Updated : 28/03/2020 05:54 IST

అవమానాలే అందెల రవళిగా..

థింక్‌ డిఫరెంట్‌

ఇప్పటి జెన్‌-జీ ఇష్టాలేంటంటే? స్టేజ్‌పై ఇష్టమైన హీరో డ్యాన్స్‌లు.. టిక్‌టాక్‌ వీడియోలు.. ర్యాప్‌ మ్యూజిక్‌లు.. వీటికి భిన్నంగా ఎవరైనా ఆలోచిస్తే! అడుగు ముందుకేస్తే.. కాస్త తేడాగా చూస్తారు.. మాట్లాడతారు. ఇలాంటి పరిస్థితే రఘునాథ్‌ది.. కూచిపూడి నృత్యం నాకు ఇష్టం అంటే.. నువ్వేమైనా అమ్మాయివా అన్నారు.. అది అబ్బాయిల డ్యాన్స్‌ కాదన్నారు.. ఒకవేళ నువ్వు ఇష్టపడి సాధన చేస్తే అమ్మాయిలా మారిపోతావ్‌ అని భయపెట్టారు.. చివరికి కొడుకు ఏమవుతాడో అని భయపడిన  తల్లి కూడా తన ఇష్టానికి నో చెప్పింది. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా.. హేళన చేసినా రఘనాథ్‌ అడుగులు కూచిపూడి వైపే నడిచాయి.. తన ఎనిమిదో ఏటలోనే పరిచయమైన నృత్య కళ తనతో పాటే పెరిగి జాతీయ స్థాయిలో ప్రదర్శనలిచ్చే వరకూ తీసుకెళ్లింది.
రఘునాథ్‌ది కర్నూలు. సెయింట్‌ జోసెఫ్‌ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇంటికి సమీపంలోనే ఓ కూచిపూడి నృత్యకారుడి అకాడమీ ఉంది. అక్కడ నృత్యం చేస్తున్నవారిని చూసి ఆకర్షితుడయ్యాడు. తల్లికి కూడా స్వతహాగా నాట్యంపై అభిరుచి ఉండటంతో తనను ఎనిమిదో ఏటనే అకాడమీలో చేర్పించారు. కానీ చుట్టు పక్కల వారి మాటలకు ప్రభావితం అయ్యి ఏడాదిలోనే నాట్యం మాన్పించింది. కానీ, రఘనాథ్‌ పట్టుబట్టి మరీ ఇంట్లో వారిని ఒప్పించాడు. తల్లి ప్రోత్సాహంతో కూచిపూడిలో మంచి ప్రావీణ్యం సాధించాడు. మొదటగా రఘునాథ్‌ చదువుకునే కళాశాల వార్షికోత్సవంలో నృత్య ప్రదర్శన చేశాడు. ఆడవారిలా నాట్యం చేస్తే అమ్మాయేనేమో అనుకునేంతలా.. మగవాడిగా స్టేజ్‌ ఎక్కితే గొప్ప రాజసం కనబరుస్తాడు. దేశంలో పలు రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు. రఘునాథ్‌కు 2016లో ప్రభుత్వం నుంచి ‘నృత్యప్రియ’ అవార్డు సైతం వచ్చింది. సంప్రదాయ నాట్యాలు ఆడవాళ్లు చేసేవే కాదు. మగవారు కూడా చేస్తారని నిరూపించాడు. తన ప్రతిభను విమర్శించిన వారి చేతనే శభాష్‌ అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం అకాడమీలోని 180 మందికి ఆయన గురువుతో పాటు శిక్షణ ఇస్తున్నారు.


మూలాలు మరవొద్దు
- రఘనాథ్‌

పెరుగుతున్న నాగరికత మనల్ని తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలకు దగ్గర చేయాల్సిందిపోయి..  దూరంగా విసిరేస్తోంది. నేటి తరం తీరే ఇందుకు నిదర్శనం. పాశ్చత్య పోకడలకు అనుగుణంగానే బతికేస్తున్నాం. తెలుగు రాష్ట్ర కళ అయిన కూచిపూడి నాట్యంలో ప్రావీణ్యం సాధించడం గర్వంగా భావిస్తున్నా. నేటి యువత సంప్రదాయ నృత్యాల్ని నామోషీగా భావించి వాటిని నేర్చుకోవడానికి అనాసక్తి కనబరుస్తున్నారు.  ఇది మంచి పరిణామం కాదు. నావంతుగా మా గురువు సహకారంతో  డ్యాన్స్‌ మాస్టర్‌గా ఎదగాలనుకుంటున్నా. కూచిపూడి నృత్యానికి మరింత వైభవం తీసుకురావడానికి నావంతు కృషి చేస్తా.

- కాసాని కుమారస్వామి, ఈనాడు జర్నలిజం స్కూల్‌

Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని