Updated : 03/11/2021 12:51 IST

Bypoll Results: అధికార పార్టీలదే హవా

 తెలంగాణ, హిమాచల్‌ మినహా ఇతర చోట్ల ఇదే పరిస్థితి
30 అసెంబ్లీ స్థానాల్లో భాజపాకు 7, కాంగ్రెస్‌కు 8
 ప్రాంతీయ పార్టీలకు 15 సీట్లు
కాంగ్రెస్‌, భాజపా, శివసేనలకు ఒక్కో లోక్‌సభ స్థానాలు
విజయ దుందుభి మోగించిన మమత

మండి (హిమాచల్‌ప్రదేశ్‌) లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించాక.. శిమ్లాలో విజయ సంకేతం చూపుతున్న కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రతిభాసింగ్‌

ఈనాడు-దిల్లీ, గువాహటి: దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 30 శాసనసభ, 3 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌ మినహా మిగిలిన రాష్ట్రాల్లో అధికార పార్టీలు పట్టు నిలుపుకొన్నాయి. గతంలో వీటిలో పది అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్‌ బలం ఈసారి 8కి తగ్గింది. భాజపా బలం 6నుంచి 7కి పెరిగింది. మొత్తంగా ఎన్డీయే కూటమికి 14 స్థానాల్లో విజయం లభించింది. ఇదివరకు రెండు స్థానాల్లో గెలుపొందిన టీఎంసీ ఈసారి భాజపా నుంచి రెండింటిని కైవసం చేసుకుని పశ్చిమబెంగాల్‌లో మొత్తం 4 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఆ రాష్ట్రంలో భాజపాకు లభించిన ఓట్లు 15% కంటే తక్కువే కాగా టీఎంసీ 75 శాతానికి పైగా రాబట్టుకోగలిగింది. దీంతో ఆధిక్యాలు పెరిగాయి. మమత పోటీ చేయడం కోసం భవానీపుర్‌ స్థానానికి గతంలో రాజీనామా చేసి ఖర్దాహాలో ఇప్పుడు పోటీ చేసిన సోవన్‌దేవ్‌ ఛటోపాధ్యాయ 93 వేలకు పైగా ఆధిక్యంతో నెగ్గారు. బిహార్‌లో హోరాహోరీ పోరులో భాజపా మిత్రపక్షం జేడీయూ రెండు స్థానాలనూ నిలబెట్టుకుంది. అస్సాంలో భాజపా మిత్రపక్షమైన యూపీపీఎల్‌ తన బలాన్ని ఒకటి నుంచి రెండుకు పెంచుకొంది. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మేఘాలయ, నాగాలాండ్‌లలో 5 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. ఇదివరకు వీటిలో రెండు స్థానాల్లో కాంగ్రెస్‌, మరో రెండుచోట్ల స్వతంత్రులు గెలవగా ఇప్పుడు ఐదింటినీ అక్కడి ప్రాంతీయ పార్టీలే చేజిక్కించుకొన్నాయి. నాగాలాండ్‌లో మాత్రం ఎన్‌డీపీపీ తన ఒక్క స్థానాన్ని ఏకగ్రీవ ఎన్నిక ద్వారా నిలబెట్టుకొంది. కరోనా ముప్పు నేపథ్యంలో విజయోత్సవాలపై నిషేధాన్ని పాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల సీఈవోలను ఆదేశించింది.

హిమాచల్‌లో కమలనాథులకు షాక్‌
ఉప ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌లో భాజపాకు షాక్‌ తగిలింది. ముఖ్యమంత్రి జైరాం ఠాకుర్‌ సొంత జిల్లాలోని లోక్‌సభ స్థానాన్ని, మరో మూడు శాసనసభ స్థానాలను కూడా కాంగ్రెస్‌ గెలుచుకోవడం దీనికి కారణం. ఆ రాష్ట్రంలో వచ్చే ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రికి ఇబ్బందికరంగా మారాయి. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ మెజార్టీ స్థానాలను తమ పార్టీల తరఫున గెలుచుకొని.. అత్తెసరు మెజార్టీతో నడుస్తున్న ప్రభుత్వాలను పదిలపరచుకున్నారు.


ఉప ఎన్నికల్లో భాజపా విజయంపై భోపాల్‌లో వేడుకల్లో పాల్గొన్న మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌

లోక్‌సభ స్థానాల్లో ఇలా..
మూడు లోక్‌సభ సీట్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌, శివసేన ఒక్కో స్థానాన్ని కొత్తగా గెలుచుకున్నాయి. భాజపా ఒకటి కోల్పోయి మరొకటి నిలబెట్టుకొంది. కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్‌ హవేలీ లోక్‌సభ స్థానంలో శివసేన నెగ్గింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానంలో దివంగత సీఎం వీరభద్రసింగ్‌ సతీమణి ప్రతిభాసింగ్‌ (కాంగ్రెస్‌) నెగ్గారు. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో భాజపా అభ్యర్థి జ్ఞానేశ్వర్‌ పాటిల్‌ విజయం సాధించారు.

ప్రతి కార్యకర్త విజయమిది: రాహుల్‌
ఉప ఎన్నికల ఫలితాలు ప్రతిఒక్క కాంగ్రెస్‌ కార్యకర్త విజయమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. నిర్భీతిగా పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.  

అభయ్‌ చౌతాలాను వరించిన విజయం
రైతు ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చేసిన హరియాణా ఐఎన్‌ఎల్‌డీ అభ్యర్థి అభయ్‌ చౌతాలా మరోసారి నెగ్గి పట్టు నిరూపించుకున్నారు. ఇది స్థానిక భాజపా నాయకత్వానికి ఇబ్బందిపెట్టే ఫలితం.
* కర్ణాటకలో జేడీఎస్‌ నుంచి సింధగి స్థానాన్ని భాజపా గెలుచుకొంది. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సొంత జిల్లా హావేరీలోని హానగల్‌లో కాంగ్రెస్‌ చేతిలో భాజపా ఓటమి చవిచూడటం అక్కడి నాయకత్వానికి ఇబ్బందికరంగా మారింది.
* మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 2, భాజపాకు ఒక సిట్టింగ్‌ స్థానం ఉండగా, ఇప్పుడు కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానాల్లో భాజపా, భాజపా సిట్టింగ్‌ స్థానంలో కాంగ్రెస్‌ జయకేతనం ఎగురవేశాయి.
* హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఇదివరకు తన చేతిలో ఉన్న రెండు అసెంబ్లీ స్థానాలతోపాటు, భాజపా చేతిలో ఉన్న మరో స్థానాన్ని, మండీ లోక్‌సభ స్థానాన్ని చేజిక్కించుకొని వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు హెచ్చరిక సంకేతాన్ని పంపినట్లయింది.
* రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ తన స్థానాన్ని నిలబెట్టుకోవడంతోపాటు, భాజపా చేతిలో ఉన్న మరో స్థానాన్ని చేజిక్కించుకొని అక్కడి ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.
* పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుత హోం శాఖ సహాయ మంత్రి నిషిత్‌ ప్రమాణిక్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో దిన్‌హటా స్థానం నుంచి కేవలం 57 ఓట్ల తేడాతో గెలుపొందారు. అప్పటికే లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ఆయన.. గెలిచిన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. ఇప్పుడు తృణమూల్‌ కాంగ్రెస్‌ దాదాపు 1.65 లక్షల ఆధిక్యంతో విజయదుందుభి మోగించింది. మరో మూడు నియోజకవర్గాల్లో 1.40 లక్షలు, 97వేలు, 64వేల భారీ మెజార్టీతో తృణమూల్‌ అభ్యర్థులు భాజపా అభ్యర్థులను ఓడించారు.
*అస్సాంలో అయిదు శాసనసభ స్థానాల్లోనూ అధికార కూటమి అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. మూడు స్థానాల్లో భాజపా అభ్యర్థులు గెలుపొందారు. మిత్రపక్షం యునైటెడ్‌ పీపుల్స్‌ పార్టీ లిబరల్‌ రెండు చోట్ల గెలిచింది.

 


క్ర.సంఖ్య  రాష్ట్రం       సీట్లు      భాజపా      కాంగ్రెస్‌      ప్రాంతీయ పార్టీలు


1.   ఆంధ్రప్రదేశ్‌        1         -       -           1  వైకాపా
2.   అస్సాం           5        3       -           2 యూపీపీఎల్‌
3.   బిహార్‌           2         -        -           2 జేడీయూ
4.   హరియాణా       1        -        -           1 ఐఎన్‌ఎల్‌డీ
5.  హిమాచల్‌ప్రదేశ్‌   3         -         3            -
6.   కర్ణాటక         2        1          1             -
7.   మధ్యప్రదేశ్‌     3         2         1             -
8.   మహారాష్ట్ర      1        -          1            -
9.   మేఘాలయ    3         -          -             2 ఎన్‌పీపీ, 1 యూడీపీ
10.   మిజోరం      1         -         -             1 మిజో నేషనల్‌ ఫ్రంట్‌
11.   నాగాలాండ్‌    1         -         -              1 ఎన్‌డీపీపీ (ఏకగ్రీవం)
12.   రాజస్థాన్‌      2         -        2             -
13.   తెలంగాణ     1         1        -              -
14. పశ్చిమ బెంగాల్‌  4        -        -             4 తృణమూల్‌


    మొత్తం         30        7        8            15 


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని