Updated : 02/11/2021 10:08 IST

PM Modi: విధ్వంసకర వినియోగం ఆపుదాం

  పర్యావరణ అనుకూల జీవనశైలిని అలవర్చుకుందాం

  ‘పారిస్‌ సదస్సు’ స్ఫూర్తితో భారత్‌ మున్ముందుకు

  ‘కాప్‌26’ సదస్సులో ప్రధాని మోదీ

గ్లాస్గో: తెలివితక్కువ, విధ్వంసకర వినియోగానికి వెంటనే ముగింపు పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. పర్యావరణ అనుకూల జీవనశైలిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, దీన్ని ప్రపంచ కార్యక్రమంగా మార్చాలని సూచించారు. సోమవారం ఆయన గ్లాస్గోలో ‘కాప్‌26’ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని అరికట్టేందుకు భారత్‌ తీసుకుంటున్న చర్యలను, ఈ విషయంలో దేశ వైఖరిని ఆయన విస్పష్టం చేశారు.

‘‘నా దృష్టిలో పారిస్‌ వాతావరణ సదస్సు ఒక శిఖరాగ్ర సమావేశం కాదు. అదొక అంకితభావం. ఆ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను మనసా, వాచా, కర్మనా ఆచరిస్తున్న భారీ ఆర్థిక వ్యవస్థ భారత్‌ మాత్రమేనని ఇప్పుడు ప్రపంచమంతా అంగీకరిస్తోంది. పుడమి జనాభాలో 17% ఉన్న భారత్‌ది మొత్తం ఉద్గారాల్లో 5% వాటా మాత్రమేనని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల మనుగడకు వాతావరణ మార్పులు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. సవాళ్లు విసురుతున్నాయి. ఈ మార్పుల ప్రభావాలను నియంత్రించడంలో భారత్‌ శక్తికి మించి కృషి చేస్తోంది. ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భరిస్తూనే ఉంది. వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుంటూనే మా దేశం విధానాలను రూపొందించుకుంటోంది. 2030 నాటికి శూన్య ఉద్గార స్థాయికి చేరుకోవాలని భారతీయ రైల్వే సంకల్పించింది. అప్పటికి కార్బన్‌ ఉద్గారాలను 1 బిలియన్‌ టన్నుల మేర తగ్గిస్తాం. 2070 నాటికి భారత్‌ సున్నా ఉద్గారాల స్థాయిని అందుకుంటుంది. ఆ దిశగా శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించి, పునరుత్పాదక ఇంధన వాడకాన్ని పెంచుతున్నాం. వాతావరణ మార్పులను తట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామన్న హామీలేవీ ఇంతవరకూ నెరవేరలేదు. ఈ విషయంలో విఫలమైన దేశాలపై ఒత్తిడి తేవాల్సిన తరుణమిది. భూతాపాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందిన దేశాలు వీలైనంత త్వరగా     లక్ష కోట్ల డాలర్ల నిధులను సమకూర్చాలి’’ అని మోదీ పేర్కొన్నారు.

వాతావరణ సదస్సు వేదిక వద్ద బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ఐక్యరాజ్య సమితి
సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌తో మోదీ మాటామంతీ

 సర్దుబాటు చర్యలకు ప్రాముఖ్యత 

అంతర్జాతీయ చర్చల్లో వాతావరణ మార్పులకు అనుగుణంగా జీవనాన్ని సర్దుబాటు చేసుకోవడానికి సరైన ప్రాధాన్యం దక్కడం లేదని ప్రధాని మోదీ మరో కార్యక్రమంలో తెలిపారు. విపత్తుల అనంతరం ఉపశమనానికి తీసుకునే చర్యల స్థాయిలో దానిపై దృష్టి పెట్టడంలేదని ఆక్షేపించారు. దీనివల్ల దుర్బల దేశాలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ‘‘ప్రకృతికి హాని తలపెట్టని రీతిలో జీవనాన్ని సాగించే సంప్రదాయ పద్ధతిపై అనేక జాతులకు మంచి అవగాహన ఉంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే మన విధానాల్లో ఇలాంటి వాటికి ప్రాముఖ్యత ఉండాలి. ఆ విజ్ఞానం భవిష్యత్‌ తరాలకు అందాలి. పాఠశాలల్లో పాఠ్యాంశంగా వాటిని బోధించాలి’’ అని ఆయన పేర్కొన్నారు. నిర్ణీత సమయం కంటే ఎక్కువగా సుమారు పది నిమిషాలు మాట్లాడిన మోదీ... ఎక్కువ సమయం తీసుకున్నందుకు క్షమాపణలు కోరారు.  

మోదీ-జాన్సన్‌ భేటీ

కాప్‌26 సదస్సు వేదిక వద్ద మోదీ.. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భేటీ అయ్యారు. హరిత హైడ్రోజన్‌, పునరుత్పాదక ఇంధనాలు, శుద్ధ పరిజ్ఞానం, ఆర్థిక వ్యవస్థ, రక్షణ రంగం వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ ఏడాది మే నెలలో రెండు దేశాల నేతలు నిర్వహించిన వర్చువల్‌ శిఖరాగ్ర సదస్సులో ఈ అంశంపై అవగాహన కుదిరిన సంగతి తెలిసిందే. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి నిధుల సమీకరణ (క్లైమేట్‌ ఫైనాన్స్‌), పునరుత్పాదక ఇంధనాలు, అంతర్జాతీయ సౌర సంకీర్ణం (ఐఎస్‌ఏ), విపత్తులను తట్టుకొనే మౌలిక వసతుల సంకీర్ణం (సీడీఆర్‌ఐ) వంటి సంయుక్త కార్యక్రమాలపై బ్రిటన్‌తో కలిసి పనిచేస్తామని మోదీ చెప్పారు. భారత్‌ను సందర్శించాల్సిందిగా జాన్సన్‌ను మోదీ ఆహ్వానించారు. ఈ ఇద్దరు నేతల మధ్య ప్రత్యక్ష భేటీ జరగడం ఇదే మొదటిసారి.

ఇండియా గ్రీన్‌ గ్యారంటీ

భారత్‌లో హరిత ప్రాజెక్టుల కోసం అదనంగా 75 కోట్ల పౌండ్లను సమకూర్చుకునేందుకు బ్రిటన్‌ ‘ఇండియా గ్రీన్‌ గ్యారంటీ’ని ఇస్తుంది. దీనివల్ల శుద్ధ ఇంధనం, రవాణా, పట్టణాభివృద్ధి వంటి రంగాల్లో పర్యావరణ అనుకూల, దృఢ మౌలిక వసతులకు నిధులు లభిస్తాయి. దీనికితోడు ప్రైవేటు మౌలిక వసతుల అభివృద్ధి బృందం (పీఐడీజీ) ద్వారా వర్ధమాన దేశాల్లో పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు 21 కోట్ల డాలర్ల పెట్టుబడులకూ బ్రిటన్‌ సమ్మతించింది. దీనికింద భారత్‌లో విద్యుత్‌ వాహనాల ప్రాజెక్టులకూ నిధులు అందుతాయి.


ప్రవాస భారతీయుల ఘన స్వాగతం

ఐరాస వాతావరణ సదస్సు ‘కాప్‌26’లో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోమ్‌ నుంచి సోమవారం ఉదయం గ్లాస్గో చేరుకున్నారు. గ్లాస్గోలో స్కాట్లాండ్‌ బ్యాగ్‌పైపర్లు బాణీలను ఆలపిస్తూ ఆయనకు స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో భారత సంతతి ప్రజలు ఆయనను చూసేందుకు వచ్చారు. ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు. గ్లాస్గో, ఎడిన్‌బరోకు చెందిన భారత సంతతి ప్రతినిధులు మోదీతో భేటీ అయ్యారు. వీరిలో ప్రముఖ వైద్యులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ తన శిలా ప్రతిమను ఆవిష్కరించారు. హకీం అనే ప్రవాస భారతీయ వైద్యుడు దీన్ని ప్రధానికి బహుకరించారు. ఈ విగ్రహానికి పెట్టడం కోసం ప్రధాని తన కళ్లద్దాలను ఇచ్చారు. బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ విలియమ్‌ నిర్వహించిన ‘ఎర్త్‌ షార్ట్‌ ప్రైజ్‌’ విజేత, దిల్లీకి చెందిన రీసైక్లింగ్‌ సంస్థ టకాచార్‌ వ్యవస్థాపకుడు విద్యుత్‌ మోహన్‌, సౌర శక్తితో నడిచే ఇస్త్రీ బండిని రూపొందించిన 14 ఏళ్ల తమిళనాడు బాలిక వినిషా ఉమాశంకర్‌లను కలుసుకున్నారు.


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని