Updated : 25/04/2021 08:52 IST

రాత్రి వేళ బయటికొస్తే కేసులే!

అనుమతి ఉన్నవారికి గుర్తింపు కార్డు తప్పనిసరి!
రాత్రి కర్ఫ్యూపై నిబంధనల ఖరారు
శనివారం నుంచే అమల్లోకొచ్చిన ఆంక్షలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూ శనివారం నుంచి అమలులోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం పలు నిబంధనలతో కూడిన ఉత్తర్వులను శనివారం జారీ చేసింది. ప్రతిరోజూ.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం అయిదింటి వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని పేర్కొంది. ఈ సమయంలో ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు, ఔషధ దుకాణాలు, అత్యవసర సేవలందించే సంస్థలు తప్ప మిగిలిన అన్ని కార్యాలయాలు, సంస్థలు, రెస్టారెంట్లు.. మూసి వేయాలని ఆదేశించింది. ఈ సమయంలో జనం కూడా అత్యవసరమైతే తప్ప బయట తిరగొద్దని సూచించింది.

ఎవరెవరికి సడలింపు
* ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, టెలీకమ్యూనికేషన్స్‌, ఇంటర్‌నెట్‌ సర్వీసులు, బ్రాడ్‌కాస్టింగ్‌, కేబుల్‌ సర్వీసులు, ఐటీ, సంబంధిత సేవలు, పెట్రోలు, గ్యాస్‌ బంకులు, విద్యుత్‌ సంస్థలు, నీటి సరఫరా, శానిటేషన్‌ సంస్థలు, కోల్డ్‌ స్టోరేజీలు, వేర్‌ హౌస్‌లు, ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసులు, నిరంతరం సాగాల్సిన సేవలకు సంబంధించిన తయారీ కేంద్రాలు, ఫుడ్‌ డెలివరీ సర్వీసులు వంటి వాటిలో పనిచేసే వారు బయట తిరగొచ్చు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, పంచాయతీరాజ్‌ ఉద్యోగులు, అత్యవసర సేవల ఉద్యోగులు... సరైన డ్యూటీ, ఐడీ కార్డులను చూపించి అవసరముంటేనే బయట తిరగొచ్చు.
* వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, హాస్పిటాలిటీ సేవల సిబ్బంది గుర్తింపు కార్డులతో తిరగొచ్చు.
* గర్భిణులు, వైద్య సేవలవసరమైన రోగులు బయటకు రావొచ్చు.
* ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్‌లు, బస్‌ స్టేషన్‌లకు రాకపోకలు జరిపే వారు... సరైన గుర్తింపు కార్డు చూపించాలి.
* రాష్ట్రంలో, రాష్ట్రం బయటకు గూడ్స్‌ సరఫరాపై ఎలాంటి ఆంక్షలూ లేవు.
* ఆటోలు, టాక్సీలు ఇతర ప్రజా రవాణా వాహనాలు.. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. కర్ఫ్యూ సయయంలో పైన పేర్కొన్న వారి కోసం పనిచేయొచ్చు.

ఎప్పటి వరకు...: ఆంక్షల సడలింపుపై తదుపరి ప్రకటన వచ్చేంత వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయి. నిబంధనలను అతిక్రమిస్తే.. విపత్తు నిర్వహణ చట్టం-2005 సెక్షన్‌ 51, 60, ఐపీసీ 188, తదితర చట్టాల కింద కేసులు పెట్టే అవకాశముంది.

అంతటా రాత్రి కర్ఫ్యూ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా శనివారం రాత్రి పది గంటలకు రాత్రి కర్ఫ్యూ మొదలైంది. మొదటి రోజు కావడంతో ప్రజలకు అవగాహన కల్పించడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. మరో రోజు ప్రచారం కల్పించి ఆపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పలు చోట్ల వాహనాలను దారి మళ్లించారు. కొన్నిచోట్ల బారికేడ్లతో దారులు మూసివేశారు. విజయవాడలోని ప్రధాన కేంద్రాలు.. బెంజి సర్కిల్‌, కాళేశ్వరరావు మార్కెట్‌, బిసెంట్‌ రోడ్డు వంటి ప్రాంతాల్లో పోలీసులు దుకాణాలను మూసేయించారు. రాత్రి 11వరకూ దుకాణాలు తెరిచి ఉండే బిసెంట్‌ రోడ్డు తొమ్మిదింటికే నిర్మానుష్యంగా మారింది. ఆర్టీసీ బస్సులను సైతం జాతీయ రహదారి వైపు దారి మళ్లించారు.  విశాఖలోని ప్రధాన కూడళ్ల వద్ద రాత్రి తొమ్మిదింటినుంచే జనం రాకపోకలు తగ్గాయి. శ్రీకాకుళంలో పది తరువాత జనం పెద్దగా బయటకు రాలేదు. సాయంత్రం ఆరింటికే కొందరు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేశారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో సైతం ఎనిమిదింటి తరువాత దుకాణాలను స్వచ్ఛందంగా మూసేశారు. అనంతపురంలో సైతం కర్ఫ్యూ ఆంక్షలతో రోడ్లు నిర్మానుష్యమయ్యాయి.


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని