముఖ్యంగా జీవితం కీలక దశలో ఉండే యువతకు ఇది మరీ అవసరం.

‘నో’.. చిన్నమాటే. అవసరానికి ఈ ఆయుధం ప్రయోగించకపోతే, జీవితంలో కొన్నిసార్లు ఓటమి తప్పదు. కుర్రకారైతే మొహమాటాన్ని పక్కన పెట్టేయాల్సిందే. కాదు, కూడదని చెప్పలేని అశక్తతే ఎక్కువమందిని చెడు సావాసాల బాట పట్టిస్తాయంటున్నాయి అధ్యయనాలు. ‘ది ఇంటర్‌-అమెరికన్‌ డ్రగ్‌ అబ్యూజ్‌ కంట్రోల్‌ కమిషన్‌’ నివేదిక ప్రకారం డ్రగ్స్‌, మత్తు పదార్థాలకు బానిసలైన వాళ్లలో అరవై శాతం మంది స్నేహితుల బలవంతంకొద్దీ, మొహమాటంతో మొదటిసారి వీటి ‘రుచి’ చూశారట. చెడు అలవాట్లే కాదు.. చాలా సందర్భాల్లో నో చెప్పకపోతే చిన్నచిన్న విషయాలే, పెద్ద చికాకుగా మారతాయి. కొలీగ్‌ కోసం అదనపు పని తలకెత్తుకోవడం, ఫ్రెండ్‌ మాట కాదనలేక పార్టీలకెళ్లడం, స్నేహం కోసం అప్పు చేసి మరీ డబ్బులివ్వడం.. ఇలాంటివెన్నో మనశ్శాంతి లేకుండా చేస్తాయి.

ఎందుకలా?
‘నో’ చెప్పాల్సిన సందర్భంలో.. ఎందుకలా చేయలేకపోతున్నారంటే అత్యధికుల సమాధానం ‘ఎదుటివాళ్లు హర్ట్‌ అవుతారని’. కానీ స్నేహం పలుచనవుతుందనో, బంధం బలహీనపడుతుందనో ఆలోచిస్తూ కూర్చుంటే ఏరికోరి ఇబ్బందుల్లో పడిపోతున్నట్టే. కాలేజీ, ఆఫీసు, ఇరుగుపొరుగులకు చిన్నచిన్న పనులు చేసిపెట్టడం, సామాజిక మాధ్యమాల్లో చిట్‌చాట్‌.. వరకైతే ఫర్వాలేదుగానీ విలువైన సమయాన్ని తినేసే పనులు, దీర్ఘకాలంలో మనపై ప్రతికూల ప్రభావం చూపే అలవాట్లు, డబ్బులు ఖర్చయ్యే వ్యవహారాలకైతే నిర్మొహమాటంగా ‘నో’ చెప్పాల్సిందే. అవతలివాళ్ల గురించి అతిగా ఆలోచించే మనస్తత్వం మీదైతే నొప్పింపక, తానొవ్వక చందంగా చెబితే సరి. నిజానికి నో చెప్పడం అమర్యాదకర విషయమేం కాదు. అవతలివాళ్లని వద్దు అన్నామంటే ఉన్నఫళంగా మనమేం స్వార్థపరులం అయిపోం. ఒక్కముక్కలో వద్దనడం భావ్యం కాదనిపిస్తే వివరణ ఇచ్చినా తప్పేం లేదు. ఉదాహరణకు కాలేజీ బంక్‌ కొడదామనో, సినిమాకెళ్దామనో ఓ ఫ్రెండ్‌ చెబుతుంటాడు. సింపుల్‌గా నో చెప్పి తన మనసు గాయపరచడం ఇష్టం లేదనుకుంటే.. మనం చేయబోయే దానివల్ల కలిగే అనర్థాలు ఏంటో విడమరిచి చెప్పాలి. అలా చేయడం ఎందుకు ఇష్టంలేదో వివరించాలి. మొత్తానికి కొన్ని సందర్భాల్లో ‘నో’ అని చెప్పడానికి మనం ‘ఎస్‌’ అని చెప్పడం అలవాటు చేసుకోవాలి. మన మొహమాటాన్ని పసిగట్టి మనసులతో గేమ్స్‌ ఆడేవాళ్లుంటారనీ మరవొద్దు.

నొప్పింపక...

* ఫుల్‌ బిజీగా ఉన్నా మామా.. మరోరోజు పార్టీకి వెళ్దాంలే...

* నా గురించి ఆలోచిస్తున్నందుకు సంతోషం. అయినా నీవు అడిగింది చేయలేకపోతున్నందుకు సారీ.

* నాకు ‘నో’ చెప్పాలని లేదు. కానీ అది తప్ప నాకు వేరే అవకాశం లేదండీ!

* నీ పని చేసిపెట్టాలనే ఉంది. కానీ నాకే చేతినిండా పని ఉంది.

* చివరిసారి బాగా ఎంజాయ్‌ చేశాం. ఈసారి మాత్రం కుదిరేలా లేదురా.

* వావ్‌.. మీ ఆఫర్‌కి ధన్యవాదాలు. కానీ ప్రస్తుతానికి ఇది అనవసరం అనిపిస్తోంది.

* అర్జెంటుగా ఊరెళ్లాల్సి వచ్చింది. ఏమనుకోకు గురూ!

* నువ్వు చెబుతోంది నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. అందుకే నేను రాలేకపోతున్నా.

* డబ్బులు ఇవ్వాలనే ఉంది. కానీ ఈ నెలే అనుకోని ఖర్చులు వచ్చిపడ్డాయి.

* ఆఫీసులో త్వరగా ముగించాల్సిన పని ఉంది. నేను రాలేను బాస్‌.

* అర్రే.. నువ్వు వెళ్దామన్న సమయానికే, మా ఇంటికి బంధువులొస్తానన్నారు.


వెనకబడిపోయా

‘మసాన్‌’ హిట్‌ తర్వాత నాకు మంచి పేరొచ్చింది. పెద్ద బ్యానర్ల నుంచి అవకాశాలొచ్చాయి. ఈలోపే నాతోపాటు కలిసి సినిమా ప్రయాణం మొదలు పెట్టిన స్నేహితులు కథలతో వచ్చారు. ‘నువ్వు నిలదొక్కుకున్నావ్‌ కదా.. మాకు దర్శకత్వం అవకాశం ఇవ్వ’మన్నారు. కాదనలేకపోయా. మొహమాటంకొద్దీ వాళ్ల సినిమాలు ఒప్పుకున్నా. కథలు బాగా లేకున్నా రాజీ పడ్డా. ఫ్లాప్‌లు పడ్డాయి. వెనకబడిపోయా.                  

- విక్కీ కౌశల్‌, బాలీవుడ్‌ నటుడు


రెండేళ్ల ఆలస్యం

2003లో ‘టెస్లా’లో చేరకముందే నా మదిలో ఎలక్ట్రిక్‌ కారు ఆలోచన ఉంది. కంపెనీలో అడుగుపెడుతూనే వ్యవస్థాపకులు మార్టిన్‌ ఎబర్‌హార్డ్‌, మార్క్‌ థార్పెనింగ్‌లతో విషయం చెప్పా. ముందు సంస్థని టెక్నాలజీ కంపెనీగా నిలబెడదాం. ఐటీ రంగంలో విస్తరిద్దాం అన్నారు. సీనియర్లకు ‘నో’ చెప్పలేకపోయా. అప్పుడే నా మొహమాటం పక్కనపెడితే రెండేళ్ల ముందే విద్యుత్తు కారుని ఈ ప్రపంచం చూడగలిగేది.                  

- ఎలన్‌ మస్క్‌, టెస్లా అధినేత


నో చెప్పి గెలిచా..

న్నవాళ్లంటే నాకు ప్రాణం. ఎప్పుడు వాళ్ల మాట కాదనలేదు. పన్నెండేళ్లప్పుడు వెయిట్‌లిఫ్టింగ్‌ కెరీర్‌ ఎంచుకుంటానని చెప్పా. నా బలమేంటో వాళ్లకి తెలుసు. అయినా అమ్మాయివి కదా.. క్రికెట్‌ లేదా టెన్నిస్‌ వైపు వెళ్లు అన్నారు. నేను స్పష్టంగా నో చెప్పా. తర్వాత నా ఇష్టాన్ని ఒప్పుకున్నారు. ఆపై ఏం జరిగిందో మీకు తెలిసిందే..  

- మీరాబాయ్‌ చాను, ఒలింలిక్‌ మెడలిస్ట్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని