Education: చదు‘వర్రీ’!

విద్యార్థుల అభ్యసనంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఎక్కువ రోజులు ఇంటికే పరిమితం కావడం, ఆన్‌లైన్‌ చదువులకు అలవాటుపడడంతో వారిలో అనేక మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాఠశాలలు

Updated : 27 Oct 2021 06:33 IST

విద్యార్థుల అభ్యసనంలో మార్పులు స్పష్టం

ఆన్‌లైన్‌ నుంచి ప్రత్యక్ష బోధనకు వచ్చాక ఇదీ పరిస్థితి

ఈనాడు - అమరావతి

విద్యార్థుల అభ్యసనంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఎక్కువ రోజులు ఇంటికే పరిమితం కావడం, ఆన్‌లైన్‌ చదువులకు అలవాటుపడడంతో వారిలో అనేక మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభమైన ఆగస్టు 16నుంచి వారు బడులకు వస్తున్నారు. 2020 మార్చిలో బడులు మూతపడ్డాయి. అప్పటినుంచి విద్యార్థులు దాదాపు ఇళ్లకే పరిమితమయ్యారు. గత విద్యా సంవత్సరం (2020-21)లో ఉన్నత పాఠశాలలు నవంబరు 2 నుంచి విడతలవారీగా, ప్రాథమిక బడులు ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్‌ 20 వరకు ప్రత్యక్ష తరగతులను నిర్వహించాయి. కరోనా రెండో దశ సమయంలో మళ్లీ మూతపడ్డాయి. దాదాపు ఏడాదికిపైగా ఆన్‌లైన్‌, టీవీ పాఠాలే కొనసాగాయి. ఈ సదుపాయాలు లేనివారు చదువుకే దూరమవ్వాల్సిన పరిస్థితులేర్పడ్డాయి.


‘కరోనాతో గ్రామీణ విద్యార్థులు చాలా నష్టపోయారు. ప్రాథమిక విద్యలో 90శాతం మంది విద్యార్థులు అభ్యసన సామర్థ్యాన్ని సగానికిపైగా కోల్పోయారు. ఆన్‌లైన్‌లో బోధించినా ఎక్కువ ప్రయోజనం కనిపించలేదు. ఎక్కువసేపు ఇళ్లలో ఉండిపోవడంతో తరగతి గదుల్లో విద్యార్థులకు ఏకాగ్రత సరిగా ఉండడం లేదు.’

- చలపతి, ఉపాధ్యాయుడు, కాజులూరు, తూర్పుగోదావరి జిల్లా


వెనకబడిన విద్యార్థులకు పునశ్చరణ

‘విద్యార్థులకు ప్రస్తుతం ఫార్మెటివ్‌-1 పరీక్షలు నిర్వహించాం. వీటిల్లో వెనకబడిన వారికి నవంబరులో పునశ్చరణ ఉంటుంది. ఆ నెల చివరిలో ఫార్మెటివ్‌-2 నిర్వహిస్తాం. మళ్లీ పునశ్చరణ నిర్వహిస్తాం. ఇది నిరంతర ప్రక్రియ. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటికీ వర్తిస్తుంది’

- చినవీరభద్రుడు, సంచాలకులు, పాఠశాల విద్య


ఏమేం మార్పులు..

* అభ్యసనం, ఏకాగ్రతలో వెనకబాటు

* ఉపాధ్యాయులతో ఇన్నాళ్లూ ఉన్న సాన్నిహిత్యం దూరమై కొందరు విద్యార్థులు ముభావంగా గడపడం

* ఇంటికెళ్లాక కూడా కొందరు విద్యార్థులు కొంతసేపైనా సెల్‌ఫోన్లు చూడకుండా ఉండలేకపోవడం

* తరగతి గదిలో ఎక్కువ సమయం కూర్చునేందుకు పిల్లల ఇబ్బందులు

* గతంలో పాఠం చెబుతున్నప్పుడు అడిగే ప్రశ్నలకు వెంటనే స్పందించేవారు ఇప్పుడు మౌనంగా ఉండటం

* విద్యార్థుల చేతిరాతలో తగ్గిన వేగం


చూసిరాసేందుకే ఎక్కువ సమయం 

బోర్డుపై రాసే పాఠ్యాంశాలను గతంలో ఉపాధ్యాయులు పూర్తి చేసే సమయంలోనే దాదాపు అందరూ పుస్తకాల్లో రాసుకునేవారు. ఇప్పుడు అందరూ రాసుకునేందుకు అదనంగా 8-10 నిమిషాలనివ్వాల్సి వస్తోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పిల్లలు చదువులో వెనకబడుతున్నారంటూ ప్రైవేటు విద్యాలయాల ఉపాధ్యాయులకు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ఆన్‌లైన్‌ తరగతుల కారణంగా ఇంట్లో ఎక్కడోచోట కూర్చున్న విద్యార్థులు ఇప్పుడు బడిలో ఎక్కువసేపు కూర్చునేందుకు ఇబ్బంది పడుతున్నారు.


ప్రాథమికం 3నెలలే..

ప్రాథమిక పాఠశాలలు గతేడాది 3నెలలు మాత్రమే కొనసాగాయి. విద్యా సంవత్సరం ముగియడంతో వారంతా పైతరగతులకు వచ్చేశారు. 1,2,3 తరగతులకు చాలా బడులు ఆన్‌లైన్‌ పాఠాలు కొనసాగించలేదు. గతేడాది ఒకటో తరగతిలో చేరాల్సిన పిల్లవాడు ఇంటి వద్దే ఉండి ఇప్పుడు బడికి వెళ్తున్నాడు. ఏడాది చదువు ఇంటి వద్ద గడిచింది. వయసురీత్యా వీరిని పైతరగతుల్లో చేర్చడంతో బడి వాతావరణానికి అలవాటు పడేందుకు ఇబ్బంది పడుతున్నారు. బడికి వెళ్లడం బాధ్యత అని సానుకూల దృక్పథంతో తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలని, ప్రస్తుతం ఆఫ్‌లైన్‌ తరగతులు జరుగుతున్నందున ఫోన్‌కు దూరంగా ఉంచడం మంచిదని కెరీర్‌ కౌన్సిలర్‌, సైకాలజిస్టు సుధీర్‌సండ్ర పేర్కొన్నారు.


పిల్లలు చెప్పిన మాట వినడం లేదు

‘చెప్పినమాట వినడం లేదని, సరిగా చదవడం లేదని గుంటూరుకు చెందిన పదో తరగతి విద్యార్థిని తల్లిదండ్రులు నా వద్దకు వచ్చారు. కరోనా సమయంలో ఒత్తిడికి గురికావడం, ఒంటరిగా ఉండడం, ఆన్‌లైన్‌ తరగతులకే పరిమితమవడంతో అభ్యసనలో వెనకబడుతున్నారు. వారి ప్రవర్తనలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. విద్యార్థులను ఒకేసారి ఒత్తిడికి గురిచేయకుండా సానుకూల దృక్పథంతో చదువు ప్రాధాన్యం చెప్పాలి. కొన్ని పాఠ్యాంశాలు ఒకసారి, మరికొన్ని ఇంకోసారి చదువుకోమని చెప్పాలి. తరగతిలో ఉపాధ్యాయులు పిల్లలతో మమేకం కావాలి.’

-డాక్టర్‌ టీఎస్‌ రావు, అధ్యక్షుడు, కౌన్సెలింగ్‌ సైకాలజిస్టుల సంఘం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని