కౌగిలి భాషే మాట్లాడు ప్రియా

అప్పుడు ఇంజినీరింగ్‌ సెకండియర్‌. స్నేహితులతో సరదాగా గడపటం.. వీలైతే కాలేజీకి డుమ్మా కొట్టి సినిమాలు, షికార్లకు వెళ్లడం.. ఇదే ప్రపంచం అనుకొని ఎంజాయ్‌ చేస్తున్న రోజులవి. అనుకోకుండా నా లోకంలోకి వచ్చింది ప్రియ. చిన్నప్పట్నుంచి పరిచయం ఉన్న అమ్మాయే అయినా వయసు పెరుగుతున్నకొద్దీ అందాల రాశిలా కనిపించేది. ఓరోజు బజారులో ఎదురుపడింది

Published : 05 Dec 2020 01:12 IST

అప్పుడు ఇంజినీరింగ్‌ సెకండియర్‌. స్నేహితులతో సరదాగా గడపటం.. వీలైతే కాలేజీకి డుమ్మా కొట్టి సినిమాలు, షికార్లకు వెళ్లడం.. ఇదే ప్రపంచం అనుకొని ఎంజాయ్‌ చేస్తున్న రోజులవి. అనుకోకుండా నా లోకంలోకి వచ్చింది ప్రియ. చిన్నప్పట్నుంచి పరిచయం ఉన్న అమ్మాయే అయినా వయసు పెరుగుతున్నకొద్దీ అందాల రాశిలా కనిపించేది. ఓరోజు బజారులో ఎదురుపడింది. ఎప్పటిలా తలొంచుకొని వెళ్లకుండా కొంటెచూపుల బాణం విసిరింది. అది నా గుండెకు పెద్ద గాయమే చేసింది. ఎవర్ని చూసినా, ఏ అమ్మాయి నవ్వినా తనే గుర్తొచ్చేంతలా ఆమె మైకంలో పడిపోయాను.
చాలారోజులు చూపులతోనే సాగింది మా ప్రేమాయణం. ఇది ప్రేమా? ఆకర్షణా? నాది వన్‌సైడ్‌ లవ్వా? తనకీ నేనంటే ఇష్టమేనా? ఇలా ఎన్నో సందేహాలు. కానీ ఓ సంఘటనతో తన మనసులో నాకూ చోటుందని రూఢీ చేసింది. ఓసారి ఎవరూ లేని సమయంలో వచ్చి గట్టిగా హత్తుకుంది. ‘మళ్లీ నేను నీకు కనిపించనేమో’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నాకేం అర్థం కాలేదు. కాళ్లూచేతులు ఆడలేదు. నేనలా చూస్తుండగానే ఏడుస్తూ వెళ్ళిపోయింది.
మర్నాడే తెలిసింది.. వాళ్లు ఊరు విడిచి వెళ్లిపోతున్నారని. చేరువ అయినట్టే అయ్యి దూరంగా వెళ్లిపోవడంతో మనసు విలవిల్లాడింది. ఆ సమయంలో మా ప్రేమ సాగరానికి ఫేస్‌బుక్‌ నావలా మారింది. చాటింగ్‌తో మళ్లీ దగ్గరయ్యాం. కొన్నాళ్లకు నా చదువు పూర్తయ్యాక జాబ్‌ కోసం నేనూ హైదరాబాద్‌ చేరాను. నేనొచ్చానని తెలిసి ప్రియ పసిపాపలా కేరింతలు కొట్టింది. కలుసుకోవడాలు, కబుర్లు, ఊసులు, కోపతాపాలు.. మా ప్రేమ జోరందుకుంది. నేను ఉద్యోగంలో చేరడంతో ఆ వేగానికి బ్రేకులు పడ్డాయి. అయినా ఒకరిపై ఒకరికి ఇష్టం ఇసుమంతైనా తగ్గలేదు. ఇక మిగిలింది మేం శుభ ఘడియల కోసం ఎదురుచూడటమే.
‘డియర్‌ నాకుద్యోగం వచ్చింది. కానీ వేరేచోట పోస్టింగ్‌. జాబ్‌ వచ్చిందని సంతోషించాలా? నిన్నొదిలి వెళ్తున్నానని ఏడవాలా?’ అంటూ ఫోన్‌ చేసిందోరోజు. నాకూ బాధగానే ఉన్నా మంచి అవకాశం వదులుకోవద్దని చెప్పి పంపించా. ఇద్దరం బిజీ అయిపోయాం. ఎప్పుడో ఒకసారి మెసేజ్‌ చేసి బాగోగులు తెలుసుకోవడమే తప్ప ఫోన్‌ చేసి తీరిగ్గా మాట్లాడింది లేదు. ఒక్కోసారి గొంతు నుంచి మాటలు రాక మౌనంగా ఉండే వాళ్లం. దూరం అయిపోతున్నామేమో అనే భయం వెంటాడేది. కానీ ఆలోచిస్తే నా మనసంతా ప్రియ జ్ఞాపకాలతోనే నిండిపోవడంతో ఫోన్లో సరిగా మాట్లాడలేకపోతున్నానేమో అనిపించేది. ఈసారి ఎదురుపడినప్పుడు నా గుండె గొంతుకని తనకు రోజంతా వినిపిస్తా. మొదటిసారి నన్ను హత్తుకొని ప్రియ తనవాణ్ని చేసుకుంది. నేనూ తన రాక కోసం ఎదురుచూపుల తోరణాలు గుమ్మానికి కట్టి ఆమె కౌగిలిలో బందీ కావడానికి సిద్ధంగా ఉన్నా.                        

 

- నీ ప్రేమ పిపాసి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని