నా భార్యా ఉండాలి.. నువ్వూ కావాలి

చిన్నప్పట్నుంచీ నేనో బంధువుల అమ్మాయిని ఇష్టపడ్డా. తనతోనే జీవితం అనుకున్నా. తన కోసం వేరే అమ్మాయిలతో మాట్లాడ్డమే మానేశా. డిగ్రీలో ఉండగా ఆమెకి పెళ్లి కుదిరింది.

Published : 21 Nov 2020 00:44 IST

చిన్నప్పట్నుంచీ నేనో బంధువుల అమ్మాయిని ఇష్టపడ్డా. తనతోనే జీవితం అనుకున్నా. తన కోసం వేరే అమ్మాయిలతో మాట్లాడ్డమే మానేశా. డిగ్రీలో ఉండగా ఆమెకి పెళ్లి కుదిరింది. తనపై చెప్పలేనంత ఇష్టం ఉందికానీ చెప్పుకోవడానికి నాకేం లేదుగా! తను పెళ్లి పీటలెక్కింది. నేను భగ్న ప్రేమికుడినయ్యా. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాన్నాళ్లే పట్టింది. జీవితంలో మరే అమ్మాయి జోలికి వెళ్లొద్దనుకున్నా.
చదువయ్యాక హైదరాబాద్‌ వచ్చి, ఒక కంపెనీలో ఉద్యోగం సంపాదించా. ఇక్కడ అమ్మాయిలు, అబ్బాయిలంతా సన్నిహితంగా ఉండేవాళ్లు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను స్వీటీతో మాట కలిపా.  అమ్మాయిల వంక కన్నెత్తి చూడకూడదనుకున్న నేను ఆ అమ్మాయి లేకుండా ఉండలేని స్థితికొచ్చా. ‘నువ్వంటే నాకిష్టమని నీకూ తెలుసు. ఓకే అంటే పెళ్లి చేసుకొని నీ జీవితాంతం తోడుండాలనుకుంటున్నా. ఏమంటావ్‌?’ అన్నానోరోజు. కొద్దిరోజులు సస్పెన్స్‌లో పెట్టి పచ్చజెండా ఊపింది. అప్పట్నుంచి తను నా గుండెల్లో ఉండేది. సినిమాలు, షాపింగ్‌, గుడి.. ఎక్కడికెళ్లినా పక్కనుండేది.
ఇరువురూ ఇష్టపడితే ప్రేమ ఫలిస్తుంది. పెళ్లితో ఒక్కటవ్వాలంటే మాత్రం చాలామంది ఆమోదం ఉండాలని అర్థమైంది. మావాళ్ల బ్లాక్‌మెయిలింగ్‌తో నేను వేరే అమ్మాయి మెడలో తాళి కట్టా. ఓ రకంగా చెప్పాలంటే స్వీటీని మోసం చేశా. ఆ ఉసురు తగిలిందేమో! చేసుకున్న అమ్మాయితో బాగోక, స్వీటీ జ్ఞాపకాలను చెరిపేసుకోలేక నరకం అనుభవించేవాణ్ని.
నా పెళ్లయ్యాక స్వీటీ ఉద్యోగం మానేసి ఊరెళ్లిపోయింది. కాంటాక్ట్‌ తెగిపోయింది. ఏళ్లు గడిచినా తన జాడలేదు. అయినా ఆమె జ్ఞాపకాలు నన్ను వీడలేదు. చివరికి ఒక కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా తన గురించి తెలిసింది. పేరెంట్స్‌ చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుందట. ఓ బాబు. పోనీలే.. తనైనా సంతోషంగా ఉందని అనుకునేలోపే ఆమె భర్త చనిపోయాడనే విషాద వార్త. మళ్లీ నాలో ఆలోచనలు రేగాయి. ఫ్రెండ్‌ దగ్గర స్వీటీ నెంబర్‌ తీసుకొని ఫోన్‌ కలిపా. నా గొంతు వినగానే కన్నీటి పర్యంతమైంది. ‘అమ్మానాన్నలు మళ్లీ పెళ్లి చేద్దామనుకుంటే రెండో సంబంధం వాళ్లే వస్తున్నారు. అయినా ఫర్వాలేదని ఒప్పుకుంటే వాళ్ల పిల్లల్ని చూడాలంటున్నారుగానీ నా బాబు అక్కర్లేదంటున్నారు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదుగా’ అంటూ ఏడ్చింది. నా మనసు కలుక్కుమంది. అప్పట్నుంచి నావల్లే తనకలా జరిగిందనే అపరాధభావంతో కుంగిపోతున్నా. బాగా ఆలోచించాక జరిగిన తప్పును నేనే సరిదిద్దుకోవాలనే నిర్ణయానికొచ్చా. అదేంటంటే.. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి, ప్రేమించిన అమ్మాయి ఒక్కటై, ఒకే మాట మీదకి వచ్చి ఇద్దరూ కలిసి ఉండేలా అందరినీ ఒప్పించాలనుకుంటున్నా. దీన్ని సమాజం హర్షించదని తెలుసు. కానీ నా భార్య కాళ్లావేళ్లా పడైనా ఒప్పించాలనుకుంటున్నా. స్వీటీ.. ఈ మాట నీతో నేరుగా చెప్పే ధైర్యం లేక ఇలా వ్యక్తం చేస్తున్నా. సానుకూలంగా స్పందిస్తావని ఆశిస్తున్నాను.

- వినాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని